
విద్యార్థి వీసాకు నాలుగేళ్ల పరిమితి విధించే యోచనలో అమెరికా
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అక్కడున్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు రెండేళ్లల్లో కోర్సు పూర్తి చేసి.. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు.
కనీసం మూడేళ్లల్లో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి హెచ్1బీ వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును నాలుగేళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక, ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోత పడ్డాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత్‌లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది.
తగ్గుతున్న అవకాశాలు
అమెరికాలో భారత విద్యార్థులు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గినట్లు విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. ఈ దేశానికి అగ్రరాజ్యానికి ఏటా 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువారే ఉండటం గమనార్హం. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీపడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది.
అమెరికాతో పోలిస్తే కెనడాలో 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. అయితే ఇటీవల కెనడాలోనూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి.
ఏటా రూ.5.86 లక్షల కోట్లు
అమెరికాలో రెండేళ్లుగా ఖర్చులు పెరిగాయి. రూపాయి మారక విలువతో పోలిస్తే యూనివర్సిటీ ఫీజులూ పెరిగాయి. సాధారణంగా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ విద్యార్థులు నెట్టుకొస్తారు. ట్రంప్ వచి్చన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను డబ్బు కోసం ఆశ్రయిస్తున్నారు. అమెరికాకు పంపేటప్పుడే అప్పులు చేసిన తల్లిదండ్రులు మళ్లీ అప్పులు తేవడం కష్టంగా ఉంటోంది. ఏటా పర్యాటకులతో కలిపి 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు.
2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ.3.10 లక్షల కోట్లు. 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ. 3.93 లక్షల కోట్లకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10 శాతం మేర పెరిగి, రూ. 4.32 లక్షల కోట్లకు చేరింది.
ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ. 5.86 లక్షల కోట్ల మేర విదేశీ విద్య భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఫీజు తలచుకుంటేనే...
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజులు తలుచుకుంటే భారత విద్యార్థులు వణికిపోతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు అమెరికా వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్‌లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వసతి ఖర్చులు ఏకంగా 10–15 శాతం పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. దీంతో విద్యార్థుల అంచనాలు తారుమారయ్యాయి. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లిందని అంటున్నారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే.. వీసా కాలపరిమితి తగ్గించడంతో భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది.
వీసా కుదిస్తే ఎలా..
ఎంఎస్ పూర్తయ్యే వరకూ ఉద్యోగం చేయకూడదు. ఎంఎస్ అయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ తీసుకుంటారు. అప్పటికే మూడున్నరేళ్లు పూర్తవుతుంది. మిగిలిన ఆరు నెలల్లో ఉద్యోగం రాకపోతే హెచ్–1బీ వీసా రాదు. కాబట్టి భారత్‌కు వెళ్లాలి. నేను ఎంఎస్ పూర్తి చేసి ఆరు నెలలైంది. రూ.40 లక్షల అప్పు చేశాను. మరో రెండేళ్లు ఉద్యోగం రాకపోతే అప్పు రెట్టింపవుతుంది. అమెరికా ఆంక్షల వల్ల నలిగిపోతున్నాం. – మందస బాల శేఖర్ (అమెరికాలో భారత విద్యార్థి)
ఇది అన్యాయం
ట్రంప్ వచ్చిన తర్వాత ఐటీ రంగం పరిస్థితి మారిపోయింది. ప్రతి కంపెనీలోనూ అనుభవం అడుగుతున్నారు. విద్య పూర్తి చేసిన వెంటనే అనుభవం ఎలా వస్తుంది. అనుభవం కోసం కనీసం ఏడాది ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉండాలి. వీసా కాలపరిమితి కుదిస్తే విద్యార్థులు నష్టపోతారు. – పరమేశ్వర్ త్రిపాఠి (అమెరికాలో భారత కన్సల్టెన్సీ నిర్వాహకుడు)