మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

Couple Searching For Cat in Renigunta Railway Station - Sakshi

రక్తసంబంధీకులు దూరమైతేనే వారం... పది రోజుల పాటు బాధపడి యధావిధిగా రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమాజంలో ఓ జంట, తాము కొద్దికాలంగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోయేసరికి దానికోసం పడుతున్న తపన చూపరులను తమవైపునకు తిప్పుకుంటోంది. ఏడాది పాటు తమ కుటుంబంలో ఓ సభ్యునిగా భావించి పెంచుకున్న పిల్లి కోసం ఊరుగాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నెల రోజులకుౖ పెగా  కళ్లలో ఒత్తులేసుకుని వెతుకుతున్నారు.

నేపథ్యమిదీ... గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ నగరానికి చెందిన జయేష్, మీన దంపతులు నగరంలో హోల్‌సేల్‌ దుస్తులవ్యాపారం, మొబైల్‌షాపులతో హాయిగానే జీవిస్తున్నారు. అయితే వివాహమై పదేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదన్న వెలితి  వారిని బాధించేది. ఏడాది కిందట ఓ పిల్లి పిల్ల  వారింటికి చేరుకుంది. జయేష్, మీన దంపతులు ఆ పిల్లిని తమకు దేవుడు పంపిన బిడ్డగా భావించి కంటికిరెప్పలా పెంచుకున్నారు. చూస్తుండగానే వారికి ఆ పిల్లితో తెలియని బంధం ఏర్పడింది. అది పిల్లి కాదు.. పిల్లోడే అనుకునేంతగా వారి బంధం దృఢ పడింది.

వెంకన్న దర్శనం కోసం వచ్చి...
తిరుమల వెంకన్న దర్శనార్థం జయేష్, మీన దంపతులు ఇటీవల సూరత్‌ నుంచి  పిల్లిని ప్రత్యేకంగా ఓ బుట్టలో పెట్టుకుని వెంట తెచ్చుకున్నారు. తిరుమలకు గత నెల 9న చేరుకున్నారు.  నాలుగు రోజులపాటు శ్రీ వారి సన్నిధిలో గడిపిన తర్వాత తిరుగు పయనమై గతనెల 12న రాత్రి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి ముంబైకు వెళ్లి మరో రైలెక్కి స్వస్థలం చేరాలన్న ఆలోచనతో స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్నారు. పిల్లితో ఆడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూడటంతో ఒడిలో నిద్రిస్తున్న పిల్లి కనిపించలేదు. దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిల్లితో చివరిసారిగా తిరుమల కొండపై దిగిన ఫోటోఫ్రేమ్‌ను చూపుతూ స్టేషన్‌ ప్రాంగణమంతా వెతికారు. పిల్లి ఆచూకీ లభించకపోవడంతో పిల్లి ఆచూకీ దొరికే వరకు ఈ ప్రాంతాన్ని వదిలి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. రేణిగుంట, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కోడూరు, గూడూరు, నెల్లూరు, కస్మూరు దర్గా.. ఇలా అన్ని చోట్లకు వెళ్లి వెతుకుతూనే ఉన్నారు. నెలరోజులు దాటినా పిల్లి ఆచూకీ తెలియలేదు.. ప్రాణసమానమైన పిల్లి జాడను దేవుడే చూపుతాడన్న విశ్వాసంతో పిల్లిని దొరకబుచ్చుకోవడమే లక్ష్యంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ పిల్లి కోసం ఆరా తీస్తున్నారు. వీరి అన్వేషణ ఫలించాలని కోరుకుందాం.

పిల్లి రూపురేఖలివీ...
‘ఫెలిసియో’ సంతతికి చెందిన ఈ అరుదైన పిల్లి సుమారు 3.5 నుంచి 4 కిలోల బరువుంటుంది. 14 నెలల వయస్సు కలిగిన ఈ పిల్లి 10 అంగుళాలు ఎత్తు ఉండి, తెలుపు, ఊదా రంగులతో నిలువు చారలు కలిగి ఉంటుంది.–  చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంటఫొటోలు: షేక్‌ మహ్మద్‌ రఫి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top