పాఠకుల ప్రశ్నలకు డా.ఖాదర్‌ సమాధానాలు | Sakshi
Sakshi News home page

పాఠకుల ప్రశ్నలకు డా.ఖాదర్‌ సమాధానాలు

Published Tue, Feb 13 2018 12:13 AM

curing cancer disease with millets Dr Khader answers - Sakshi

మైసూరుకు చెందిన స్వతంత్ర ఆహార, అటవీ కృషి శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి అందించిన సమాచారం మేరకు ‘సాక్షి’ దినపత్రిక ‘ఫ్యామిలీ’లో 2018 జనవరి 25న.. ‘కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం..’ ‘కేన్సర్‌పై చిరు పిడికిలి’ శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిని చదివిన పాఠకులు కొందరు తమ ప్రశ్నలను సాక్షి కార్యాలయానికి పంపారు. ఆ ప్రశ్నలకు డాక్టర్‌ ఖాదర్‌ చెప్పిన సమాధానాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.

గమనిక: డా.ఖాదర్‌వలి ఇక్కడ సూచించిన చికిత్సలతో ఒకరికి 3 నెలల్లో నయమైతే, మరొకరికి సంవత్సరం పట్టొచ్చు.. అది వారి రోగనిరోధకశక్తిని బట్టి ఉంటుంది. పరిమాణం, ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఫలితాలు వేరుగా ఉంటాయి. అవసరాన్ని బట్టి స్థానిక ఆయుర్వేద/హోమియో వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవచ్చు.

ప్రశ్న: హైపోధైరాయిడ్‌తో బాధపడుతూ రోజూ టాబ్లెట్లు వేసుకుంటున్నాను. సిరిధాన్యాలు తింటూ, కషాయాలుæతాగితే ఈ సమస్య పోతుందా? –అనూష, గృహిణి, మొహిదీపట్నం, హైదరాబాద్‌.
ప్రశ్న: నా వయసు 51 ఏళ్లు. గత పదేళ్లుగా థైరాయిడ్‌ సమస్య ఉంది. 75 ఎం.జి. టాబ్లెట్‌ రోజూ వాడుతున్నా. పరిష్కారం చెప్పండి? – టి. రజని, మచిలీపట్నం, కృష్ణా జిల్లా

డా.ఖాదర్‌వలి: థైరాయిడ్‌ సంబంధిత సమస్యలున్న ఎవరైనా.. 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు ఊదలు, ఒక రోజు అరికలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అండుకొర్రల బియ్యం వండుకు తినాలి. తర్వాత మళ్లీ 3 రోజులు సామ బియ్యం, మిగతా 4 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒకటి చొప్పున తినాలి. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఆ సిరిధాన్యాన్నే తినాలి. కషాయాలు.. మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం మరో వారం, తమలపాకుల కషాయం మరో వారం.. అలా మార్చి మార్చి వాడుకోవాలి. రోజుకు 2 లేదా 3 సార్లు కషాయం తాగవచ్చు. వీటితోపాటు.. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తాగాలి. గానుగ పట్టిన కుసుమ నూనె ఒక నెల, కొబ్బరి నూనె మరో నెల.. మార్చి, మార్చి తాగితే ఇంకా మంచిది. కుసుమ నూనె దొరక్కపోతే కొబ్బరి నూనే వాడొచ్చు. 3 నెలల తర్వాత వారానికి ఒకటి, రెండు సార్లు తాగితే చాలు. థైరాయిడ్‌ సమస్య ఉన్న వాళ్లు ముఖ్యంగా రోజూ గంట సేపు నడవడం తప్పనిసరి. ఇలా చేస్తూ ఉంటే.. 5 వారాల్లో 25% అల్లోపతి మందులను తగ్గించవచ్చు. అలా.. 20 వారాల్లో పూర్తిగా మందులు ఆపేయవచ్చు. ఆ తర్వాత కూడా సిరిధాన్యాలు తినటం, కషాయాలు కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండొచ్చు. థైరాయిడ్‌ ఎక్కువున్నా, తక్కువున్నా ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఎక్కువ ఉన్న వారికి నార్మల్‌కు రావడానికి ఎక్కువ కాలం పట్టొచ్చు.

ప్రశ్న: నా వయసు 67 ఏళ్లు. 1998 నుంచి హైపోథైరాయిడ్‌ ఉంది. మధుమేహం ఉంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. హోమియో మందుతో ఉపశమనం పొందుతున్నాను. నా ఆహార విధానం సిరిధాన్యాలలోకి మార్చుకుంటే మేలు జరుగుతుందా? –కె.నాగమల్లేశ్వరరావు, విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్, హనుమాన్‌ జంక్షన్, కృష్ణా జిల్లా

డా. ఖాదర్‌వలి: 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్‌ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి.

ప్రశ్న: సిరిధాన్యాలు, కషాయాలతో కేన్సర్‌ వ్యాధులకు చికిత్స గురించి జనవరి 25న సాక్షి ఫ్యామిలీలో సవివరమైన సమాచారం ఇచ్చినందుకు ‘సాక్షి’కి, డా.ఖాదర్‌ గారికి కృతజ్ఞతలు. మధుమేహం, ఆర్థరైటిస్‌ సంధివాతానికి, హెపటైటిస్‌–బికి ఏయే సిరిధాన్యాలు, కషాయాలు వాడాలో తెలియజేయండి. ఈ సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయో చెప్పండి. –కె. ఎ. గోపాల్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, సన్నకారు రైతు, కొంగనపాడు గ్రామం, కల్లూరు మం., కర్నూలు జిల్లా

డా.ఖాదర్‌వలి: వీరికి కూడా పై సమాధానమే వర్తిస్తుంది. 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్‌ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి.

సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయి?
డాక్టర్‌ ఖాదర్‌: సిరిధాన్యాల కోసం మీ దగ్గరలోని రైతుబజార్లలోనో, మరో చోటో సేంద్రియ ఆహారోత్పత్తులు అమ్మే దుకాణదాలు ఉంటాయి. వారిని సిరిధాన్యాలు కావాలని అడగండి. ప్రజలు దుకాణదారులను అడుగుతూ ఉంటే వాళ్లే తెప్పించి ఇవ్వడం ప్రారంభమవుతుంది. మీ ప్రాంతంలో రైతులను కూడా ప్రోత్సహించండి.. 5 రకాల సిరిధాన్యాలను సాగు చేయమని. నేనైతే అమ్మటం లేదు. రాయచూరులో ఆనంద్‌పాటిల్‌(097313 14333) అనే రైతు తాను ఐదేళ్లుగా సిరిధాన్యాలు ఐదు రకాలను పండించి, అమ్ముతున్నారు. విత్తనాలు ఇచ్చి ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తూ.. 5 రకాల సిరిధాన్యాలను విక్రయిస్తున్నారు. పార్శిల్‌/కొరియర్‌ ద్వారా కూడా పంపుతారు.   

అనారోగ్యానికి మీరు నిజంగా పరిష్కారం ఆశిస్తుంటే
తప్పకుండా పాటించాల్సిన విషయాలు: డా. ఖాదర్‌  
బియ్యం/గోధుమ పిండిని ముఖ్య ఆహారంగా తీసుకోవడం ఆపెయ్యాలి. వీటిలో పీచుపదార్ఢం–పిండిపదార్థం దామాషా చిరుధాన్యాలతో పోల్చినప్పుడు అతి తక్కువ.
రోజువారీగా ప్రధాన ఆహారంగా చిరుధాన్యాలను తినండి. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలను రోజుకు ఒకటి చొప్పున తినండి. రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటలు కూడా ఒకే రకం చిరుధాన్యాన్ని తినండి. ఔషధ గుణాలతో అనారోగ్యాన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించటం ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది.
మీ దేహానికి అవసరమైన పోషకాలను సరిపడినంతగా అందించడానికి, విషాలను బయటకు పంపడానికి ఒక రోజు ఒకే చిరుధాన్యం తినాలి. రోజులో మూడు పూటలూ ఒకే చిరుధాన్యాన్ని తినటం ఇందువల్ల అత్యవసరమని గుర్తించండి. ఆ తెల్లారి మరో రకం చిరుధాన్యాన్ని తినండి.  
ఆవు, గేదె, మేక తదితర జంతువుల పాలకు బదులుగా.. కొబ్బరి పాలు, నువ్వుల పాలు తయారు చేసుకొని వాడుకుంటే ఆరోగ్యం.  జంతువుల పాలు తాగటం వెనువెంటనే ఆపెయ్యాలి. పాలు కలిపి తాగే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్‌.. అన్నీ ఆపెయ్యాలి. పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. తిరిగి ఆరోగ్యం పొందడానికి ఇదే పరిష్కారం. జంతువుల పాల వల్ల మీ దేహంలో హార్మోన్‌ అసమతుల్యత వస్తున్నది. పాలు వాడటం ఆపెయ్యడంతోటే కనీసం 50% అనారోగ్యం పోతుంది. పాలను తోడేసినప్పుడు.. పెరుగుగా తోడుకునే క్రమంలో అందులోని రసాయనాల విషప్రభావాన్ని సూక్ష్మజీవరాశి నశింపచేస్తుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ పర్వాలేదు.
అల్లోపతి వైద్యులు యాంటీ బయోటిక్‌ మందులు ఇచ్చినన్నాళ్లు ఇస్తారు. అవి పనిచేయకపోతే, స్టెరాయిడ్స్‌ ఇస్తారు. అనారోగ్యం పెరుగుతుందే గాని, తగ్గదు. ఇది పరిష్కారం కాదు.
హోమియో / ఆయుర్వేద మందులు వాడండి.  
నువ్వు పాల తయారీ విధానం: 100 గ్రాముల నువ్వులు తీసుకొని ఒకటిన్నర లీటర్ల నీటిలో బాగా నానబెట్టాలి. నానిన నువ్వులను రోలులో రెండు, మూడు సార్లు పొత్రంతో రుబ్బాలి. నువ్వులు నానబెట్టిన నీటినే పోస్తూ రుబ్బిన తర్వాత తీసి వస్త్రంలో వేసి పిండాలి. అలా మూడు, నాలుగు సార్లు రుబ్బి, పిండగా వచ్చిన పాలనే తిరిగి రోట్లో పోస్తూ మళ్లీ పిండితే.. చక్కని నువ్వు పాలు వస్తాయి. ఏ వయసు వారైనా వాడొచ్చు.

గమనిక: డా. ఖాదర్‌వలి చికిత్స విధానాన్ని గురించి మరింత వివరంగా తెలుసుకోగోరే వారు Youtubeలో ఆయన వీడియోలను చూడవచ్చు. Doctor Khader, Siridhanyalu, Mysuru, Telugu అని టైప్‌ చేస్తే ఆయన ప్రసంగాలను చూసి అవగాహన పెంచుకోవచ్చు. స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించి.. వివిధ సదస్సుల్లో ప్రసంగించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఈ సదస్సులను నిర్వహిస్తున్నాయి. ప్రసంగాల అనంతరం సభికుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

సదస్సుల వివరాలు..
2018 మార్చి 4వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆడిటోరియం. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (హైదరాబాద్‌) – 99638 19074
మార్చి 5వ తేదీ: ఉదయం 10 గంటలకు.. సత్యసాయి మందిరం.. వనపర్తి
మార్చి 5వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. నారాయణ్‌పేట్‌
మార్చి 6వ తేదీ: ఉదయం 10 గంటలకు: చంద్ర గార్డెన్స్, జడ్చర్ల
మార్చి 6వ తేదీ: సాయంత్రం 10 గంటలకు.. క్రౌన్‌ గార్డెన్స్, మహబూబ్‌నగర్‌.. వివరాలకు.. బసవరాజ్‌(మహబూబ్‌నగర్‌) – 93466 94156
మార్చి 7వ తేదీ: సికింద్రాబాద్‌లో ఉదయం, సాయంత్రం సదస్సులు జరుగుతాయి. వివరాలకు.. శివశంకర్‌ (హైదరాబాద్‌)– 94401 26778

Advertisement
Advertisement