ప్రకృతి మూలుగ పీల్చేస్తున్నాం..

Living Planet Report 2018 On Biodiversity - Sakshi

జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి నుంచి మనం పొందే సేవలు ఎంతో అమూల్యమైనవి. ముఖ్యంగా, మనం తినే ఆహారం, శుద్ధమైన నీరు, ఇంధనం.. వీటన్నిటికీ జీవవైవిధ్యం, ప్రకృతే మూలాధారం. మన మనుగడకు మాత్రమే కాదు మన సంస్కృతులకు, మన అస్తిత్వానికి, మన జీవన ఆనందాలకు కూడా ఇవి ప్రాణాధారాలు. అయినప్పటికీ, మనం పట్టించుకోవడం లేదు. ఆధునిక మానవుల దైనందిన జీవితం ప్రకృతి నుంచి విడివడి పోవడమే ఇందుకు కారణం. 

మన ఆర్థిక కలాపాలన్నీ అంతిమంగా ప్రకృతిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రకృతి మనకు అందించే వివిధ రకాల సేవల విలువ నిజానికి అమూల్యం. అయితే, ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం ప్రకృతి సేవల విలువ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 125 ట్రిలియన్‌ డాలర్ల మేరకు ఉంటుంది. ప్రకృతిని స్థిమితంగా ఉంచగలిగేంత మేరకు వనరుల వినియోగం జరిగే పర్వాలేదు. కానీ, మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఎంతగానంటే, ప్రకృతి తిరిగి తెప్పరిల్ల లేనంతగా ఏకంగా 70% అధికంగా వాడేస్తున్నాం. ఈ వత్తిడి వల్ల ప్రపంచవ్యాప్తంగా భూమి పైన, నేల లోపల ప్రాణప్రదమైన జీవ జాతులు, జీవరాశి చాలా వేగంగా అంతరించిపోతోందని లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2018 చెబుతోంది. వెన్నెముక లేని జీవులు 1970–2014 మధ్యకాలంలో 60% అంతరించిపోయాయి. దక్షిణ, మధ్య అమెరికాలోని ఉష్ణమండలాల్లో జంతువుల సంతతి మరీ ఎక్కువగా 89% నశించాయి. మంచినీటిలో పెరిగే జంతువులు కూడా 1970తో పోల్చితే 83% నశించాయి. ప్లాస్టిక్‌ కాలుష్యం సముద్రాలు, నదులను నాశనం చేసింది. 

విశ్వవిఖ్యాత నిపుణులు మనకు ఇస్తున్న సందేశపు సారాంశం ఏమిటంటే.. పొదుగు కోసి పాలు తాగటం మానాలి. ప్రకృతికి తీరని హాని చేసేలా ప్రవర్తించడం మనం ఇప్పటికిప్పుడు ఆపెయ్యాలి. లేదంటే, మన భవిష్యత్తు మాత్రమే కాదు వర్తమానం కూడా మరింత దుర్భరంగా మారిపోతుంది. అయితే, అదృష్టం ఏమిటంటే.. ప్రాణప్రదమైన ప్రాకృతిక సంపదను పాక్షికంగానైనా పునరుద్ధరించుకునే దారులు మనకు రూఢిగా తెలుసు. ప్రకృతిలో జీవజాతులు, జంతుజాలంపై, అడవులపై వత్తిడిని తగ్గించేలా వ్యవసాయ పద్ధతులను, విలాసాలను, ఆహార విహారాలను మార్చుకోవటం అత్యవసరం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top