ఇంత చిన్నవయసులోనే మోకాళ్ల నొప్పి!

family health counsiling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 26 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి. – మహాదేవ్, కోదాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్ల ఈ సమస్య వస్తూంటుంది. అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్‌) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది తాత్కాలికమైన సమస్య. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.

ఇలాంటి సందర్భాల్లో నాటు వైద్యాలు వద్దు..!
నా వయసు 42 ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేసి ఉంచారు. అప్పుడు ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. ఈసారి కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుకుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు? లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా? – ప్రసాదమూర్తి, కర్నూలు
ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే...
∙ఎముకలు సరైన పొజిషన్‌లో ఉండి మానడానికి ∙మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని ∙మనం వీలైనంత త్వరగా తమ నార్మల్‌ దినచర్యలు చేపట్టాలని.
నాటు వెద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్‌ నార్మల్‌ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్‌ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్‌ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకు పోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటువైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయించి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది.

ఎత్తు పెంచుతామనే ప్రకటనలను నమ్మకండి

నా వయసు 22 ఏళ్లు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. నా ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే. ఫ్రెండ్స్‌ మధ్యన పొట్టిగా కనిపిస్తున్నాను. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. ఎలాగైనా పొడవు పెరగాలన్నది నా ఉద్దేశం. ఎత్తు పెంచే అడ్వరై్టజ్‌మెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడితే ఎత్తు పెరుగుతానా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.– నిశాంత్, నరసరావుపేట
మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్‌ అలాగే ఉంటాయి. ఐదడుగుల నాలుగు  అంగుళాలంటే మీరు రీజనబుల్‌ ఎత్తు పెరిగినట్లే లెక్క. మీకంటే చాలా మంది పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి పొడవుకు సంబంధించిన జన్యువులు వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనం లేదా ఒడ్డూ పొడవూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయం వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్‌ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు నాలుగేళ్ల కిందటే ఆ వయసు దాటిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించకండి.ఎత్తు పెంచుతామంటూ వచ్చే ప్రకటనల్లో కేవలం వాణిజ్యపరమైన ఉత్పాదనలే. వాటితో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వాటితో ఎత్తూ పెరగలేరు. ప్రకృతిపరంగా మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం ఏమంత తక్కువ కాదు కాబట్టి, ఇప్పుడు మీరు మంచి కెరియర్‌ గురించి ఆలోచించండి. ఎత్తు పెరగడం గురించి కాదు... వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి.
డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్‌ సర్జన్‌
ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top