బ్యాక్టీరియాకు పోటీ పెట్టారు!

Contest for bacteria - Sakshi

పరిపరిశోధన

‘విభజించి పాలించు’ అన్న రాజకీయ సూత్రం మీరు వినే ఉంటారు. మందులకు లొంగని బ్యాక్టీరియాకు చెక్‌ పెట్టేందుకు ఈ సూత్రం కరెక్టుగా సరిపోతుందని అంటున్నారు మిషిగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. యాంటీబయాటిక్‌లు వాడేందుకు ముందే.. మందులకు లొంగని బ్యాక్టీరియా సంతతిని కనిష్టానికి తీసుకు రావడం.. ఇందుకోసం అవి బతికేందుకు కీలకమైన పోషకాలను తగ్గించడం ఈ కొత్త పద్ధతిలో కీలక అంశాలు. నీళ్లు లేకపోతే మనం కొన్ని రోజులకే మరణిస్తామన్న సంగతి మీకు తెలుసు కదా.. ఇదే పరిస్థితి బ్యాక్టీరియాకు వచ్చిందనుకుందాం. అప్పుడేమవుతుంది. ముందుగా అందుబాటులో ఉన్న నీటి కోసం పోటీ పెరుగుతుంది. శక్తి ఉన్నవి నీటిని వాడుకుంటాయి. బలహీనమైనవి మరణిస్తాయి. కీలకమైన విషయం ఏమిటంటే.. మందులకు లొంగని బ్యాక్టీరియా.. సహజంగానే బలహీనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిషిగన్‌ శాస్త్రవేత్తలు మలేరియాకు గురైన ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశారు.

వ్యాధికారక బ్యాక్టీరియా ఆధారపడే కీలకమైన పోషకాన్ని గుర్తించారు. మందులకు లొంగని బ్యాక్టీరియాతో కూడిన ఎలుకలకు ఈ పోషకాన్ని తక్కువగా.. మిగిలిన వాటికి ఎక్కువ మోతాదులో అందించారు. కొంత కాలం తరువాత రెండు గుంపుల ఎలుకలకూ మలేరియా మందులు ఇచ్చారు. మొదటి గుంపులోని ఎలుకల్లో వ్యాధి నయమైంది. రెండో గుంపులో మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి కావడంతో చికిత్స విజయం సాధించలేదు. ఆ తరువాత రెండు రకాల బ్యాక్టీరియా ఉన్న ఎలుకలపై ఇదే ప్రయోగాన్ని మళ్లీ చేసి చూశారు. ఫలితాలు ఒకేలా ఉండటంతో మందులకు లొంగని బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు ఓ కొత్త పద్ధతి ఉన్నట్లు స్పష్టమైంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top