ఆత్మసౌందర్యాన్ని ఆస్వాదించే దేవుడు

devotional information by prabhu kiran - Sakshi

యేసుక్రీస్తు ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. ‘దేవాలయపు రాళ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అక్కడి అలంకరణలు చూడండి’ అంటూ అంతా దేవాలయ సౌందర్యాన్ని ప్రభువుకు వర్ణించి చెబుతున్నారు. దేవాలయం గొప్పదనాన్ని దేవునికే వర్ణించి చెబుతున్న కొందరు భక్తుల సాహసమిది.

కాని ఎంత గొప్పది, అందమైనదైనా దేవాలయం దేవునికన్నా గొప్పదెలా అవుతుంది? యేసు వారికి జవాబు చెబుతూ, ‘ఈ దేవాలయమంతా ధ్వంసమై పాడుదిబ్బగా మారే రోజొకటి రాబోతోంది, అప్పుడు ఇంత అద్భుతమైన రాళ్లూ ఒకదాని మీద మరొకటి నిలవకుండా పడదోయబడ్తాయంటూ ప్రవచనం చెప్పాడు.

ఆ తర్వాత దాదాపుగా 45 ఏళ్లకు అంటే క్రీస్తు శకÆ  70లో టైటస్‌ అనే రోమా చక్రవర్తి దేవాలయన్నాంతా ధ్వంసం చేశాడు. దేవాలయ నిర్మాణంలో భక్తి కొద్దీ రాయికీ రాయికీ మధ్య బంగారాన్ని కరిగించి నింపగా, టైటస్‌ చక్రవర్తి ఒక్కొక్క రాయీ తొలగించి రాళ్లమధ్యలో ఉన్న బంగారాన్నంతా వెలికితీయించి దోచుకుపోయాడు. యేసు చెప్పిన మాటలు అలా అక్షరాలా నెరవేరాయి (లూకా 21:5–9).

దైవకుమారుడైన యేసు సౌందర్యాన్ని ఆస్వాదించడా?  ఆయన సృష్టించేదీ, ఆస్వాదించేదీ బాహ్యసౌందర్యాన్ని కాదు, ఆత్మసౌందర్యాన్ని. ఇది జరగడానికి ముందు ఆయన దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర కూర్చొని, అందులో పెద్దమొత్తాల్లో కానుకలు వేసి అక్కడి యాజకుల ద్వారా గొప్పదాతలుగా ప్రకటనలు చేయించుకుంటున్న చాలామంది భక్తుల డాబూదర్పాన్ని, వేషధారణను, పైకి ఎంతో గౌరవంగా కనిపిస్తున్నా ఆంతర్యంలో గూడుకట్టుకొని ఉన్న వారి మాలిన్యాన్ని, పాపపు కంపును ఆయన అర్థం చేసుకున్నాడు.

అంతలో ఒక పేద విధవరాలు తన వద్ద ఉన్న రెండే రెండు కాసులనూ ఎంతో రహస్యంగా వేసి నిశ్శబ్దంగా వెళ్లిపోగా ఆమె ఆత్మసౌందర్యం, అంతరంగంలో దేవుడంటే ఆమెకున్న ప్రేమ యేసును ముగ్ధుణ్ణి చేసింది. ఆమె అందరికన్నా అధికంగా కానుక వేసిందని, అయినా తమ సమృద్ధిలో నుండి దేవునికి అర్పిస్తే, తానే లేమిలో ఉండి కూడా ఆమె తనకు కలిగినదంతా దేవునికిచ్చిందని ప్రభువు శ్లాఘించాడు (లూకా 21:1–4). భక్తులకూ, ఆయన శిష్యులకూ దేవాలయపు రాళ్లలో, అలంకరణల్లో సౌందర్యం కనిపిస్తే, యేసుకు ఒక పేద భక్తురాలి త్యాగంలో ఆమె వేసిన చిరుకానుకలో ‘ఆత్మసౌందర్యం’ కనిపించింది.

గొప్ప కానుకలు వేసిన వారికి యాజకుల మన్ననలు, మెప్పు లభించాయి. రెండే కాసులు వేసిన పేద విధవరాలికి ఏకంగా దేవుని ప్రశంసే లభించింది.  గొప్ప కానుకలు వేసిన భక్తులు, వారిని ప్రశంసించిన యాజకులూ కాలక్రమంలో చనిపోయారు, దేవాలయమే కొంతకాలానికి ధ్వంసమైంది. కాని ఆ పేద విధవరాలి చిన్న కానుక మాత్రం క్రీస్తు ప్రశంస కారణంగా చరిత్రపుటల్లోకెక్కి ఇన్నివేల ఏళ్ళుగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. దేవుణ్ణి మెప్పించేది అనిత్యమైన కానుకలు కాదు, శాశ్వతమైన ఆత్మసౌందర్యమన్నది మరోసారి రుజువైంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top