బళ్లారి ముద్దుబిడ్డ

J Om Prakash Died in Mumbai - Sakshi

నివాళి

‘జై జై శివశంకర్‌’... అనే పాట రేడియోలో రోజూ వస్తుంటుంది. ‘తుమ్‌ ఆగయే హో నూర్‌ ఆగయా హై’ పాట కూడా ఎప్పుడూ వినపడుతుంటుంది. ‘షీషా హో యా దిల్‌ హో టూట్‌ జాతా హై’ చాలా పెద్ద హిట్‌. ఈ పాటలన్నీ ఉన్న సినిమాల సూత్రధారి, రూపకర్త జె. ఓంప్రకాష్‌ బుధవారం ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. మొదట నిర్మాతగా, ఆ తర్వాత దర్శకుడిగా జె. ఓంప్రకాష్‌ హిందీ ఇండస్ట్రీలో అరవయ్యవ దశకం నుంచి యనభయ్యవ దశకం వరకు మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పారు. తన సినిమా టైటిల్స్‌ ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే సెంటిమెంట్‌ను పాటించిన ఓంప్రకాష్‌ ‘ఆయే మిలన్‌ కి బేలా’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌ కే’, ‘ఆంఖో ఆంఖోమే’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజేష్‌ ఖన్నా, ముంతాజ్‌లతో ‘ఆప్‌ కీ కసమ్‌’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు.

ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇందులోని ‘జై జై శివశంకర్‌’, ‘జిందకీ కే సఫర్‌ మే’ పాటలు చాలా హిట్‌. ఈ సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా ‘ఏడడుగుల బంధం’గా రీమేక్‌ చేశారు. ఆ తర్వాత రీనా రాయ్, జితేంద్రలతో ‘ఆశా’ సినిమాను తీశారు. ఇందులోని ‘షీషా హో యా దిల్‌ హో’ పాట, ‘ఆద్‌మీ ముసాఫిర్‌ హై’ పాటలు హిట్‌ అయ్యాయి. ఎన్‌.టి.ఆర్‌ హీరోగా ఇదే సినిమాను ‘అనురాగదేవత’గా రీమేక్‌ తీస్తే పెద్ద హిట్‌ అయ్యింది. తమిళంలో కూడా ఇదే సినిమా రీమేక్‌ చేశారు. గుల్జార్‌ దర్శకత్వంలో తీసిన ‘ఆంధీ’ ఆ రోజుల్లో సంచలనమే సృష్టించింది. ఇందులోని పాటలూ హిట్టే. తన కుమార్తె పింకీని రాకేష్‌ రోషన్‌కు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా జె. ఓంప్రకాష్‌ సంగీత దర్శకుడు రోషన్‌కు వియ్యంకుడయ్యారు. హృతిక్‌ రోషన్‌కు తాతయ్యారు. జె. ఓంప్రకాష్‌ మరణవార్త విని అమితాబ్, ధర్మేంద్ర వంటి బాలీవుడ్‌ దిగ్గజాలు తరలి వచ్చి నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం రోజునే ముంబైలో ముగిశాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top