సంతోషి మాత

Harpers BAZAAR Editor Sameera nazar Special Story - Sakshi

ఫ్యాషన్‌ సంతోషాన్నిస్తుంది. కొత్తగా కనిపిస్తాం కదా.. అందుకు! హార్పర్స్‌ ఫ్యాషన్‌ పత్రిక కూడా.. కొత్తగా కనిపించబోతోంది. ఎడిటర్‌గా సమీరా నాజర్‌ వచ్చారు. తొలి ‘నాన్‌–వైట్‌’ ఎడిటర్‌! ఆమెకు ఇప్పుడు రెండు సంతోషాలు. కొత్త ఉద్యోగం. కాఫీ కలిపిచ్చే ఏడేళ్ల కొడుకు.

నూట యాభై మూడేళ్ల చరిత్ర కలిగిన మహిళల ఫ్యాషన్‌ మాస పత్రిక ‘హార్పర్స్‌ బజార్‌’ యూఎస్‌ ఎడిషన్‌కు ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌గా సమీరా నాజర్‌ రాబోతున్నారని ఈ నెల 9న ఆ పత్రిక యాజమాన్యం ప్రటించగానే సమీర ఎవరన్న వివరాల కోసం నెట్‌లో గాలింపు మొదలయింది. అయితే ఆమె గురించి అందుబాటులో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆమె శరీర కొలతలకు మాత్రమే పరిమితమై ఉంది! యాభై ఆరేళ్ల సమీరా ఫ్యాషన్‌ రంగ ప్రముఖురాలు అవడం వల్ల కావచ్చు.. ఆమె ధరించే లోదుస్తులు, యాక్సెసరీల సైజ్‌లు మాత్రమే ఎక్కువగా ఫోకస్‌ అయ్యాయి. 2020 నాటికి ఆమె సంపద ఇరవై కోట్ల రూపాయలు. ఇంతవరకే ఆమె బయోడేటా!

జూలైలో హార్పర్స్‌ బజార్‌ బాధ్యతల్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఇటీవల సమీర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రెండు నిముషాల వీడియోలో కూడా.. ‘లెబనాన్‌ తండ్రికీ, ట్రినిడాడ్‌ తల్లికీ పుట్టిన కూతురిగా గర్విస్తూ, కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాను’ అన్నంతవరకే ప్రధానంగా మాట్లాడారు. తన కెరీర్‌ చుట్టూ తిరగడం తప్ప, దాన్ని దాటుకుని లోపలకి వెళ్లే అవకాశాన్ని సమీర ఎవరికీ ఇచ్చినట్లు లేరు. ఇక ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ప్రాముఖ్యం చేకూరుతున్న సందర్భంలో సమీర ‘హార్పర్స్‌ బజార్‌’లోకి రావడం అన్నది ఉద్యమం ప్రభావం వల్లనేతే కాకపోవచ్చు. ఫ్యాషన్‌రంగంలో, జర్నలిజంలో ఆమె ప్రతిభా సామర్థ్యాలు ఆమెకు ఉన్నాయి.

హార్పర్స్‌లోకి వచ్చే ముందువరకు సమీర అమెరికాలోనే మరో ప్రసిద్ధ ఫ్యాషన్‌ పత్రిక ‘వ్యానిటీ ఫెయిర్‌’కు ఐదేళ్లపాటు ఫ్యాషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. దానికిముందు ప్రఖ్యాత ‘ఎల్‌’ (ఇ.ఎల్‌.ఎల్‌.ఇ) మ్యాగజీ¯Œ కు ఫ్యాషన్‌ డైరెక్టర్‌గా, ‘ఇన్‌స్టెయిల్‌’ పత్రికకు స్టెయిల్‌ డైరెక్టర్‌గా పని చేశారు. కెనడాలోని మాంట్రియల్‌లో పుట్టిన సమీర కెరీర్‌ అమెరికన్‌ ‘ఓగ్‌’ పత్రికలో ఫ్యాషన్‌ అసిస్టెంట్‌గా మొదలైంది. మాట్రియల్‌లో స్కూలు, కాలేజీ అయ్యాక జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ చెయ్యడానికి న్యూయార్క్‌కి మారిపోయారు. అక్కడే ఉండిపోయారు. కొన్నాళ్ల క్రితం ‘ది కట్‌’ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రమే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా బయటపడ్డారు. ఆ కొద్దిగా.. ఆమె ఏడేళ్ల కొడుకు లెక్స్‌! కన్నబిడ్డ కాదు. సమీర దత్తత తీసుకున్న కొడుకు. ఆమె అవివాహిత. ఒక కార్యక్రమంలో ఆడియన్స్‌కి లెక్స్‌ని చూపిస్తూ.. ‘‘తల్లిని కావడం, తొలిసారి నా కొడుకు చేతిని పట్టుకోవడం నా జీవితంలో నేను గర్వించిన క్షణాలు’’ అని అన్నారు సమీర.

‘ది కట్‌’ ఇంటర్వ్యూలోనే సమీర మరొక విషయం కూడా చెప్పారు. లెక్స్‌ తనకు కాఫీ, జ్యూస్‌ తయారు చేయడంలో చక్కగా సహాయపడతాడట! ‘గుడ్‌ బాయ్‌’ అని తన కొడుకుని ఎన్నిసార్లయినా మెచ్చుకోడానికి తగినంత ప్రేమ తల్లిపైన లెక్స్‌కూ ఉన్నట్లుంది. ‘‘నన్ను విడిచి ఉండలేడు’’ అంటారు సమీర. కొడుకు, కెరీర్‌ ఈ ప్రపంచంలోని ఆమెకు గల రెండు గర్వకారణాలు. లాక్‌డౌన్‌కు ముందు లెక్స్‌ని రోజూ తనే స్కూల్లో  దింపి ఆఫీస్‌కి వెళ్లేవారు సమీర. అయితే ఊరికే దింపడం కాదు. లెక్స్‌ క్లాసు రూములోకి వెళ్లి, లెక్స్‌ బెంచీ మీద తను కూడా కూర్చొని లెక్స్‌తో మాట్లాడుతూ.. క్లాస్‌ బెల్లు కొట్టేవరకు ఉండి వచ్చేసేవారు. మళ్లీ స్కూళ్లు మొదలయ్యాయి. మళ్లీ కొడుతోపాటు వెళ్లి, కాసేపు క్లాస్‌రూమ్‌లో కూర్చొని వస్తారు సమీర. జూలై 6 తర్వాత కూడా ఇందులో మార్పేమీ ఉండకపోవచ్చు. అది ఆమె కొత్త డ్యూటీలో జాయిన్‌ అవబోతున్న రోజు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top