చైనా ఉప్పు... తప్పదు ముప్పు!

China Salt  - Sakshi

మనకు తెలిసిన రుచులు ఆరు. కానీ కొన్నేళ్ల కిందట షడ్రుచుల జాబితాకు మరోటి చేరింది. దాన్ని ఏడో రుచి అందామా? కానీ మన సంప్రదాయంలో ఏడు... ఏడుపుకు చిహ్నం. అందుకే పెద్దలు ఏడును ఆరునొక్కటి అనడం మొదలుపెట్టారు. ఇది ఏడో రుచి కావడంతోనో ఏమోగానీ మన సంప్రదాయపు అశుభాన్ని అంది పుచ్చుకుంది  ఆ రుచి.  అవును... ఈ రుచి ఎక్కువైందంటే కొందరు కొన్నిసార్లు  ఆరోగ్యపరంగా ఆరునొక్కరాగం ఆలపించక తప్పదు. అంటే ఏడుపు తప్పదన్నమాట. ఆ ఏడోదే... ‘ఉమామీ’ అనే రుచి. ఆ రుచిని ఇచ్చేదే ‘చైనా సాల్ట్‌’ అని పిలిచే చైనా ఉప్పు.

వారేవా అనేలోపే – వామ్మో...!
చైనీస్‌ వంటకాలు ఎంతో రుచిగా అనిపిస్తుంటాయి. రసాయనికంగా ‘మోనో సోడియమ్‌ గ్లుటామేట్‌’ అని పిలిచే  చైనా ఉప్పే అందుకు కారణం. దీన్ని కాస్త ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవే... తలనొప్పి, ముఖం ఎర్రబారడం (ఫ్లషింగ్‌), చెమటలు పట్టడం, గుండెదడ, ఛాతీలో నొప్పి, వికారం లాంటి లక్షణాలు. వాటన్నింటినీ కలిపి ‘ఎమ్‌ఎస్‌జీ సింప్టమ్‌ కాంప్లెక్స్‌’గా పేర్కొంటారు. పై లక్షణాలు కనిపించే ఆ కండిషన్‌ను ‘చైనీస్‌ రెస్టారెంట్‌ సిండ్రోమ్‌’ అంటారు.

మరి చాపల్యాన్ని చంపేయాల్సిందేనా?
చైనా ఉప్పు సరిపడని వారు ఉమామీ రుచిని కోల్పోవాల్సిందేనా? అవసరం లేదు. సోయాసాస్‌కు సాధారణ ఉప్పు కలిపితే ఉమామీ రుచే వస్తుంది. అయితే చైనా ఉప్పు సరిపడేవారు కూడా దీన్ని ఎక్కువ వాడకూడదు. చాలా పరిమితంగానే వాడాలి. చివరగా ఒక్కమాట... ఉప్పుతో తిప్పలు తప్పవన్నది తెలిసిందే. అందుకే చైనాదైనా– ఇండియాదైనా ఉప్పు ఉప్పే. దానితో ముప్పు ముప్పే అని గ్రహించి, వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top