
భగవాన్ రమణ మహర్షి ఎడమ భుజం దిగువన చిన్న గడ్డ బయల్దేరింది. ఆయుర్వేద వైద్యులు ఏవో కట్లు కట్టినా పోలేదు. ఇంగ్లీష్ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అన్నారు. ‘‘అది ఎలా వచ్చింది అలాగే పోతుంది లెండి, దాని జోలికి మనం ఎందుకు పోవడం?’’అన్నారు భగవాన్. అయినా ఊరుకోలేదు డాక్టర్లు. ఆపరేషన్ చేశారు. తగ్గినట్టే తగ్గింది కానీ, కొంతకాలానికే అది తిరగబెట్టింది. ‘‘భగవాన్, డాక్టర్లు ఇక ఈ వ్యాధిని నయం చేయలేరు. మా మీద కరుణతో మీరే సంకల్పించుకుని నయం చేసుకోవాలి’’ అని ప్రార్థించారు భక్తులు. ‘‘నేను రమ్మన్నానా పొమ్మనేందుకు? నాకొక శరీరం ఉందనీ, దానికొక చెయ్యి ఉందనీ, ఆ చేతిమీద ఒక గడ్డ లేచిందనీ మీరంటూంటే వింటున్నాను కానీ, నాకు అదేమీ తోచడం లేదు’’అన్నారు భగవాన్. భక్తులు ఆ గడ్డను తగ్గించేందుకు ఎవరికి తోచిన సేవలు వారు చేస్తున్నారు. దాంతో ‘‘మీరందరూ వచ్చినట్లే అదీ వచ్చింది. ఈ డాక్టర్లందరూ దానికి అన్ని సేవలు చేసి గౌరవిస్తూంటే దానికి పోవాలని బుద్ధి ఎందుకు పుడుతుంది?’’అంటూ చమత్కరించారు మహర్షి.
కొంతకాలానికి భోజనం మానేశారు. దాంతో బాగా నీరసించిపోయారు. శరీరం వణకడం మొదలు పెట్టింది. బలం రావడం కోసమని భక్తులు ఆయన చేత బలవంతాన పాయసం తాగించారు. కాస్త తాగగానే వాంతి చేసుకున్నారు. అది చూసి ‘‘అయ్యో! ఈ మాత్రం కూడా ఇమడలేదే’’ భక్తులు బాధపడుతుంటే, ‘‘మీరు నాకు పాయసం ఇమడలేదని బాధపడుతున్నారు. నేను యాభై సంవత్సరాలు నూరి పోసింది మీకు ఇమడలేదని నేను బాధపడుతున్నాను. ఏం చేస్తాం! తలరాత’’ అంటూ నుదురు కొట్టుకున్నారు రమణులు. భగవాన్ అంత బాధపడడానికి కారణం ఆయన మళ్లీ మళ్లీ చెప్పిన విషయం ఒకటే. ‘‘మనం ఈ శరీరాలం కాదు. మన నిజస్వరూపం అఖండమైన ఆత్మ’’ అని.
– డి.వి.ఆర్.