అమ్మాయంటే 'ఇల్హా' ఉండాలి!

  Ilhan Omar featured on cover of Time - Sakshi

వీలైతే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఇలా ఉండాలి. భలే చెబుతారు! గర్భంలోనే ఉండనివ్వడం లేదు.. ఇంట్లో అమ్మాయి ఉండాలా?! అమ్మాయి పుట్టడమే గగనం. పుట్టాక గౌరవంగా ఎదగడమే భాగ్యం. ఇలాంటి ప్రపంచంలో... కరవు కోరల సోమాలియా గర్భం నుంచిఅమెరికా నాభి పైకి విచ్చుకున్న నల్లకలువ ఇల్హా ఒమర్‌! అవును.. అమ్మాయింటే ఇలా ఉండాలి! మనమ్మాయీ.. ఇల్హాలా ఉండాలి.

‘‘ఇది రెఫ్యూజీ క్యాంప్‌లోని ఎనిమిదేళ్ల ఓ అమ్మాయి విజయం’’ అంటూ ఉద్విగ్నంగా పలికిన ముప్పైనాలుగు సంత్సరాల ఓ స్త్రీ స్వరం ఆ వెంటనే గాద్గదికమైంది.  మాటలను మౌనం చేసింది. ఆనందబాష్పాలను రెప్పల మాటున  దాచింది. కొన్ని క్షణాల తర్వాత కళ్లు తెరిచి.. గొంతు సవరించుకుంది. ‘‘ఎన్నికల పేరుతో ఒక డిస్ట్రిక్ట్‌ను ఐక్యం చేయడం మాత్రమే మా ఉద్దేశం కాదు.. గెలుపుతో హౌజ్‌లో స్థానం సంపాదించుకోవడం, చరిత్ర సృష్టించడం  మా పంతం కాదు! పాలకుల మీద నమ్మకాన్ని కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేయడమే మా లక్ష్యం’’ అంటూ కంచు కంఠాన్ని ఖంగుమనిపించింది. ఆ హాల్లో హాజరైన జనసందోహం చప్పట్ల అభినందన ఆగలేదు. ఆమె ఇల్హా ఒమర్‌. 2016లో అమెరికాలో మిన్నెసోటా స్టేట్‌ సెనెట్‌కి ఎన్నికైన మొదటి మహిళ సోమాలి – అమెరికన్‌ వనిత. డెమోక్రాటిక్‌ ఫార్మర్‌ లేబర్‌ పార్టీ తరపున 60బి డిస్ట్రిక్‌ నుంచి మిన్నెసోటా సెనెట్‌లోకి తొలి అడుగులు వేసిన తూర్పు ఆఫ్రికా శివంగి. విజయోత్సవ నిండు సభలోకి ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి వచ్చి∙ఇల్హాను ఆలింగనం చేసుకుంటున్నారు, షేక్‌హ్యాండ్స్‌తో ప్రశంసిస్తున్నారు ఆత్మీయులు, స్నేహితులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు. అందరికీ అభివాదం తెలుపుతూ హుందాగా వేదికను చేరుకుంది.

‘‘ఈ విజయంతో యువత గొంతును వినిపిస్తున్నానుకుంటున్నా.. అమెరికాలో స్థిరపడిన తూర్పుఆఫ్రికా స్త్రీల గొంతుకగా నిలుస్తాననుకుంటున్నా.. ఈ దేశంలోని మొత్తం ముస్లింల గళంగా ఉంటాను.. అవకాశాల కోసం చూస్తున్న యంగ్‌మదర్స్‌కి ప్రతినిధినవుతాను. ఈ గెలుపు.. వైషమ్యానికి ఇక్కడ తావులేదని నిరూసపించింది. మినియాపోలీస్‌(మిన్నెసోటా రాష్ట్రంలోని నగరం)లోని  భిన్నత్వంలో ఏకత్వాన్ని రుజువుచేసింది.. స్టేట్‌ గవర్నింగ్‌ బాడీలో ముస్లిం వనితలకూ స్థానముంటుందని నిరూపించిందీ విజయం’’ అని ఇల్హా అంటుంటే మరొక్కసారి చప్పట్లతో ఆ సభమారుమోగింది. గర్వంతో భార్యను గుండెకు హత్తుకున్నాడు ఆమె భర్త అహ్మద్‌ హిర్సి. ఆనందంతో ముగ్గురు పిల్లలూ ఆ తల్లిని చుట్టేసుకున్నారు!

ఆ దృశ్యం చూసిన అక్కడి ప్రతిఒక్కరి కళ్లల్లో సన్నని కన్నీటి తెర.. వేదన, బాధ, సంతోషం కలగలసి తేరుకున్న  ఆశల పొర!  వేదిక దిగి సరాసరి తన తాతగారి దగ్గరకు వచ్చింది ఇల్హా. తలవంచి గౌరవం ఇచ్చింది. ఆ తాత ఆ పిల్ల తలను పొట్టలో దాచుకున్నాడు. పొగిలి పొగిలి ఏడ్చాడు. తండ్రికీ నమస్కరించింది. దగ్గరకు తీసుకొని తల మీద ముద్దుపెట్టుకున్నాడు తండ్రి.
సొమాలియాలో సివిల్‌ వార్‌కు... రెఫ్యూజీ క్యాంప్‌లోని బాల్యవిహానికి... అమెరికాలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన ఆ బిడ్డను కళ్లల్లో నింపుకున్నాయి ఆ రెండు తరాలు. తాము నేర్పిన ధైర్యపాఠాలను ఒంటబట్టించుకొని.. రాజకీయ చదరంగంలో పావులు కదపడానిక్కాకుండా  సమన్యాయ శాసనాన్ని రాయడానికి వచ్చిన తమ మూడోతరాన్ని చూసి మురిసిపోయారు! ఇది విజయోత్సవ వేడుక.. చట్టసభలో ఇల్హపట్టమహోత్సవ పండుగ! అమెరికాలో ఈ నల్ల కలువ జయసాధనకు పోరు మొదలైంది తూర్పు ఆఫ్రికాలోని సొమాలియాలో! వయా కెన్యా యూఎస్‌ చేరిన.. ఛేదించిన వైనం వివరంగా...

విద్యావంతుల కుటుంబం
ఇల్హా 1982లో సొమాలియాలోని మొగదీషులో పుట్టింది. బేధాబోలో పెరిగింది. ఏడుగురు సంతానంలో చివరిది. తండ్రి నూర్‌ ఒమర్‌ మహ్మద్‌. టీచర్‌. తల్లి యెమెనీ. గృహిణి. ఇల్హా చిన్నప్పుడే అనారోగ్యంతో యెమెనీ చనిపోయింది. తండ్రి, తాత సంరక్షణలో పెరిగారు పిల్లలంతా. అందుకే ఇల్హాకు తాత (అబుకర్‌) అంత సాన్నిహిత్యం. సొమాలియాలోని నేషనల్‌ మెరైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఇల్హా బాబాయ్‌లు, పిన్నిలు సొమాలియా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నారు. ఇల్హాది విద్యావంతుల కుటుంబమే.

అల్లకల్లోలం
చక్కటి చదువు, ఆటపాటలతో హాయిగా సాగిపోతున్న ఇల్హా జీవితాన్ని 1991లో మొదలైన సివిల్‌ వార్‌ అల్లకల్లోలం చేసింది. ఆమె తన కుటుంబంతో సొమాలియాను వదిలి కెన్యాకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది. అప్పటిదాకా విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉన్న ఎనిమిదేళ్ల ఇల్హా  కెన్యా, మొబాసాలోని  రెఫ్యూజీ క్యాంపుల్లో బిక్కుబిక్కుమంట్లూ గడపాల్సి వచ్చింది. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన కాందీశీకుల జాడ్యం, మౌఢ్యానికి దూరంగానే ఆ కుటుంబం ఉన్నా కొన్ని అంధవిశ్వాసాల ఒత్తిడిని ఎదుర్కోక తప్పలేదు. ఇల్హాతోపాటు ఆమె తోబుట్టువులంతా అక్కడున్న నాలుగేళ్లు చదువుకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఇల్హా బాల్యవివాహం విపత్తును తప్పించుకోవాల్సి వచ్చింది. ఇల్హా కుటుంబం కెన్యాకు వెళ్లిన రెండేళ్లకు అనుకుంటా.. కెన్యాకే చెందిన ఓ కుటుంబం ఆ క్యాంప్‌లోని మధ్యవర్తి ద్వారా ఇల్హా వివరాలు తెలుసుకొని ఆ పిల్లను తమింటి కోడలు చేసుకోవడానికి లాంఛనాలతో సహా ఇల్హా వాళ్ల డేరా దగ్గరకు వచ్చింది. కోపంతో ఇల్హా తాత దవడలు బిగిసుకున్నాయి. వచ్చిన కుటుంబ పెద్ద చెంప చెళ్లుమనిపించి అక్కడినుంచి వెళ్లగొట్టాడు. కాని ఆ గొడవతో అంతటితో సద్దుమణగలేదు. తెల్లవారి ఆ క్యాంప్‌ అధికారి అయిన కెన్యాదేశస్తుడిని వెంటబెట్టుకొని వచ్చాడు ఆ ప్రత్యర్థి. అయినా ఆ ముసలాయన అదరలేదు, బెదరలేదు. కిందటి రోజు ఇచ్చిన చెంపదెబ్బ సమాధానమే ఆ రోజూ ఇచ్చాడు. ఆ దెబ్బకు కెన్యా అధికారి తోకముడుచుకొని పారిపోయాడు. అయినా అక్కడ ఉండడం తమ పిల్లలకు క్షేమం కాదని, వాళ్ల ప్రగతికి అవరోధమని గ్రహించిన ఆ పెద్దాయన అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.

ప్రజాస్వామ్య పాఠాలు
అబుకర్‌ పెట్టుకున్న అర్జీలు ఫలించి ఆ కుటుంబం 1995లో అమెరికాకు వలస వెళ్లింది. మొదట వర్జీనియాలోని అర్లింగ్‌టన్‌లో బస చేశారు. కొన్ని నెలలు మాత్రమే అక్కడ ఉండి ఆ తర్వాత మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలీస్‌ చేరుకున్నారు. దాదాపు నలభైవేల మంది సొమాలియా శరణార్థులుండే రాష్ట్రం అది. అందునా అత్యధికులు మినియాపోలీస్‌లోనే నివసిస్తున్నారు. ఎత్తయిన అపార్టమెంట్స్, సేడర్‌ నది ఒడ్డున ఉన్న ఈస్ట్‌ ఆఫ్రికన్‌ కాఫీ షాప్స్, మార్కెట్స్‌తో చిన్నసైజు మొగదీషును తలపిస్తుంటుంది అది. అయినా అమెరికా ఆమెకు బ్రహ్మపదార్థంలానే తోచింది. ఇంగ్లీష్‌ తప్ప తమ మాట వినిపించేదే కాదు. ఒకలాంటి యాసతో వేగంగా ఇంగ్లీష్‌ మాట్లాడుతున్న స్థానికులను అబ్బురంగా చూసేది. ఆ పరిశీలనే ఇంగ్లీష్‌ భాష పట్ల పట్టు వచ్చేలా చేసింది ఆమెకు. మినియాపోలీస్‌ వెళ్లిన మూడునెలల్లోనే అనర్ఘళంగా ఆగ్లం మాట్లాడే దశకు వచ్చేసింది. అప్పటిదాకా పాజ్‌లో ఉన్న చదువూ మూవ్‌ అయింది. ఎడిసన్‌ హైస్కూల్లో చేరింది. ఒక్క చదువే అన్ని నేర్పిస్తుంది అని పిల్లలను వదిలెయ్యలేదు ఇల్హా తండ్రి, తాత. సమాజస్థితిగతులను వివరించేవారు. అందరికంటే చిన్నదవడం వల్లో, విషయాలను త్వరగా ఆకళింపు చేసుకోవడం, వేగంగా స్పందించే గుణం ఉండడం వల్లో ఇల్హా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు అబుకర్‌. పధ్నాలుగేళ్ల ఇల్హాకు ప్రజాస్వామ్యం, సమకాలీన రాజకీయ పరిస్థితులు, పరిణామాల గురించి చెప్పేవాడు. ఆ అవగాహనతో స్థానికంగా జరిగే మీటింగ్స్‌లో ఇంగ్లిష్‌లో సాగే ఉపన్యాసాలను తాతకు సొమాలియా భాషలో తర్జుమా చేసి చెప్పేది. ఆ స్నేహబంధం, అనుబంధం తర్వాత ఆమె మిన్నెసోటా సెనెట్‌కి సభ్యురాలయ్యే స్ఫూర్తిని పంచింది. శక్తినిచ్చింది.

స్టూడెంట్‌ పాలిటిక్స్‌ టు  మెయిన్‌స్ట్రీమ్‌ పాలిటిక్స్‌
హైస్కూల్లో ఉన్నప్పుడే స్టూడెంట్‌ ఆర్గనైజర్‌గా ఎన్నికైంది. అక్కడితో ఆగలేదు స్కూల్‌ చదవైపోయి నార్త్‌ డకోటా స్టేట్‌ యూనివర్శిటీలో చేరాక ముస్లిం స్టూడెంట్‌ అసోసియేషన్‌లో చేరింది. విద్యార్థి రాజకీయాల్లో ఎంత చురుకుగా పాల్గొనేదో చదువులోనూ అంతే చురుగ్గా ఉండేది. పొలిటికల్‌ సైన్స్, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ ఐచ్ఛికాలుగా డిగ్రీ చదివింది. తర్వాత లా కూడా చేసింది. అనంతరం కమ్యూనిటీ న్యుట్రిషన్‌ ఎడ్యూకేటర్‌గా ఉద్యోగం మొదలుపెట్టింది. 2012లో ప్రధాన రాజకీయస్రవంతిలోకి వచ్చింది. ఆ యేడు మిన్నెసోటా చట్టసభకు జరిగిన ఎన్నికల్లో కరీ తరపున ఎన్నకల ప్రచారం చేసింది. అప్పుడు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రాక్టికల్‌ పాలిటిక్స్‌ అర్థమయ్యాయి ఆమెకు. ఆ అనుభవంతో అండ్రూజాన్సన్‌ కోసం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంది. అప్పుడే అండ్రూజాన్స్‌న్‌ ఆఫీస్‌లో సీనియర్‌ పాలసీ ఎయిడ్‌ కొలువులో చేరింది. ఆ బాధ్యతను మూడేళ్లు నిర్వహించింది. ఆ సమయంలోనే అంటే 2014లో జరిగిన ఓ స్థానిక సమావేశం హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని అయిదుగురు వ్యక్తులు ఇల్హా మీద దాడి చేశారు. ఆమె తీవ్రంగా గాయపడింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే హెచ్చరికనూ జారిచేశారు. అప్పుడు నిర్ణయించుకుంది ఇల్హా రాజకీయాల్లోనే కొనసాగాలని.

ట్రంప్‌కి కౌంటర్‌గా..
 2016లో జరిగిన మినియాపోలీస్‌ చట్టసభకు డెమోక్రాట్స్‌ తరపున బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ అభ్యర్థి అబ్డిమలిక్‌ అక్సర్‌ కూడా సొమాలి అమెరికనే. మినియాపోలీస్‌లో మంచి పట్టున్న వ్యక్తే. అయితే హఠాత్తుగా అతని తండ్రి చనిపోవడంతో పోటీ నుంచి విత్‌డ్రా అయ్యాడు. దాంతో ఆ స్థానంలోకి ఫిలిస్‌ ఖాన్‌ వచ్చాడు. గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ట్రంప్‌ ముస్లిం వలసలను రానివ్వం అనే ప్రచారం మొదలుపెట్టాడు. ఆ క్యాంపెయిన్‌కి కౌంటర్‌గా తను ప్రచారం మొదలుపెట్టింది ఇల్హా. ఒక దశలో డైరెక్ట్‌గా ట్రంప్‌నే ఢీకొననుందా ఏంటీ ఈ పిల్ల అనుకునేంత ఉధృతం చేసింది ఇల్హా తన కౌంటర్‌ క్యాంపెయిన్‌ని. ప్రత్యర్థి ఫిలిస్‌ ఓటమి ఖాయమైంది. తూర్పు ఆఫ్రికాకిరణంతో మినియాపోలీస్‌ సెనెట్‌ వెలిగిపోతోంది. సమస్యల మీద వాడిగా చర్చిస్తూ చల్లటి పరిష్కారాలను అందించే ప్రయత్నం చేస్తోంది ఇల్హా ఒమర్‌.

వ్యక్తిగతం.. వివాదం
ఇల్హా తన 19వ యేట(2002) అహ్మద్‌ హిర్సీతో సహజీవనం మొదలుపెట్టింది. ఆ యేడే పెళ్లి చేసుకోవాలని ఆ జంట నిఖాకోసం దరఖాస్తూ చేసుకుంది. ఎందుకనో అది ముందుకు సాగలేదు. కాని వీళ్ల కాపురం మాత్రం సజావుగానే సాగింది. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. స్పర్థలతో 2008లో ఇల్హా, హిర్సీ విడిపోయారు. 2009లో ఇల్హా అహ్మద్‌ నూర్‌ సయీద్‌ ఎల్మీని పెళ్లిచేసుకుంది. రెండేళ్లే సాగిన ఈ దాంపత్యం విడాకులతో రద్దయింది. మళ్లీ అహ్మద్‌ హిర్సీకి దగ్గరైన ఇల్హా 2011లో అతన్ని అధికారికంగా పెళ్లి చేసుకుంది. ‘‘హిర్సీ మళ్లీ నా జీవితంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కుటుంబాల్లో ఉన్నట్టే, అందరు భార్యభర్తలకు వచ్చినట్టే మాకూ మనస్పర్థలొచ్చాయి, కలహాలొచ్చాయి. అందరూ సర్దుకుపోయినట్టే మేమూ సర్దుకుపోయాం. ముందుకన్నా ఎక్కువ అండర్‌స్టాడింగ్, కంపార్టబులిటీతో ఉంటున్నాం. కలిసి పిల్లలను పెంచుతున్నాం. నా వ్యక్తిగతంగానే కాదు, రాజకీయ జీవితానికి తోడు,నీడగా ఉంటున్నాడు హిర్సీ’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇల్హా. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలోని ఈ సంఘటనను మినియాపోలీస్‌ ఎన్నికలప్పుడు ప్రత్యర్థి పార్టీ  వివాదంగా మార్చి ఆమెను పరాభవం తద్వారా పరాజయం పాలుచెయ్యాలని చూసింది. ధైర్యంగా ఎదుర్కొని పరాభవాన్ని విజయానందంగా మలచుకుంది ఇల్హా ఒమర్‌. మిన్నెసోటాలో ఉన్న ఆఫ్రికన్సే కాదు అమెరికన్స్‌కూ ఇల్హా ఒమర్‌ ఓ ఆశాకిరణం! వాళ్ల కలలను సాకారం చేసే దేవత. ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ దాని గౌరవాన్ని పెంచే నేత!
 

స్త్రీలు.. పిల్లల కోసం
2015 నుంచి స్త్రీల సంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టింది ఇల్హా. తూర్పు ఆఫ్రికా మహిళల నాయకత్వం కోసం, రాజకీయాల్లో వాళ్ల భాగస్వామ్యం కోసం పనిచేసే  ‘పాలసీ అండ్‌ ఇనీషియేటివ్స్‌ ఆఫ్‌ ది విమెన్‌ ఆర్గనైజేషన్, విమెన్‌ నెట్‌వర్క్‌’ కి డైరెక్టర్‌గా చేరింది. ఇదే కాకుండా విద్య, పౌరహక్కులు, మానవహక్కులు, పేదరికం, పర్యావరణ సమస్యలు, యానిమల్‌ వెల్ఫేర్, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లోనూ విస్తృత సేవలందించింది. గంటకు పదిహేను డాలర్లు కనీస వేతనం ఇవ్వాలనే పోరాటానికి మద్దతు తెలిపింది. 125 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పే ఏర్పాటు చేసింది. స్టూడెంట్‌ లోన్స్‌ ఇప్పించింది. ఇవన్నీ రాజకీయాల్లో రాణించడానికి చేసిన ఎత్తుగడలు కావు. ఆఫ్రికా శరణార్థుల బాధలను, ఇబ్బందులను చూసి చలించిపోయి మానవతాధృక్పథంతో అందించిన సేవాకార్యక్రమాలు. 
– శరాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top