యత్ర నార్యస్తు పూజ్యంతే

In Indian tradition God is a supreme power - Sakshi

అరుంధతిని వివాహమాడాడు వశిష్ఠుడు. వివాహ కాలంలో అరుంధతి నక్షత్రం చూపుతారు. అది ఒక స్త్రీకి భారతీయ సంస్కృతి ఇచ్చిన స్థానం.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు. ఋగ్వేదంలోని దేవీ సూక్తం, స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. ‘నేను మహారాణిని, సంపదను సేకరిస్తాను, ఆలోచిస్తాను, తొలి వందనం స్వీకరిస్తాను, అందువల్లే భగవంతుడు నన్ను ప్రతి ఇంట్లోను నెలకొల్పాడు.

నా కారణంగానే ఇంటిల్లిపాదీ ఆహారం తీసుకుంటారు, గాలి పీలుస్తారు, వింటారు, మాట్లాడతారు’ అంటుంది స్త్రీ. దేవీ సూక్తం స్త్రీని అగ్రస్థానాన నిలబెట్టింది. బ్రహ్మమానసపుత్రిక దేవి అని, ఆమె నుంచే ప్రకృతి, పురుషుడు ఉద్భవించారని చెబుతోంది. ఉపనిషత్తులకు సంబంధించిన చర్చలలో గార్గి, మైత్రేయి వంటి వారు పాల్గొని విజయం సాధించారు. భవభూతి ఉత్తర రామచరితలో ఆత్రేయి... దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారతానికి ప్రయాణించిందని, భారతీయ వేదాంతం చదివిందని ప్రస్తావించాడు. శంకరాచార్యునితో ఉభయభారతి జరిపిన చర్చలో వేదాల ప్రస్తావన తెస్తుంది.

ఇతిహాసాలు...
రామాయణంలో సీతను అత్యున్నతంగా చూపాడు వాల్మీకి. వేదకాలంలో ఏ పురుషుడూ ఎంత కోపం వచ్చినా స్త్రీని ఒక్క మాట కూడా పరుషంగా పలికేవాడు కాదని, తన సంతోషం, సౌఖ్యం, ఆనందం, సుగుణవంతుడిగా నిలబడటం కోసం భార్య మీదే ఆధారపడేవాడని తెలుస్తోంది. ఋషులు సైతం స్త్రీలు లేకుండా సంతానాన్ని సృజియించలేమని పలికారు. (ఆదిపర్వం మహాభారతం).
మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కూతురు కొడుకుతో సమానమని భీష్ముడు అంటాడు.శివపార్వతుల సంవాదంలో స్త్రీలకు ఏయే బాధ్యతలు ఉంటాయని శివుడు పార్వతిని ప్రశ్నిస్తాడు. మంచితనంతో పాటు, మృదు భాషణం, సత్ప్రవర్తన, మంచి లక్షణాలు కలిగి ఉండాలి స్త్రీలు అంటుంది పార్వతి.

భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే ఒక అతీత శక్తి అని అర్థం. స్త్రీ రూపం కాని, పురుష రూపం కాని భగవంతునికి లేదు. పంచభూతాలలో నీరు, భూమి ఈ రెండింటినీ స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాత అని వారిని గౌరవంగా, ఆప్యాయంగా పిలుచుకున్నారు. భారతీయ సంప్రదాయం స్త్రీకి పెద్దపీట వేసి గౌరవించింది. స్త్రీలు వేదాలు చదవాలని చెప్పింది. బ్రహ్మచర్యంలో ఉన్న యువతి పట్టా పుచ్చుకుని, తనకు సరైన వరు ని ఎంచుకోవాలని అధర్వ వేదం చెబుతోంది.  వరుడిని ఎంచుకునే హక్కు వధువుదే. అందుకే స్వయంవరం ప్రకటించి, వచ్చిన వారిలో నుంచి తనకు నచ్చినవారిని ఎంచుకుంటుంది వధువు. 
– డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top