మా ఊరు నచ్చిందా? మేం నచ్చామా?

Did you like our town Do we like it? - Sakshi

రిపోర్టర్స్‌ డైరీ

‘‘చాలామంది మా దేశం బావుండదని, ఇక్కడి వారు సరిగ్గా ప్రవర్తించరని అంటుంటారు. మేం ఎంత చక్కగా ఉన్నామో చూడండి, మా డ్రైవర్‌ మిమ్మల్ని ఎంత ఆత్మీయంగా చూస్తున్నాడో చూడండి. మీతో ఎంత స్నేహంగా ఉన్నారో చూడండి, మీ దేశం వెళ్లి ఈ విషయం నలుగురికీ చెప్పండి చాలు’’ అని చిన్నపిల్లల్లా చెబుతారట ఆ దేశంలో! అన్నింటికీ మించి, ఏ ప్రాంతానికి వెళ్లినా, ‘‘మా ఊరు నచ్చిందా, మేం నచ్చామా, మేం మీతో స్నేహంగా ఉన్నామా లేదా, మా ట్యాక్సీ డ్రైవర్‌ మీతో మర్యాదగానే నడుచుకున్నాడా?’’ అని ఎంతో మర్యాదగా అడుగుతారట అక్కడి డ్రైవర్లు. ఇటీవలే కుటుంబంతో పాటు మెక్సికో వెళ్లొచ్చిన ఆయుర్వేద వైద్య నిపుణులు డా. గాయత్రీదేవి చెప్పారు ఈ మాట.  మెక్సికోలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లీషు అర్థం చేసుకోగలరట. ‘‘షాపింగ్, సిటీ బస్‌... అన్ని ప్రదేశాలలోనూ స్పానిష్‌ మాట్లాడతారు. అందుకే మా అమ్మాయి అపరాజిత (అమెరికాలో ‘ఆపిల్‌’లో పనిచేస్తున్నారు) ముందుగానే స్పానిష్‌ బాగా నేర్చుకుంది’’ అని చెప్పారు గాయత్రి. ఇంకా ఆమె చెప్పిన వివరాలను బట్టి.. మెక్సికోలోని టూరిస్టు స్పాట్‌లలో ఒకరిద్దరు గైడ్స్‌ మాత్రమే ఇంగ్లీషు మాట్లాడతారు. హోటల్స్‌లో స్పానిష్‌ తప్పనిసరి.

స్పానిష్‌ అక్షరాలు చూడటానికి ఇంగ్లీషులాగానే ఉంటాయి. అక్షరాలకు పైన, కింద రకరకాలుగా వేసే గుర్తులను బట్టి ఆ పదాన్ని పలకాలి.  ఇంగ్లీషులో అడిగితే ధరలు ఎక్కువ చెబుతారని ముందే నెట్‌లో చదివిందట అపరాజిత. ఇక చిన్న చిన్న ఊళ్లు సైతం ఎంతో శుభ్రంగా కనిపిస్తుంటాయి. బీచ్‌లో ఎక్కడా చిన్నపాటి చెత్త కూడా కనిపించదు. ‘‘మెక్సికోలో టూరిస్టు ప్రదేశాలు చాలా ఎక్కువ. ఏ నంబరు బస్సు ఎక్కడికి వెళ్తుంది అని ముందుగానే గూగుల్‌లో చూసుకుంటే గమ్యస్థానాలకు చేరడం ఏమాత్రం కష్టం కాదు. బస్‌ ఎక్కేసి డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి, స్టాప్‌ రాగానే డ్రైవరు చెప్పడంతో దిగేయొచ్చు. అక్కడ... బస్సులు, ట్యాక్సీలు, కొన్ని చోట్ల తెలుపు రంగులో ఉన్న ఆటోలు కనిపించాయి. ట్యాక్సీలన్నీ ఫిక్స్‌డ్‌ రేట్లు. ఏ ప్రాంతాలలో పర్యటించాలన్నా చాలా సులువు. అన్నీ వివరంగా సైట్‌లో పెడతారు. ఏదీ వెతుక్కోనక్కర్లేదు. అక్కడ రెండు మూడు ఊళ్లు పూర్తిగా టూరిజం మీదే నడుస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పద్ధతిగా ఉంటాయి. అందువల్ల అక్కడ దేనికీ భయపడక్కర్లేదు’’ అంటున్నారు గాయత్రి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top