మెక్సికో స్త్రీల ఆర్తధ్వనులు

Hurricane Season Book Review By Padmapriya - Sakshi

కొత్త బంగారం

మెక్సికోలోని లామటోసా అనే చిన్న ఊర్లోని ఓ పంటకాలువ. దాని ఒడ్డున జీర్ణావస్థలో నీళ్లల్లో తేలుతూ ఉన్న మంత్రగత్తె శవాన్ని చూశారు అయిదుగురు పిల్లలు. మంత్రగత్తెని ఎవరు, ఎందుకు చంపారు?
చేతబడులు చేస్తుందనీ మంత్రతంత్రాలను ప్రయోగిస్తుందనీ నమ్మే లామటోసా ఊరి ప్రజలకి మంత్రగత్తె అంటే భయమే కాదు, కొద్దిపాటి అసహ్యం కూడా. ఆ ఊరి స్త్రీలు మాత్రం తమ మానసిక, శారీరక సమస్యలను మూలికలూ మంత్రాలతో నయం చేసుకోవటానికి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఆమె దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది గల్లంతైపోయిన ఒక తుఫాను రాత్రి అనంతరం ఆ మంత్రగత్తె చనిపోయిందనుకుని, ఆమె కూతుర్నే మంత్రగత్తె అనడం మొదలుపెడతారు ఊరి జనం. వాళ్ల ఇంట్లో ఒక మూసేసిన గది ఉందనీ, అందులో బంగారు నాణాలున్నాయనీ ప్రజల అనుమానం. 

లూయిస్మీ, యేసేనియా అదే ఊరిలో తమ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటారు. చిన్నతనంలోనే మద్యం, డ్రగ్స్‌ లాంటి దురలవాట్లకు బానిసైన లూయిస్మీ బాధ్యతారాహిత్యం గురించి తెలిసిన  యేసేనియాకి, మంత్రగత్తెని అతనే చంపాడేమో అన్న అనుమానం వస్తుంది. జరిగిన కథేమిటంటే– పెంపుడు తండ్రి వల్ల గర్భవతై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పదమూడేళ్ల నోర్మా గతం గురించి తెలియని లూయిస్మీ ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. అత్తగారి సలహా మేరకు అబార్షన్‌కి ఒప్పుకున్న నోర్మా, మంత్రగత్తె ఇచ్చిన పసర్లు మింగి ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలౌతుంది. లూయిస్మీ ఉగ్రుడైపోయి తన స్నేహితుడితో కలిసి మంత్రగత్తె ఇంటిని దోచేద్దామని వెళ్లగా, అక్కడ డబ్బేమీ దొరకకపోగా ఊహించని పరిస్థితులలో స్నేహితులిద్దరూ మంత్రగత్తెని చంపి శవాన్ని కాలవలో పడేసి పారిపోతారు. మంత్రగత్తె చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఊరిజనం నిధి కోసం ఆ ఇంటిమీద పడతారు. అందరికంటే ముందుగానే ఆ డబ్బుకోసం అక్కడికి చేరుకున్న పోలీసులు మూసేసిన గదిని హడావుడిగా పగలగొట్టినప్పుడు తెలిసిన కొత్త నిజాలేమిటి? చివరికి మిగిలిందేమిటి? అది నవల ముగింపు.

హరికేన్‌ సీజన్‌ – తుఫానులాగా కమ్మేసే ఈ నవల ప్రపంచ పాఠకులనుంచి ప్రత్యేకమైన ప్రశంసలను పొందుతోంది. ప్రముఖ లాటిన్‌ అమెరికన్‌ రచయిత్రి ఫెర్నాండా మెల్‌చోర్‌ రాసిన స్పానిష్‌ నవలల్లో ఇంగ్లీషులోకి తొలిసారిగా అనువదింపబడి, బుకర్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్‌ అయిన ఈ నవలని సోఫీ హ్యూస్‌ అనువదించారు.
థర్డ్‌ పర్సన్‌ నెరేషన్‌తో కథనం పాత్రలు, కాలాల మీదుగా సాగుతూ మంత్రగత్తె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫుల్‌స్టాపులు లేని పొడుగైన వాక్యాలు జ్వరప్రకంపనాలుగా సాగుతూ పాత్రల జీవితాల్లోకి చదువరిని లాగేస్తాయి. చాప్టరంత పేరాగ్రాఫు ఒక్కోసారి పేజీల కొద్దీ సాగిపోయినా కథనంలో వేగం తగ్గదు; విసుగు పుట్టించదు. పేదరికంతో పాటు డ్రగ్స్, మద్యం, విశృంఖల శృంగారం, హోమోసెక్సువాలిటీ గురించి నవలలో వినిపించే పచ్చిదనం నగిషీలు చెక్కని వాస్తవం. స్పానిష్‌ భాషలో లావాలా ఎగజిమ్మిన క్రోధం, అశ్లీలత, హింస, తిట్లని  ధ్వనింప చేయటానికి ఇంగ్లీష్‌ భాషలోని వివిధ మాండలికాలతో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని  అంటారు అనువాదకురాలు. 

జీవితాలలో ఉన్న హింసలకీ విషాదాలకీ అతీతంగా పాత్రలు చూపించే ప్రేమ కరుణ నవలకి విడిగా కనిపించని చోదకశక్తి. శవాలను ఖననం చేసేటప్పుడు వాటితో ప్రేమగా మాట్లాడటం తన బాధ్యత అనుకునే  కాపరి, శవాలను పూడుస్తూ మాట్లాడే ముగింపు వాక్యాలు, ‘‘ఈ చీకట్లు ఇలా ఉండిపోవు. దూరంగా నక్షత్రంలా కనబడుతున్న వెలుగును చూశావా? ఆ వెలుగు దగ్గరకే నువ్వు వెళ్తోంది. వెతల కలుగులోంచి ఆ వెలుగులోకి వెళ్లే దారి ఇదే!’’ అనటం ముగిసిన ఆ జీవితాలకి ఆఖరి ఓదార్పు. మెక్సికోలో కనిపించే పేదరికం, లింగవివక్ష, ఫెమీసైడ్‌ (స్త్రీలు కాబట్టి చంపేయడం), మాఫియా, డ్రగ్స్, వ్యభిచారం, నిరక్షరాస్యతలతో మగ్గిపోతూ మార్పుకోసం ఎదురుచూసే జీవితాల్లోకి వెలుగు వచ్చేదెప్పుడనీ, వారు శ్వాసించే హింసకు నిజమైన అంతమెప్పుడనీ ఉగ్రస్వరంతో వేసిన ప్రశ్నే ఈ నవల. 

పద్మప్రియ

నవల: హరికేన్‌ సీజన్‌
రచయిత్రి: ఫెర్నాండా మెల్‌చోర్‌
స్పానిష్‌ నుంచి ఇంగ్లిష్‌: సోఫీ హ్యూస్‌
మూల నవల ప్రచురణ: 2017 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top