మరిన్ని సంస్కరణలకు రెడీ

Government Open To Further Reforms Says Nirmala Sitharaman - Sakshi

భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానం చేయడమే లక్ష్యం

బ్యాంకింగ్, మైనింగ్‌ తదితర రంగాల్లో చర్యలుంటాయ్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్‌ – స్వీడన్‌ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్‌ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తదుపరి సంస్కరణలను బ్యాంకింగ్, మైనింగ్, బీమా తదితర రంగాల్లో తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను’’ అని ఈ సందర్భంగా చెప్పారు. ఆ సంస్కరణలు ఏంటన్న వివరాలను మాత్రం పేర్కొనలేదు.

భారతీయ పరిశ్రమలే కాకుండా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించే పనిలో ఉందని చెప్పారు. ‘‘బడ్జెట్‌ తర్వాత నుంచి పరిశ్రమలను నిరంతరం సంప్రదిస్తూ, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుంటున్నాను. బడ్జెట్‌ తర్వాత నుంచి మరుసటి బడ్జెట్‌ 2020 ఫిబ్రవరి వరకు వేచి చూడకుండానే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు రూపంలో భారీ సంస్కరణ చర్య తీసుకున్నాం. ప్రభుత్వం సంస్కరణలను ఏ విధంగా విశ్వసిస్తుందన్నది ఈ ఒక్క చర్య తెలియజేస్తుంది. మేము మరిన్ని చర్యలు తీసుకోనున్నామని ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను’’ అంటూ ప్రభుత్వ ఆలోచనలను ఈ సదస్సు వేదికగా మంత్రి సీరారామన్‌ ఆవిష్కరించారు.

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ గత సెపె్టంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా కార్పొరేట్‌ పన్నును ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నది.  

స్వీడన్‌ కంపెనీలకు ఆహ్వానం
భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆహా్వనించారు. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయాలన్న భారత్‌ ప్రణాళికల గురించి తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌ పది భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించి ఈ నెల 15 నాటికి నివేదికను అందజేయనున్నట్టు చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక కార్యాచరణ బృందాన్ని (టాస్‌్కఫోర్స్‌) గత సెపె్టంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019–20 నుంచి 2024–25 మధ్య కాలంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికను అనుసరించి ప్రాధాన్య క్రమంలో జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జాబితాను ఈ టాస్క్ ఫోర్స్ రూపొందించాల్సి ఉంటుంది.

రూ.100 కోట్లకు పైగా వ్యయంతో కూడిన గ్రీన్‌ఫీల్డ్‌ (ముందస్తు పని అవసరం లేనివి), బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులను (ప్రాజెక్టు ఆరంభానికి ముందు పనితో కూడుకున్నవి) ఇది తన నివేదికలో భాగంగా పొందుపరచాల్సి ఉంటుంది. భారత్‌ కేవలం పెద్ద మార్కెట్‌గానే కాకుండా, కొనుగోలు శక్తి, ఆకాంక్షలతో కూడిన మధ్య తరగతి జనాభా అధికంగా కలిగి ఉండడం ఎన్నో అవకాశాలకు వేదికగా మంత్రి పేర్కొన్నారు. ‘‘స్పష్టమైన నిబంధనలతో, మరింత పారదర్శకత మార్గంలో ఈ దేశం నడుస్తోంది. తమకు బాగా తెలిసిన, తమకు ఎంతో ఆమోదనీయమైన వాతావరణం కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు అయితే.. అందుకు భారత్‌ సరిగ్గా సరితూగుతుంది’’ అని మంత్రి సీతారామన్‌ వివరించారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top