‘ఛపక్‌’.. ధైర్య ప్రదాతలు | Sakshi
Sakshi News home page

‘ఛపక్‌’.. ధైర్య ప్రదాతలు

Published Mon, Dec 23 2019 12:13 AM

Deepika Padukone Acting In Acid Victim Laxmi Agarwal Biopic - Sakshi

‘యాసిడ్‌ పడింది మా ముఖం మీద మాత్రమే, మా మనో ధైర్యం అలాగే ఉంది’.. యాసిడ్‌ బాధితులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ‘ఛపక్‌’ పేరుతో సినిమాగా వస్తోంది. చిన్నతనంలో భయంకరమైన యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ పెద్దయిన తర్వాత ప్రభుత్వం యాసిడ్‌ అమ్మకాల మీద నియంత్రణ విధించే వరకు పోరాటాన్ని కొనసాగించారు. ఆ పాత్రనే  ఛపక్‌లో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారు. సినిమా జనవరి 10న విడుదల అవుతోంది. ఇప్పటికే ట్రెయిలర్‌ రిలీజ్‌ అయ్యి ప్రశంసలను అందుకుంటోంది.

లక్ష్మిలా.. భస్మం నుంచి ఫీనిక్స్‌లా లేచిన ధీరలెందరో. వాళ్లు నేటి సమాజంలో పోరాడుతూ ఉన్నారు, సమాజంతో పోరాడుతూ ఉన్నారు. వారిలో ముగ్గురు... ప్రగ్యాసింగ్, దౌలత్‌ బీ ఖాన్, అన్‌మోల్‌ రోడ్రిగ్స్‌. ఈ ముగ్గురి గురించి క్లుప్తంగా.

పెళ్లొద్దన్నందుకు

ప్రగ్యా సింగ్‌

ప్రగ్యా సింగ్‌ 2006లో వారణాసి నుంచి ఢిల్లీ వస్తోంది. అప్పటికి ఆమెకు 23 ఏళ్లు, పెళ్లయి పన్నెండు రోజులైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, ఆమె రైల్లో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమె ముఖం మీద యాసిడ్‌ చిమ్మింది. దాడి చేసిన వ్యక్తి గతంలో ఆమెను పెళ్లాడాలని అడిగి ఆమె నిరాకరించడంతో కోపం పెట్టుకున్నవాడు. అతడి ప్రకోపానికి గురయింది ప్రగ్యాసింగ్‌. ప్రాణాపాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె మామూలు కావడానికి పదిహేనుకు పైగా సర్జరీలయ్యాయి. ఇప్పుడామె.. భర్త, స్నేహితుల సహకారంతో ‘అతిజీవన్‌ ఫౌండేషన్‌’ అనే ఎన్‌జీవోను స్థాపించి, యాసిడ్‌ బాధితులకు ధైర్యాన్నిస్తోంది. ఉచితంగా ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తోంది. వాళ్లు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇద్దరు బిడ్డలతో సంతోషంగా జీవిస్తున్న తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకోవలసిందిగా ఆమె బాధితుల్లో స్ఫూర్తిని పెంచుతోంది.

గృహ హింస

దౌలత్‌

దౌలత్‌ బీ ఖాన్‌ది ముంబయి. ఇరవై ఆరేళ్ల వయసులో తన పెద్దక్క, బావల నుంచే గృహహింసలో భాగంగా యాసిడ్‌ దాడికి గురైందామె! ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ 2016లో ‘సాహాస్‌ ఫౌండేషన్‌’ స్థాపించి యాసిడ్‌ దాడికి గురైన బాధితులకు భరోసాగా నిలుస్తోంది. వైద్య సహాయంతోపాటు వారికి న్యాయపరమైన సహాయం కూడా అందిస్తోంది. బాధితులు సౌకర్యంగా పని చేసుకోగలిగిన ఉద్యోగాలను గాలిస్తూ వారిని ఆ ఉద్యోగాల్లో చేరుస్తోంది దౌలత్‌.

పాపాయిగా ఉన్నప్పుడే!

అన్‌మోల్‌

అన్‌మోల్‌ పరిస్థితి మరీ ఘోరం. రెండు నెలల పాపాయిగా ఉన్నప్పుడు యాసిడ్‌ దాడికి గురైంది. ఆడపిల్ల పుట్టిందని భార్యాబిడ్డలను హతమార్చాలనుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డకు పాలిస్తున్న భార్య మీద, పాలు తాగుతున్న బిడ్డ మీద యాసిడ్‌ కుమ్మరించాడు. అన్‌మోల్‌ తల్లి ప్రాణాలు కోల్పోయింది, అన్‌మోల్‌ బతకడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమె బాల్యమంతా హాస్పిటల్‌ బెడ్, ఆపరేషన్‌ థియేటర్‌లలో గడిచిపోయింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అనాథ శరణాలయం ఆమె అడ్రస్‌ అయింది. బాల్యంలో తోటి పిల్లల ప్రశ్నార్థకపు చూపులను తట్టుకుని గట్టి పడిపోయిందామె. అదే ధైర్యంతో స్కూలు, కాలేజ్‌ చదువు పూర్తి చేసి ఫ్యాషన్‌రంగాన్ని కెరీర్‌గా మలుచుకుంది. ఇప్పుడామె సక్సెస్‌ఫుల్‌ మోడల్‌. తాను మోడలింగ్‌ చేస్తూ, మరో పక్క ఇరవై మంది యాసిడ్‌ సర్వైవర్స్‌కి సహాయం చేసింది. వారికి బతుకు మీద ధైర్యాన్ని కల్పించడం, బతుకుకు ఒక మార్గాన్ని చూపించడం అన్‌మోల్‌ చేస్తున్న సహాయం. నిజమే... యాసిడ్‌ పడింది వాళ్ల ముఖం మీద మాత్రమే. వాళ్ల మనోధైర్యం మీద కాదు.
– మంజీర

Advertisement
 
Advertisement
 
Advertisement