breaking news
independent scientist Dr. Khader
-
పాఠకుల ప్రశ్నలకు డా.ఖాదర్ సమాధానాలు
మైసూరుకు చెందిన స్వతంత్ర ఆహార, అటవీ కృషి శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి అందించిన సమాచారం మేరకు ‘సాక్షి’ దినపత్రిక ‘ఫ్యామిలీ’లో 2018 జనవరి 25న.. ‘కేన్సర్‌ను సిరిధాన్యాలతో జయిద్దాం..’ ‘కేన్సర్‌పై చిరు పిడికిలి’ శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిని చదివిన పాఠకులు కొందరు తమ ప్రశ్నలను సాక్షి కార్యాలయానికి పంపారు. ఆ ప్రశ్నలకు డాక్టర్ ఖాదర్ చెప్పిన సమాధానాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. గమనిక: డా.ఖాదర్‌వలి ఇక్కడ సూచించిన చికిత్సలతో ఒకరికి 3 నెలల్లో నయమైతే, మరొకరికి సంవత్సరం పట్టొచ్చు.. అది వారి రోగనిరోధకశక్తిని బట్టి ఉంటుంది. పరిమాణం, ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఫలితాలు వేరుగా ఉంటాయి. అవసరాన్ని బట్టి స్థానిక ఆయుర్వేద/హోమియో వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవచ్చు. ప్రశ్న: హైపోధైరాయిడ్తో బాధపడుతూ రోజూ టాబ్లెట్లు వేసుకుంటున్నాను. సిరిధాన్యాలు తింటూ, కషాయాలుæతాగితే ఈ సమస్య పోతుందా? –అనూష, గృహిణి, మొహిదీపట్నం, హైదరాబాద్. ప్రశ్న: నా వయసు 51 ఏళ్లు. గత పదేళ్లుగా థైరాయిడ్ సమస్య ఉంది. 75 ఎం.జి. టాబ్లెట్ రోజూ వాడుతున్నా. పరిష్కారం చెప్పండి? – టి. రజని, మచిలీపట్నం, కృష్ణా జిల్లా డా.ఖాదర్‌వలి: థైరాయిడ్ సంబంధిత సమస్యలున్న ఎవరైనా.. 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు ఊదలు, ఒక రోజు అరికలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అండుకొర్రల బియ్యం వండుకు తినాలి. తర్వాత మళ్లీ 3 రోజులు సామ బియ్యం, మిగతా 4 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒకటి చొప్పున తినాలి. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఆ సిరిధాన్యాన్నే తినాలి. కషాయాలు.. మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం మరో వారం, తమలపాకుల కషాయం మరో వారం.. అలా మార్చి మార్చి వాడుకోవాలి. రోజుకు 2 లేదా 3 సార్లు కషాయం తాగవచ్చు. వీటితోపాటు.. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తాగాలి. గానుగ పట్టిన కుసుమ నూనె ఒక నెల, కొబ్బరి నూనె మరో నెల.. మార్చి, మార్చి తాగితే ఇంకా మంచిది. కుసుమ నూనె దొరక్కపోతే కొబ్బరి నూనే వాడొచ్చు. 3 నెలల తర్వాత వారానికి ఒకటి, రెండు సార్లు తాగితే చాలు. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు ముఖ్యంగా రోజూ గంట సేపు నడవడం తప్పనిసరి. ఇలా చేస్తూ ఉంటే.. 5 వారాల్లో 25% అల్లోపతి మందులను తగ్గించవచ్చు. అలా.. 20 వారాల్లో పూర్తిగా మందులు ఆపేయవచ్చు. ఆ తర్వాత కూడా సిరిధాన్యాలు తినటం, కషాయాలు కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండొచ్చు. థైరాయిడ్ ఎక్కువున్నా, తక్కువున్నా ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఎక్కువ ఉన్న వారికి నార్మల్కు రావడానికి ఎక్కువ కాలం పట్టొచ్చు. ప్రశ్న: నా వయసు 67 ఏళ్లు. 1998 నుంచి హైపోథైరాయిడ్ ఉంది. మధుమేహం ఉంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. హోమియో మందుతో ఉపశమనం పొందుతున్నాను. నా ఆహార విధానం సిరిధాన్యాలలోకి మార్చుకుంటే మేలు జరుగుతుందా? –కె.నాగమల్లేశ్వరరావు, విశ్రాంత బ్యాంక్ మేనేజర్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా డా. ఖాదర్‌వలి: 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి. ప్రశ్న: సిరిధాన్యాలు, కషాయాలతో కేన్సర్ వ్యాధులకు చికిత్స గురించి జనవరి 25న సాక్షి ఫ్యామిలీలో సవివరమైన సమాచారం ఇచ్చినందుకు ‘సాక్షి’కి, డా.ఖాదర్ గారికి కృతజ్ఞతలు. మధుమేహం, ఆర్థరైటిస్ సంధివాతానికి, హెపటైటిస్–బికి ఏయే సిరిధాన్యాలు, కషాయాలు వాడాలో తెలియజేయండి. ఈ సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయో చెప్పండి. –కె. ఎ. గోపాల్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, సన్నకారు రైతు, కొంగనపాడు గ్రామం, కల్లూరు మం., కర్నూలు జిల్లా డా.ఖాదర్‌వలి: వీరికి కూడా పై సమాధానమే వర్తిస్తుంది. 5 రకాల సిరిధాన్యాలు (కొర్ర, అండుకొర్ర, సామ, అరిక, ఊద) బియ్యాన్ని ఒక్కో రకాన్ని వరుసగా రెండేసి రోజుల చొప్పున తినాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కల్తీలేని కొబ్బరి నూనెను రోజూ ఉదయం 3 చెంచాలు తాగాలి. మెల్లిగా వాకింగ్ చేయాలి. మారేడు(బిల్వపత్రాల)ఆకుల కషాయం ఒక వారం, రావి ఆకుల కషాయం మరో వారం, వేప ఆకుల కషాయం తర్వాత వారం చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి. సిరిధాన్యాలు ఎక్కడ లభిస్తాయి? డాక్టర్ ఖాదర్: సిరిధాన్యాల కోసం మీ దగ్గరలోని రైతుబజార్లలోనో, మరో చోటో సేంద్రియ ఆహారోత్పత్తులు అమ్మే దుకాణదాలు ఉంటాయి. వారిని సిరిధాన్యాలు కావాలని అడగండి. ప్రజలు దుకాణదారులను అడుగుతూ ఉంటే వాళ్లే తెప్పించి ఇవ్వడం ప్రారంభమవుతుంది. మీ ప్రాంతంలో రైతులను కూడా ప్రోత్సహించండి.. 5 రకాల సిరిధాన్యాలను సాగు చేయమని. నేనైతే అమ్మటం లేదు. రాయచూరులో ఆనంద్‌పాటిల్(097313 14333) అనే రైతు తాను ఐదేళ్లుగా సిరిధాన్యాలు ఐదు రకాలను పండించి, అమ్ముతున్నారు. విత్తనాలు ఇచ్చి ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తూ.. 5 రకాల సిరిధాన్యాలను విక్రయిస్తున్నారు. పార్శిల్/కొరియర్ ద్వారా కూడా పంపుతారు. అనారోగ్యానికి మీరు నిజంగా పరిష్కారం ఆశిస్తుంటే తప్పకుండా పాటించాల్సిన విషయాలు: డా. ఖాదర్ ► బియ్యం/గోధుమ పిండిని ముఖ్య ఆహారంగా తీసుకోవడం ఆపెయ్యాలి. వీటిలో పీచుపదార్ఢం–పిండిపదార్థం దామాషా చిరుధాన్యాలతో పోల్చినప్పుడు అతి తక్కువ. ► రోజువారీగా ప్రధాన ఆహారంగా చిరుధాన్యాలను తినండి. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలను రోజుకు ఒకటి చొప్పున తినండి. రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటలు కూడా ఒకే రకం చిరుధాన్యాన్ని తినండి. ఔషధ గుణాలతో అనారోగ్యాన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించటం ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది. ► మీ దేహానికి అవసరమైన పోషకాలను సరిపడినంతగా అందించడానికి, విషాలను బయటకు పంపడానికి ఒక రోజు ఒకే చిరుధాన్యం తినాలి. రోజులో మూడు పూటలూ ఒకే చిరుధాన్యాన్ని తినటం ఇందువల్ల అత్యవసరమని గుర్తించండి. ఆ తెల్లారి మరో రకం చిరుధాన్యాన్ని తినండి. ► ఆవు, గేదె, మేక తదితర జంతువుల పాలకు బదులుగా.. కొబ్బరి పాలు, నువ్వుల పాలు తయారు చేసుకొని వాడుకుంటే ఆరోగ్యం. జంతువుల పాలు తాగటం వెనువెంటనే ఆపెయ్యాలి. పాలు కలిపి తాగే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్.. అన్నీ ఆపెయ్యాలి. పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. తిరిగి ఆరోగ్యం పొందడానికి ఇదే పరిష్కారం. జంతువుల పాల వల్ల మీ దేహంలో హార్మోన్ అసమతుల్యత వస్తున్నది. పాలు వాడటం ఆపెయ్యడంతోటే కనీసం 50% అనారోగ్యం పోతుంది. పాలను తోడేసినప్పుడు.. పెరుగుగా తోడుకునే క్రమంలో అందులోని రసాయనాల విషప్రభావాన్ని సూక్ష్మజీవరాశి నశింపచేస్తుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ పర్వాలేదు. ► అల్లోపతి వైద్యులు యాంటీ బయోటిక్ మందులు ఇచ్చినన్నాళ్లు ఇస్తారు. అవి పనిచేయకపోతే, స్టెరాయిడ్స్ ఇస్తారు. అనారోగ్యం పెరుగుతుందే గాని, తగ్గదు. ఇది పరిష్కారం కాదు. ► హోమియో / ఆయుర్వేద మందులు వాడండి. ► నువ్వు పాల తయారీ విధానం: 100 గ్రాముల నువ్వులు తీసుకొని ఒకటిన్నర లీటర్ల నీటిలో బాగా నానబెట్టాలి. నానిన నువ్వులను రోలులో రెండు, మూడు సార్లు పొత్రంతో రుబ్బాలి. నువ్వులు నానబెట్టిన నీటినే పోస్తూ రుబ్బిన తర్వాత తీసి వస్త్రంలో వేసి పిండాలి. అలా మూడు, నాలుగు సార్లు రుబ్బి, పిండగా వచ్చిన పాలనే తిరిగి రోట్లో పోస్తూ మళ్లీ పిండితే.. చక్కని నువ్వు పాలు వస్తాయి. ఏ వయసు వారైనా వాడొచ్చు. గమనిక: డా. ఖాదర్‌వలి చికిత్స విధానాన్ని గురించి మరింత వివరంగా తెలుసుకోగోరే వారు Youtubeలో ఆయన వీడియోలను చూడవచ్చు. Doctor Khader, Siridhanyalu, Mysuru, Telugu అని టైప్ చేస్తే ఆయన ప్రసంగాలను చూసి అవగాహన పెంచుకోవచ్చు. స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించి.. వివిధ సదస్సుల్లో ప్రసంగించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఈ సదస్సులను నిర్వహిస్తున్నాయి. ప్రసంగాల అనంతరం సభికుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. సదస్సుల వివరాలు.. 2018 మార్చి 4వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియం. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (హైదరాబాద్) – 99638 19074 మార్చి 5వ తేదీ: ఉదయం 10 గంటలకు.. సత్యసాయి మందిరం.. వనపర్తి మార్చి 5వ తేదీ: సాయంత్రం 5 గంటలకు.. నారాయణ్‌పేట్ మార్చి 6వ తేదీ: ఉదయం 10 గంటలకు: చంద్ర గార్డెన్స్, జడ్చర్ల మార్చి 6వ తేదీ: సాయంత్రం 10 గంటలకు.. క్రౌన్ గార్డెన్స్, మహబూబ్‌నగర్.. వివరాలకు.. బసవరాజ్(మహబూబ్‌నగర్) – 93466 94156 మార్చి 7వ తేదీ: సికింద్రాబాద్‌లో ఉదయం, సాయంత్రం సదస్సులు జరుగుతాయి. వివరాలకు.. శివశంకర్ (హైదరాబాద్)– 94401 26778 -
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ ► ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం ► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం ► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, మధుమేహం తదితర జబ్బులన్నీ వాటికవే నయమవుతాయంటున్న అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త ► అమెరికాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చి మైసూరు ప్రాంతంలో స్థిర నివాసం.. ► 20 ఏళ్లుగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నడాక్టర్ ఖాదర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యక్తి కాదు.. శక్తి!! ప్రజల ఆహారపు అలవాట్లను, రైతుల సాగు పద్ధతిని రసాయన రహితంగా, పంటల సరళిని అత్యంత ఆరోగ్యదాయకమైన రీతిలోకి, ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోకి మార్చేందుకు గత రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ ఖాదర్. వర్షాధారంగా కొద్దిపాటి నీటి(200 ఎం.ఎం.)తో పండే చిరుధాన్యాలే అసలైన ఔషధ విలువలున్న ఆహార పదార్థాలని, మానవాళిని పీడిస్తున్న ఈ కాలపు సకల రోగాలకు ఈ ‘సిరి’ధాన్యాలే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపూర్ణ ఆహారమంటూ డాక్టర్ ఖాదర్ ప్రచారోద్యమం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రద్ధగా చదువుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి పర్యావరణ సంబంధమైన అంశాలపైన, రసాయనాలకు విరుగుడు కనుగొనే అంశాలపైన వివిధ కంపెనీలలో పదేళ్ల పాటు పనిచేశారు. ఆధునిక మానవ సమాజం తినకూడనివి తింటూ దారుణమైన రోగాల పాలు కావడంతోపాటు.. భూమాతను రసాయనిక వ్యవసాయంతో నాశనం చేసుకుంటూ ఉండటం ఆయనను అమెరికాలో నిలువనీయకుండా చేసింది. 1997లో తిరిగి వచ్చి మైసూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పురాతన భారతీయ ప్రకృతి సేద్య పద్ధతి అయిన ‘అటవీ కృషి’ (కాడు కృషి)ని పునరుద్ధరించి, కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి రైతులకు, గిరిజనులకు పరిచయం చేస్తున్నారు. 2009 నుంచి స్వయంగా 7 ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి సిరిధాన్యాలతోపాటు నూనెగింజలు, పప్పుధాన్య పంటలను కలిపి పండిస్తూ ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మధుమేహం, కేన్సర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులతోపాటు రైతుల ఆత్మహత్యలను సైతం పారదోలే వజ్రాయుధాలు ‘సిరిధాన్యాలే’నని ఎలుగెత్తి చాటుతున్నారు! వేలాది మంది రైతులు, రోగులకు ఆపద్బాంధవుడిగా మారారు. ఇటీవల విజయవాడ విచ్చేసిన డా. ఖాదర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► శాస్త్రవేత్తగా అమెరికాలో పదేళ్లు పని చేసి, కర్ణాటకలోని మైసూరుకు తిరిగి వచ్చి ‘కాడు కృషి’ అనే అటవీ వ్యవసాయ పద్ధతికి రూపకల్పన చేశారు. అంతరించిపోతున్న ‘సిరి ధాన్యాలను స్వయంగా సాగు చేస్తూ.. ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు కదా.. వీటి గురించి వివరిస్తారా..? భారతదేశంలో మానవులంతా వెయ్యేళ్ల క్రితం నుంచే మన ముందు తరాల వాళ్లు అద్భుతమైన ‘సిరిధాన్యాల’ను రోజువారీ ప్రధాన ఆహారంగా తింటూ వచ్చారు. కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికలు.. ఈ ఐదూ దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన నిజమైన ఆహార ధాన్యాలు. అందుకే వీటికి నేను ‘సిరి ధాన్యాలు’ అని పేరుపెట్టాను. ఇవే పండించుకొని మరీ తింటున్నాను. కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగి రైతులను స్వయంగా కలిసి వారికి వీటి విత్తనాలు ఇచ్చి, పండించమని ప్రోత్సహిస్తున్నాను. కనీసం వెయ్యి చోట్లకు వెళ్లి మీటింగ్‌లు పెట్టి చెప్పాను. ఇప్పుడు కర్ణాటక అంతటా సిరిధాన్యాలు పెంచడం, వాడకం పెరిగాయి. మానవులు ఆధునికత పేరిట ఇవ్వాళ కంపెనీల మాటలు విని తినకూడనివి తింటున్నారు. ఇవ్వాళ మధుమేహం, కేన్సర్, ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పండించకూడని పంటలు రసాయనిక పద్ధతుల్లో పండిస్తున్నారు. హరితవిప్లవం వల్ల 48 శాతం పంట భూములు పూర్తిగా నిర్జీవమై నిస్సారమై మరుభూములుగా మారిపోతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ నిశితంగా అధ్యయనం చేసి.. తినే తిండికి కొత్త జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని గ్రహించాను. ఈ గ్రహింపు వచ్చినదే తడవుగా ‘నేను చేయాల్సింది ఉద్యోగం కాదు స్వదేశంలో రైతులు, ప్రజలతో కలిసి పనిచేయాలి’ అనిపించింది. అంతే.. ఉద్యోగం వదిలేసి వచ్చి 20 ఏళ్లుగా మైసూరు ప్రాంతంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్న సిరిధాన్యాల విత్తనాలను సేకరించి రైతులకిచ్చి సాగుచేయించాను. 2009లో 7.5 ఎకరాల బంజరు కొని నేను కూడా ‘అటవీ కృషి’ చేస్తున్నాను. ► సిరిధాన్యాల ప్రాధాన్యం ఏమిటి? సిరిధాన్యాలు మన దేశంలో మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వీటిని చిన్నచూపు చూడడం ప్రారంభమైంది. చిరుధాన్యాలని, తృణధాన్యాలని అంటూ వీటిని తినాల్సిన అవసరం లేదన్న భావన కల్పించడం వల్ల ఈ పంటలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 128 ఏళ్ల నుంచి మాత్రమే మనం వరి బియ్యం తింటున్నాం. నీటి వసతి బాగా ఉన్న దగ్గరే వరి, గోధుమ పండేవి. మొదట్లో అడపాదడపా పండుగలకో పబ్బాలకో తినే వాళ్లం. వరి, గోధుమలు, చెరకు వంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలను రసాయనాలతో పండిస్తున్నాం. కిలో వరి బియ్యం పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరం. అడవుల నరికివేత కారణంగా నదులు, రిజర్వాయర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్లీ దుర్గతి? కానీ, కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు చాలు. నాలుగు వర్షాలు పడితే చాలు 3 నెలల్లో పంట పండుతుంది. అండు కొర్రలు 75 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ► మీ ‘అటవీ వ్యవసాయం’ ప్రత్యేకత ఏమిటి? కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అడవిని నాశనం చేసి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం పేరుతో, ఆధునిక పద్ధతుల పేరుతో వాణిజ్య పంటలను కంపెనీల మాటలు విని రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కుమ్మరించి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన ఆశ చూపించి బీటీ పత్తి, చెరకు, వరి, గోధుమ వంటి అధిక నీరు అవసరమయ్యే ఏక పంటలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు. భూమి తల్లిని సర్వనాశనం చేస్తున్నాం, మనల్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 38 శాతం సాగు భూములు మరుభూములుగా మారాయి. భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అటవీ కృషి అని అంటున్నాను. నిజమైన ఆహార పంటలు పండించుకుంటూనే భూమి తల్లిని, జంతుజాలాన్ని కాపాడుకోవడానికి అటవీ కృషిని ప్రారంభించాం. గుప్పెడు అడవి మట్టితో తయారు చేసి వాడుకునే ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువు.. ప్రతి రైతూ తన సాగు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో పొలం పక్కనే అడవిని పెంచడం.. ఆకులు, అలములు పొలంలో వేసుకోవటం ముఖ్యమైన విషయాలు. ఒకే పంటను పండిస్తే చీడపీడల సమస్యలు తలెత్తుతాయి. కొర్రలు తదితర 5 రకాల సిరిధాన్యాలు (ఏకదళ పంటలు), పప్పుధాన్యాలు (ద్విదళ పంటలు), నూనె గింజ పంటలను మిశ్రమ సేద్యం చేయాలి. మా పొలంలో 12 పంటలు కలిపి పండిస్తున్నాం. చీడపీడల సమస్యే రాలేదు. ► ప్రతి రైతూ పొలం పక్కనే 20 శాతం విస్తీర్ణంలో తానే అడవిని పెంచుకోవాలని మీరు చెబుతున్నారు. కేవలం ఎకరం, రెండకరాలున్న రైతులకు ఇదెలా సాధ్యం? 7.5 ఎకరాల బీడు భూమిని 2009లో కొనుగోలు చేసి, 3 ఎకరాల్లో అడవిని, 4.5 ఎకరాల్లో పంటలను పెంచుతున్నాను. 3 ఎకరాల అడవి 10 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. అడవిలో చెట్లకు రాలే ఆకులు, రెమ్మలను ఏరి ఎండాకాలంలో తెచ్చి పొలంలో వేసుకోవాలి. అడవిలో చెట్ల ఆధారంగా కొన్ని పక్షులు, చిన్నా చితకా జంతువులు కూడా పెరుగుతాయి. ఆకులు అలములను వీటి మలమూత్రాల్లోని సూక్ష్మజీవులు సహజ ఎరువుగా మార్చుతాయి. అందుకే దీన్ని ‘అటవీ ప్రసాదం’ అంటున్నాం. దీన్ని తెచ్చి వేసవిలో పొలంలో వేసుకోవాలి. సిరిధాన్య పంటలు పొలంలో వేస్తే కంకులు కోతకొచ్చే సమయంలో 15 రోజులపాటు పక్షుల గుంపులు మన పొలంలోకి పిలవని అతిథులుగా వచ్చేస్తాయి. కొంతమేరకు పంటను అవి తినేస్తాయి. అయినా, పర్వాలేదు. ఎందుకంటే.. అవి తినే గింజల ఖరీదు కన్నా అవి మన పొలంలో వేసే రెట్టలు ఎంతో విలువైన పోషకాలతో భూమిని సారవంతం చేస్తాయి. ఎక్కడో ఒక రైతు సిరిధాన్యాలు పండిస్తే పక్షుల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కొందరు రైతులు సిరిధాన్యాలు వేస్తే రైతుకు నష్టం తెలియనంత తక్కువగా ఉంటుంది. పొలంలో అక్కడక్కడా చిన్న, చిన్న నీటి కుంటలు తవ్వుకుంటే.. అందులోకి చేరే నీటిలోకి ఈ పక్షుల రెట్టల్లోంచి వచ్చి చేరే సూక్ష్మజీవరాశి ఆ నీటిని పోషక జలంగా మార్చేస్తాయి. పక్షులు పురుగులను ఏరుకొని తినేస్తాయి. అడవి పక్కన ఉండే పొలంలో చీడపీడల బెడదే ఉండదు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ భూమిలో కనీసం 20 శాతం విస్తీర్ణంలోనైనా అడవిని కూడా పెంచుకోవాలి. అప్పుడు అడవిని ప్రత్యేకంగా ఎక్కడో పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో పరస్పరాధారిత జీవనచక్రాన్ని మనమే తెంపేశాం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా దీన్ని తిరిగి మనమే నిర్మించుకోవాలి. ‘అటవీ కృషి’ పద్ధతి మూలసూత్రం ఇదే. కర్ణాటకలో వందల వేల రైతులు ఈ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ► సిరిధాన్యాల సాగు రైతుల ఆత్మహత్యలు ఆపగలదా? సిరిధాన్యాల సాగు చాలా సులువు. తెలుగు రైతులు సిరిధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టినా తగినంత మార్కెట్ ఉంది. కేవలం ఆహారం వల్లనే హైదరాబాద్‌లో నూటికి 38 మందికి మధుమేహం వచ్చింది. వచ్చే ఐదేళ్లలో ఇది 60 శాతానికి చేరుతుంది. వీరికి సిరిధాన్యాల గురించి తెలిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ ఇక్కడే ఏర్పడుతుంది. పేద రైతులు పండించే సిరిధాన్యాలను మంచి ధరకు పట్నవాసులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? ప్రభుత్వాలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద ఆధారపడితే రైతులు స్వావలంబన దిశగా ముందుకు వెళ్లలేరు. కొన్నాళ్లకు ప్రభుత్వ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ∙ (డాక్టర్ ఖాదర్‌ను 094485 61472, , musk123rt@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఆయన సాధారణంగా రైతుల సమావేశాల్లో, హోమియో వైద్యంలో బిజీగా ఉంటారు..) సిరిధాన్యాలకు ఆ ఔషధ గుణాలెలా వచ్చాయి? జొన్నలు, సజ్జలు, రాగులు ఈ పరిధిలోకి రావా? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిష్టపదార్థం (కార్బోహైడ్రేట్లు) –పీచుపదార్థం మధ్య నిష్పత్తి ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడదు. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిష్టపదార్థం 79 శాతం. పీచుపదార్థం – పిష్టపదార్థం నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిష్టపదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6–8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున మార్చి మార్చి తింటే చాలు. 2 గంటలు నానబెట్టడం వల్ల సిరిధాన్యాల బియ్యంతో అన్నం బాగా ఒదుగుతుంది. కిలో వండితే పది మందికి సరిపోతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు తటస్థ ధాన్యాలు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన ఆహారం. ‘అటవీ చైతన్యం’ ద్రావణం తయారీ ఎలా? ‘అటవీ చైతన్యం’ తయారీకి కావలసిన పదార్థాలు: 1. అభయారణ్యంలో నుంచి తెచ్చిన గుప్పెడు మట్టి 2. ఐదు రకాల సిరిధాన్యాల పిండి పావు కిలో 3. పప్పుధాన్యాల పిండి పావు కిలో 4. తాటి బెల్లం 50 గ్రాములు 5. 30 లీటర్ల నీరు మట్టి కుండను కుతిక వరకు నేలలో పాతిపెట్టి.. అందులో 30 లీటర్ల నీటిని పోసి మట్టి, పిండి, తాటిబెల్లం కలిపి.. కుండపై మూత పెట్టాలి. కుండపై నేరుగా ఎండ పడకుండా నీడను కల్పించాలి. రోజూ కలియదిప్పాల్సిన పని లేదు. 5 రోజులకు అటవీ చైతన్యం వాడకానికి సిద్ధమవుతుంది. 6వ రోజు నుంచి 21వ రోజు వరకు దీన్ని వాడుకోవచ్చు. అప్పటి వరకు సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉంటుంది. అటవీ చైతన్యం తయారీ కోసం ప్రతిసారీ అభయారణ్యంలోకి వెళ్లి మట్టి తేనవసరం లేదు. అటవీ చైతన్యం ద్రావణాన్ని ఒక లీటరు తీసి పక్కన పెట్టుకొని.. 21 రోజుల లోగా.. మళ్లీ తయారు చేసుకోవాలి. మట్టికి బదులు ఈ ద్రావణాన్ని కుండలో వేసుకోవాలి. అంటే సిరిధాన్యాల పిండి, పప్పుల పిండి, తాటి బెల్లం మళ్లీ కలుపుకొని.. ఈ లీటరు అటవీ చైతన్యం ద్రావణాన్ని కలుపుకుంటే చాలు. 5 రోజుల తర్వాత అది వాడకానికి సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం తిరిగి కలుపుకుంటూ ఉండవచ్చు. మైసూరు దగ్గరలోని మా క్షేత్రాన్ని సందర్శించే వారికి ఒక లీటరును ఉచితంగా ఇస్తున్నాం. పిచికారీ పద్ధతి: ద్రవ రూప ఎరువు ‘అటవీ చైతన్యం’ ఒక లీటరు తీసుకొని 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని ఎకరం పొలంలో మట్టిపైన, సూర్యాస్తమయం సమయంలో, పిచికారీ చేయాలి. కొత్త స్ప్రేయర్‌తో పిచికారీ చేయవచ్చు లేదా చేతితోనైనా చల్లవచ్చు. వారానికి రెండు సార్లు చల్లాలి. ఇలా 6 వారాలు చేస్తే.. భూమి సారవంతమై పంటల సాగుకు అనువుగా మారుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బాగా పాడైపోయిన భూమిని కూడా ఇలా తిరిగి పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు, కలుపుమందులు చల్లకుండా.. వరుసగా రెండేళ్లు అటవీ చైతన్యాన్ని ఇలా పిచికారీ చేస్తే ఇక ఆ భూమిలో చల్లకపోయినా పర్వాలేదు. భూమిని సారవంతం చేయడానికే కాదు.. పంటలపైన పిచికారీ చేసినా సరిపోతుంది. వందల ఎకరాలు సాగు చేసే రైతులు అందుకు అవసరమైనన్ని కుండల్లో అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తొలి దశలో నాగలితో భూమిని దున్నాలి. భూమి గుల్లబారిన తర్వాత నేలను కుళ్లగించే చేతి పరికరాలతో నేలను తవ్వితే సరిపోతుంది. అటవీ చైతన్యాన్ని క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే 3 నుంచి 6 నెలల్లోగా ఎటువంటి బీడు భూమినైనా పంటల సాగుకు అనువుగా మార్చుకోవచ్చు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందుల చక్రపాణి, ఫొటో జర్నలిస్టు, విజయవాడ