ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు 

Huge Marriages On Valentine's Day In Krishna District - Sakshi

నేటి నుంచి మూడు రోజుల పాటు

వేల సంఖ్యలో పెళ్లిళ్లు

ప్రేమికుల రోజున అధిక లఘ్నాలు

ఇప్పటికే కల్యాణమండపాలన్నీ ఫుల్‌

ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి. వివాహం.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం ఉండేలా.. తమ హృదిలో ఆ మధుర స్మృతులు పదిలంగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నేటి యువత. దీనికి ప్రేమికుల రోజుకంటే మంచిరోజు ఏముంటుంది. ప్రేమికుల రోజు సాక్షిగా వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు జంటలు సిద్ధమవుతున్నాయి.  ఫిబ్రవరి 14న కృష్ణాజిల్లా వ్యాప్తంగా వేల ముహుర్తాలు ఉండడమే దానికి తార్కాణం.

సాక్షి, కోడూరు(అవనిగడ్డ): మాఘమాసంలో శుభకార్యాలకు కొదవుండదు. జనవరి 25 నుంచి మాఘమాసం ప్రారంభం కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నెలకొంది. అయితే ఈ నెల 13,14,15 బలమైన సుముహూర్తాలు ఉండడంతో ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, నూతన వస్త్రాల బహూకరణ, ఉపనయనం, అన్నప్రాసనలకు ఈ మూడు రోజులు శుభదినాలుగా పండితులు చెబుతున్నారు.  

వాలెంటైన్స్‌ డే రోజే వివాహం.. 
ఈ మూడు రోజుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కూడా కావడంతో ఈ రోజున పెళ్లిలఘ్నాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ప్రేమికుల రోజున పెళ్లి చేసుకుంటే జీవితకాలం తమకు ఆతేదీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుందనే ఆలోచనతో యువత ఆరోజున పెళ్లి చేసుకొనేందుకు ఇష్టం చూపుతున్నారు. దీంతో 14న తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని కల్యాణమండలాలు ఒక నెలరోజుల ముందే బుక్‌ అయిపోయినట్లు సమాచారం. ఈ మూడు రోజుల పాటు శుభకార్యాలకు కొదవలేకపోవడంతో 90శాతానికి పైగా కల్యాణమండపాలు, ప్రైవేటు అసోసియేషన్‌ భవనాలు బుక్‌ అయిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

రెట్టింపైన పెళ్లి ఖర్చు ! 
ప్రస్తుతం వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో కల్యాణమండలపాల నిర్వాహకులు, బాజా భజంత్రీలు వారు తమ రేట్లు పెంచేశారు. డెకరేషన్, సౌండ్‌సిస్టమ్స్, లైటింగ్‌ నిర్వాహకులు, పండితులు కూడా రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఫొటోగ్రాఫర్లకు కూడా మంచి గిరాకీ ఏర్పడింది. అయితే జీవితంలో వివాహఘట్టం జరిగేది ఒకసారి కావడంతో ఖర్చులకు ఎక్కడా వెనుకాడడం లేదు. బంగారం షాపులు, పచారీ, వస్త్ర దుకాణాలు, కూరగాయల, పూలదుకాణాలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి.


కోడూరులో సిద్ధమైన ఒక కల్యాణ మండపం వేదిక

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top