
చిక్కటి చీకటిలో చింతలేకుండా నిద్ర పొమ్మని నాయికకు చెప్పాలి! కానీ ధైర్యం ఇవ్వడానికి నాయకుడు ఇస్తున్న ప్రతీకలేమిటి? పిట్టల అరుపులు, పొదల సడులతోపాటు సాక్షాత్తూ వనమే వద్దకొచ్చి నిద్రపుచ్చుతుందట. రాత్రిలో భీతి కలిగించేవాటితోనే ప్రీతి కలిగిస్తున్నాడు కవి. ‘క్షణక్షణం’ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన– ‘జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా’ గురించి మాట్లాడుతున్నట్టుగా అర్థమైపోయివుంటుంది కదా!
‘కుహు కుహు సరాగాలే శ్రుతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక పుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ’ అంటూ సాగే ఈ పాటలో ‘మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో’ అని కమ్మని కల కనమంటాడు. ‘చిటికలోన చిక్కబడ్డ కఠిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి’ అని ముక్తాయింపు ఇస్తాడు. 1991లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. ఆయన స్వరకల్పన చేసిన అత్యుత్తమ గీతాల్లో ఇదీ ఒకటి. పాడింది బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. నటీనటులు శ్రీదేవి, వెంకటేశ్. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వర్మ ఉత్తమ చిత్రాల్లో కూడా ఇదొకటి.