పేతురును వరించిన ఆత్మీయ ఐశ్వర్యం!

Devotional Stories of Jesus Christ - Sakshi

సువార్త

నేను ఎవరినని ప్రజలు అనుకొంటున్నారని యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను అడిగాడు. కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహానువని, మరికొందరు నీవు ఏలీయా లేదా యిర్మీయా లేదా మరెవరైనా ప్రవక్తవని అనుకొంటున్నారని శిష్యులు జవాబిచ్చారు. ‘మరి మీరు నేనెవరినని అనుకొంటున్నారు?’అని ప్రభువు ప్రశ్నిస్తే వాళ్ళు కొంత సందిగ్ధంలో పడ్డారు. ‘ఇంతకీ ఈయన ఎవరు?’ అన్న ప్రశ్న వాళ్ళ మనస్సులో ఉందన్నది అర్థం చేసుకునే ప్రభువు ఈ ప్రశ్న వేశాడు. ‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువువారి ఒక్క మాటకు లోబడి, శిష్యులు తమ వృత్తులు, కుటుంబాలు, ఆస్తులన్నీ వదిలిపెట్టి ఆయన్ను వెంబడించారు. అది జరిగి అప్పటికి మూడేళ్లకు పైనే అయ్యింది. ఆయన ప్రసంగాలను వాళ్ళు వింటున్నారు, ఆయన కృపను, కరుణను దగ్గరి నుండి చూస్తూ అనుభవిస్తున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలకు వాళ్లంతా ప్రత్యక్షసాక్షులు. దేవునిరాజ్యం సమీపంగా ఉన్నదన్న మూలాంశంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు విని, ఆ రాజ్యానికి ఆయనే రాజు అని వారు నిర్ధారించుకున్నారు.

అయితే ఇటీవలే అరణ్యంలో కేవలం ఐదురొట్టెలు, రెండు చేపల్ని ఆయన ఐదువేలమందికి పైగా ప్రజలకు పంచిపెట్టినపుడు, ప్రజలంతా ఎంతో సంబరపడి ఆయన్ను రాజును చెయ్యడానికి ప్రయత్నిస్తే వారి మధ్యనుండి ఆయన తప్పించుకొని వెళ్లిపోవడం వారి సందిగ్ధాన్ని మరెక్కువ చేసింది. ఆయన ఒక రాజు కాదు, ప్రవక్త కాదు, నాయకుడూ కాదు. మరి ఆయన ఎవరు? వెంటనే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని అన్నాడు.‘నరులు కాదు, దేవుడే నీకీ విషయాన్ని బయలుపర్చాడు. నీ ఈ విశ్వాసం మీదే నేను నా చర్చిని కడతాను’ అని యేసుప్రభువు వెల్లడించాడు. ‘క్రీస్తు’ అనేది యేసు పేరులో భాగం కాదు.‘అభిషిక్తుడు లేదా మెస్సీయా లేదా రక్షకుడు’ అన్నది దాని అంతరార్ధం. ధర్మశాస్త్రాన్నంతా ఎరిగిన పరిసయ్యులు, శాస్త్రులనే నాటి మేధావి వర్గానికి అర్ధం కాని ఈ మర్మాన్ని పామరుడు, వృత్తిరీత్యా జాలరి అయిన పేతురుకు బోధపడటం యేసు ప్రభువుకు ఆనందం కలిగించింది(మత్తయి 16:13–20).

ఈ ఉదంతాన్నే యోహాను తన సువార్తలో రాస్తూ, యేసు ప్రభువు యూదులతో విశ్వాసులకు జనకుడైన అబ్రాహాముకన్నా ముందునుండే ‘నేను ఉన్నవాడను’ అంటే దేవుణ్ణి అని ప్రకటిస్తే, ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు (యోహాను 8:58). మనుషుల చంచల స్వభావానికి అద్దం పట్టే ఉదంతమిది. తాము దేవుళ్ళు కాకున్నా లేనిపోని హడావుడి, ఆర్భాటం, గారడీలు చేసే మాయల మరాఠీలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు కాని దేవుడే స్వయంగా తనను తాను తగ్గించుకొని, సాత్వికుడై పరలోకంనుండి దిగి వచ్చి సామాన్య ప్రజలతో మమేకమై వారి మధ్యే నివసించి తన మహిమల్ని, పరలోకాధికారాన్ని అంత స్పష్టంగా రుజువు చేసుకొంటున్నా ఆయన్ను దేవుడిగా విశ్వసించడానికి వెనకాడుతారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, ఎంతోమంది ప్రవక్తలు తమ ప్రవచనాల్లో పేర్కొన్న ‘మెస్సీయా’ఆయన అన్న పరలోక మర్మాన్ని పేతురు ఒడిసిపట్టుకున్నాడు.

ఆ మెస్సీయా ప్రబోధాలు, జీవితం, పాపక్షమాపణా సూత్రమే పునాదిగా చర్చిని యేసుప్రభువే స్వయంగా నిర్మించడానికి దారి తీసిన ఉపోద్ఘాతమిది. ఈ లోకసంబంధమైన విజ్ఞానం భూమి నుండి రాకెట్‌లో చంద్రమండలానికెళ్లడానికి పనికొస్తుంది. కాని పరలోకం నుండి భూమిపైకి దిగి వచ్చిన మెస్సీయాగా యేసును అర్థం చేసుకోవడానికి ఈ లోకజ్ఞానం ఎంతున్నా సరిపోదు. అది పరలోకజ్ఞానంతోనే సాధ్యమవుతుంది కాబట్టే పామరుడైన పేతురుకు కూడా ఆ వాస్తవం అర్ధమయ్యింది. మనిషి పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా అంధుడని, అతనిలో ఆత్మీయనేత్రాలను దేవుడే తెరుస్తాడంటూ యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు. పామరులేమో ‘ప్రభువునెరుగుతుంటే, మహాపండితులు’ఆత్మీయంగా అంధులుగా’ మిగిలిపోవడం వెనుక ఉన్న రహస్యమిదే!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top