
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో తెలుగు రాష్ట్రాలకు అవకాశాలు
బ్రిటన్‌లో చేనేత రంగమే లేదు... కాబట్టి దాన్లో పోటీ ఉండదు
‘సాక్షి’తో యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందుంది
ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్, ఏఐలో కొత్త పెట్టుబడులొస్తాయి
డిఫెన్స్, ఏరోస్పేస్, టెక్నాలజీ, విద్య రంగాలపై యూకే ఫోకస్
ఏపీలో సీఫుడ్, టెక్స్‌టైల్, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం
ప్రాసెస్డ్ ఫుడ్ రంగం కీలకం.. దీనితో చాలా అవకాశాలొస్తాయి
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిస్తేనే యూకే మార్కెట్లోకి
యూకే నుంచి చౌక దిగుమతులొచ్చేస్తాయనే అపోహలు సరికాదు
ఇరుదేశాల్లోని సున్నిత రంగాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు
ఇక్కడ దొరకనివి తప్ప.. యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులు రావు
బ్రిటన్‌లో చేనేత రంగమే లేదు... కాబట్టి దాన్లో పోటీ ఉండదు
భారత్‌పై అమెరికా అనూహ్యమైన సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మరి ప్రత్యామ్నాయం? అమెరికాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఒక మైలురాయిగా చెప్పాలి. ఎందుకంటే భారత్ నుంచి ఈ దేశానికి జరుగుతున్న ఎగుమతుల్లో 99 శాతం ఎఫ్‌టీఏ పరిధిలోకి రాబోతున్నాయి.
బ్రిటన్ నుంచి వస్తున్న దిగుమతుల్లో 94 శాతాన్ని ఎఫ్‌టీఏలోకి తెస్తామని భారత్ హామీ ఇచ్చింది. మరి ఈ ఎఫ్‌టీఏతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏమైనా లాభం ఉంటుందా? ఏయే రంగాలకు లాభం? యూకే నుంచి ఏ రంగాల్లోకి పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది? వాటన్నిటిపై యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌తో ‘సాక్షి’ ప్రతినిధి మంథా రమణమూర్తి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ఎఫ్‌టీఏతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి?
యూకేతో విద్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల్లో పెరుగుతున్న సానుకూలతను మూడేళ్లుగా చూస్తున్నా. ఈ దేశాల ప్రధానులు ఇటీవలే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ పరిధి రక్షణ, టెక్నాలజీ, విద్య, వాతావరణ మార్పులన్నిటికీ విస్తరించనుంది. టెక్నాలజీ, ఫార్మా రంగంలో గట్టి పునాదులున్న హైదరాబాద్‌కు ఎఫ్‌టీఏతో చాలా లాభాలుంటాయి.
ఏపీలో కొన్నేళ్లుగా పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎప్పట్నుంచో ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది కదా. మరి ఎఫ్‌టీఏతో కొత్తగా ఏం జరుగుతుంది?
నిజమే. రాష్ట్రాన్ని బట్టి అవకాశాలు మారుతాయి. ఏపీ విషయానికొస్తే ఎగుమతులపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యే నేను విశాఖలో సీఐఐ సదస్సుకు వెళ్లా. సీఫుడ్, టెక్స్‌టైల్స్, కాఫీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడంపై చర్చించాం. ఎఫ్‌టీఏతో టారిఫ్‌లు తగ్గుతాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది. దీనివల్ల ఏపీ ఉత్పత్తులు యూకే మార్కెట్‌లోకి ప్రవేశించడం సులువవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కీలకంగా మారనుంది.
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఎఫ్‌టీఏ బాసటగా నిలుస్తుంది. ఇది ఏపీ వ్యవసాయ ఎకానమీని మారుస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఎఫ్‌టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. టారిఫ్‌లు తగ్గుతాయి. ఇది ఫార్మా, టెక్నాలజీ రంగాలకు కీలకం. టెక్నాలజీ నిపుణుల రాకపోకలు తేలికవుతాయి.
ఈ ఒప్పందం దీర్ఘకాలంలో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించొచ్చు?
దీర్ఘకాలంలో ప్రత్యేకించి ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్య పరిమాణం పెరుగుతుంది. యూకే ఫార్మా మార్కెట్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు. కానీ అందులో భారత్ వాటా 3 శాతమే. దీన్ని పెంచే అవకాశం తెలంగాణకు ఎక్కువ. ఒప్పందం వల్ల ఆర్ అండ్ డీతోపాటు ఏఐ వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులదే అగ్రస్థానమవుతుంది.
నిపుణుల రాకపోకలకు నిబంధనలు సడలిస్తున్నారా?
అవును. స్వల్ప కాలానికి సంబంధించి ప్రత్యేకంగా కంపెనీల మధ్య రాకపోకలు తేలికవుతాయి. ఎందుకంటే ఇరుదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ చెల్లించాలనే నిబంధనను ఉండదు. కంపెనీలకిది చాలా పెద్ద ఊరట. యూకే నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలన్నా, ఇక్కడి వారిని అక్కడికి పంపాలన్నా ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి.
మరి యూకే నుంచి చౌక ఉత్పత్తులొచ్చి ముంచేయకుండా ఇక్కడి వ్యాపారాలను ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలను దెబ్బతీయకుండా ఒప్పందంలో తగిన జాగ్రత్తలుంటాయా?
భారత్‌కే కాదు. యూకేకు కూడా ఎంఎస్‌ఎంఈ రంగమే వెన్నెముక. ఏ ఒప్పందంలోనైనా సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా ఉంటాయి. డెయిరీ, చేనేత లాంటి రంగాలకు భద్రత ఉంటుంది. ఉదాహరణకు యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే భారత్‌లో తయారుకాని స్పెషాలిటీ చీజ్ (పనీర్) వంటి వాటికే అనుమతి ఉంటుంది. చేనేతకు యూకే నుంచి పోటీ ఉండదు. ఎందుకంటే యూకేలో చేనేత లేదు. ఈ ఒప్పందంతో భారత చేనేతకు యూకే ఫ్యాషన్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.
మరి ఫుడ్ ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీలు కావాలి కదా? యూకే కంపెనీలు అందిస్తాయా?
కచ్చితంగా. యంత్రాలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఇక్కడి కంపెనీలు ఇప్పటికే ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించే వేదికను ఎఫ్‌టీఏ అందిస్తుంది. దీనివల్ల భారత కంపెనీలు యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి.
ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 25% పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు?
రాష్ట్రాలవారీగా చెప్పడం కష్టం. కానీ బాగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ఎగుమతవుతున్న సీఫుడ్‌లో ఏపీ వాటా 2.25 శాతమే. ఎఫ్‌టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది కనుక ఏపీకి విస్తృత అవకాశాలుంటాయి. నిజానికి ఎఫ్‌టీఏ వల్ల సుంకాలు తగ్గటమే కాదు. సరి్టఫికేషన్ కూడా తేలికవుతుంది. త్వరగా పాడైపోయే సీఫుడ్ లాంటి వాటికిది ఆక్సిజన్. అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) కూడా చాలా ఆశాభావంతో ఉంది.
ఫుడ్ ప్రాసెసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లున్నారు?
ఇది కీలక రంగం. ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన ఆహార దిగుబడిలో 10 శాతాన్నే ప్రాసెస్ చేస్తోంది. తగినన్ని పెట్టుబడులతో విలువను జోడిస్తే కాఫీ, సీఫుడ్‌తోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయొచ్చు. యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఏపీ ఇప్పటికే యూఎస్, చైనాకు ఎగుమతి చేస్తోంది. సర్టిఫికేషన్ ప్రక్రియను సరళం చేయడం ద్వారా యూకే మార్కెట్‌ను వేగంగా అందుకోవచ్చు.
సంప్రదాయేతర ఇంధనాలు, ఏరోస్పేస్, హైదరాబాద్ స్టార్టప్‌లలోకి ఎక్కువ పెట్టుబడులొస్తాయా?
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుతోపాటు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల్లో భాగస్వామ్యాలను ఇప్పటికే చాలా యూకే కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఎఫ్‌టీఏతో భాగస్వామ్యాలు పెరుగుతాయి. యూకే ఎక్స్‌పోర్ట్ ఫైనాన్స్ అనేది యూకే–ఇండియా ప్రాజెక్టులకు మద్దతిచ్చే ప్రధాన వనరుగా ఉంటుంది.
మరి కార్మికులు, పర్యావరణం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతికూలతలేమైనా ఉంటాయా?
ఈ ఒప్పందంలో అవినీతి నిరోధక, వినియోగదారుల రక్షణ, పర్యావరణం, లింగబేధంపై ప్రత్యేక చాప్టర్లున్నాయి. వాటన్నిటినీ చేర్చి భారత్ చేసుకున్న తొలి ఎఫ్‌టీఏ ఇది. కార్మికుల్ని, పర్యారణాన్ని పణంగాపెట్టి వాణిజ్య విస్తరణ జరగదనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ ఒప్పందంతో రానున్న అవకాశాలపై చిన్నచిన్న వ్యాపారవేత్తలకు అవగాహన ఎలా? భారత ఎగుమతిదారులకు బాసటగా డీజీఎఫ్‌టీతోపాటు సీఐఐ, ఎఫ్‌టీసీసీఐ, కామర్స్ చాంబర్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల వ్యాపార బృందాలు అవకాశాలపై అవగాహన కల్పిస్తాయి. ఇది పూర్తిగా అమల్లోకి రావడానికి ఒక ఏడాది పడుతుంది.