మ్యాజిక్‌ మీ చేతుల్లోనే...

Child psychologist Jaya Seshu Biography - Sakshi

మహిళకు తండ్రి... భర్త మర్రి చెట్టులాంటి వారు. ఆ నీడ చల్లగా ఉంటుంది. కానీ... కాంతిని మింగేస్తుంది. ప్రతి వనిత... స్వయం ప్రకాశిత. ఆ మ్యాజిక్‌ అర్థం చేసుకుంటే తనూ ఓ మహావృక్షమే. పిల్లల పెంపకం దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు... ఇలాంటి ఎన్నో విషయాలను సాక్షితో పంచుకున్నారు... ప్రముఖ చైల్డ్‌ సైకాలజిస్ట్‌ జయశేషు పట్టాభిరామ్‌.

బీవీ పట్టాభిరామ్‌ మీ పెళ్లి నాటికే మెజీషియన్‌ కదా! మిమ్మల్ని మ్యాజిక్‌తో ఇంప్రెస్‌ చేసేవారా?
అవును, చాలా. మోచేతి దగ్గర కాయిన్‌ పెట్టి రుద్దేవారు. కాయిన్‌ మాయమయ్యేది. ఏమైందో చెప్పమనే వారు. కొంతసేపటికి తీసి చూపించేవారు. ఎలా మాయం చేశారో, మళ్లీ ఎలా తీశారో ఎంత ఆలోచించినా తెలిసేది కాదు. రెండేళ్ల పాటు అదే కాయిన్‌ మ్యాజిక్‌తో ఆటపట్టించారు.

మిమ్మల్ని ఎప్పుడైనా హిప్నటైజ్‌ చేశారా?
ఆ గొంతులోనే ఏదో మాయ ఉంది. మామూలుగా చెప్పినా సరే హిప్నటైజ్‌ అయిపోతాం. ఇక పని గట్టుకుని హిప్నటైజ్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎప్పుడో పెళ్లయిన కొత్తలోనే... అది హిప్నటిజం అని మీకు తెలియక ముందే మిమ్మల్ని హిప్నటైజ్‌ చేసినట్లున్నారు. మీరింకా బయటపడలేదా ఆ మాయ నుంచి?
(నవ్వేసి...) ఏమో? ఏం మాయ చేశారో! ఎలా మాయ చేశారో తెలియడం లేదు.

తెలివైన భర్తతో సంసారం కష్టమా, సౌకర్యమా?
ఆయన తెలివితేటల ప్రదర్శన అంతా బయటే. ఇంట్లో చాలా మామూలుగా ఎదుటి వారిని అర్థం చేసుకునే మనిషిగా ఉంటారు. అందుకే నాకెటువంటి కష్టం రాలేదు. నేను ఆయనకు భార్యను మాత్రమే కాదు, స్టూడెంట్‌ని, ఆయన రచనలకు తొలి రీడర్‌ని. క్రిటిక్‌ని కూడా.

సైకాలజిస్ట్‌గా మీ కెరీర్‌ ఎప్పుడు మొదలైంది? పెళ్లికి ముందేనా?
లేదు, మాది కాకినాడ. మా నాన్న ఇంజనీర్‌. అమ్మ మా చిన్నప్పుడే పోవడం వల్ల టెన్త్‌తో చదువాపేయాల్సి వచ్చింది. నాలో ఆ కొరత అలాగే ఉండిపోయింది చాలా కాలంపాటు. మా అబ్బాయి స్కూలుకెళ్లసాగిన తర్వాత మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఓపెన్‌ యూనివర్శిటీలో బి.ఎ, బిఈడీ, డబుల్‌ ఎం.ఎ (తెలుగు లిటరేచర్, సైకాలజీ) చేశాను. ఆ తర్వాత సైకాలజిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టాను. పెళ్లికి ముందు చదువుకుని ఉంటే ఇప్పుడిలా నిరంతర విద్యార్థిగా మారేదాన్ని కాదేమో. ఇప్పటికీ సైకాలజీలో కొత్తగా ఏ కోర్సు వచ్చినా చదువుతున్నాను.

ఆల్రెడీ ఇంట్లో ఒక సైకాలజిస్ట్‌ ఉండగా మళ్లీ మీరు అదే కోర్సు ఎందుకు చేశారు?
నేను ఇంట్లో ఖాళీగా ఉండటం అనేదే ఉండదు. బాలవికాస్‌ ట్రైనింగ్‌ వంటి ఏదో ఒక పనిలోనే ఉంటాను. మధ్యలో ఎప్పుడు కొంచెం ఖాళీగా కనిపించినా సరే... సైకాలజీ మీద పబ్లిష్‌ అయిన ఆర్టికల్స్‌ ఇచ్చి,  పాయింట్స్‌ రాసిపెట్టమని అడిగేవారు. అలా చైల్డ్‌ సైకాలజీ మీద ఆసక్తి కలిగింది. అప్పట్లో మా వారి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఇంట్లోనే. ఆయన కౌన్సెలింగ్‌ ఇవ్వడం చూసి ఈ ప్రొఫెషన్‌ బాగుందనుకున్నాను. పైగా ఇందులో నాకు బాస్‌ నేనే!

ఇరవై ఏళ్ల అనుభవంలో పిల్లల్లో మీరు గమనించిన మార్పు ఉందా?
ఉంది. తరం మారింది. ఇంటి ముఖచిత్రం మారిపోయింది. అలాగే పిల్లలూ మారిపోయారు. ఇరవై ఏళ్ల కిందట పేరెంట్స్‌ నుంచి ‘మా పిల్లలు టీవీకి అతుక్కుపోతున్నారు. చదువు మీదకు మళ్లించడం మా వల్ల కావడం లేదు’ అంటూ వచ్చేవాళ్లు. అప్పట్లో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ ప్రభావం పెద్దగా లేదు పిల్లల మీద.

ఇప్పటి పేరెంట్స్‌ పిల్లలు ‘స్మార్ట్‌ఫోన్‌ వదలట్లేదు’ అంటున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లతో ఫేస్‌బుక్, వాట్సప్‌ చాటింగ్‌తోనే గడుపుతున్నారు, ఎలా మానిపించాలో తెలియట్లేదని వస్తున్నారు. పిల్లల్ని సున్నితంగా డీల్‌ చేయగలిగిన మ్యాజిక్‌ పేరెంట్స్‌లో ఉంటుంది. ఎటొచ్చీ వాళ్లు ఆ స్కిల్‌ని బయటకు తీయగలగాలంతే.

అప్పటికీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్న సమస్య ఏదీ లేదా?
అప్పుడూ ఇప్పుడూ కామన్‌ కంప్లయింట్‌ మెమరీ గురించి. ‘మా పిల్లలకు మెమొరీ తక్కువగా ఉంది. కాన్‌సెంట్రేషన్‌ చేయలేకపోతున్నారు, చదివినా గుర్తుండటం లేదు. జ్ఞాపకశక్తి పెరగడానికి మందులుంటాయా’ అని అడుగుతుంటారు. నిజానికి అందరి మెమొరీ ఒకటే. ట్రైన్డ్‌ మెమొరీ, అన్‌ట్రైన్డ్‌ మెమొరీ మాత్రమే ఉంటాయి. మెదడును వాడకపోతే జ్ఞాపకశక్తి మసకబారుతుంది. వాడుతుంటే చురుగ్గా ఉంటుంది.

మా చిన్నప్పుడు అందరికీ ఎక్కాలు కంఠతా వచ్చేవి. కాలిక్యులేటర్‌ వచ్చిన తర్వాత ఎక్కాలు మర్చిపోయాం. ఇంటర్నెట్‌ అరచేతిలోకి వచ్చాక అన్నింటినీ మర్చిపోతున్నాం. మనకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయింది అని అడిగితే... బుర్రను వాడి, వేళ్లతో లెక్క వేయడం లేదు. గూగుల్‌ని అడుగుతున్నాం. బ్రెయిన్‌ని ఎలక్ట్రానిక్‌ టూల్స్‌ వాడే సాధనంగా మార్చేస్తున్నాం. బ్రెయిన్‌ను వాడాలి, ప్రాక్టీస్‌లో ఉంటేనే చురుగ్గా ఉంటుంది.

పిల్లలను నొప్పించకుండా చానలైజ్‌ చేయడం సాధ్యం కాదంటారా!
నొప్పించకుండా నేర్పిస్తేనే సాధ్యమవుతుంది. ‘ఇది చేయవద్దు’ అని ఎప్పుడూ చెప్పకూడదు. ఏది చేయాలో అంత వరకే చెప్పి వాళ్లు ఎలా చేస్తారో అలా చేయనివ్వాలి. క్లాస్‌లో నేనిచ్చే యాక్టివిటీలు కూడా అలాగే ఉంటాయి. అద్దంలో చూస్తూ స్టార్‌ గీయడం, టూత్‌పిక్స్‌ని బోర్డు మీద అమర్చడం వంటివి చేస్తున్నంత సేపు పిల్లలకు మరో లోకం ఉండదు. అంతగా నిమగ్నమవుతారు.

అది అలవాటుగా మారితే ప్రతి పనినీ అంతే ఏకాగ్రతతో చేస్తారు. తల్లి పిల్లలతో టైమ్‌ గడపకుండా తానో ఫోన్‌లో ఉంటే పిల్లలు మరో ఫోన్‌లో మునిగిపోతారు. అమ్మ ‘నో’ అంటే నాన్నతో కొనిపించుకుంటారు. దీనిని నివారించి తీరాల్సిందే. ఇది మా అబ్బాయి విషయంలో మేము పాటించిన సూత్రం కూడా. పెంకిగా ఉన్న మా పిల్లవాడు ఇప్పుడు అమెరికాలో పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు.

పిల్లలు పాడయిపోతున్నారని తరచూ వింటున్నాం మరి!
తల్లిదండ్రులు పిల్లలతో గడపకపోతే ఏ పిల్లలైనా సరే పాడయిపోతారు. పిల్లలతో గడపడం ఎందుకంటే వాళ్ల దృష్టి ఎప్పుడు ఎటు మరలుతుందో తెలుసుకోవడానికే. ప్రాజెక్ట్‌ వర్క్‌ కోసం ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేస్తారు. గదిలో కూర్చుని పని చేసుకుంటున్నారని పూర్తిగా వదిలేస్తారు పెద్దవాళ్లు. ఇంటర్నెట్‌లో పిల్లలకు అవసరమైన విజ్ఞానంతోపాటు పెడదారి పట్టించే సైట్‌లు బ్లింక్‌ అవుతుంటాయి. వాటిని క్లిక్‌ చేయకుండా ఉండలేరు. నిఘా పెట్టకూడదు, కలివిడిగా ఉంటూనే ఓ కంట గమనించాలి.

చూడకూడని సైట్‌ ఓపెన్‌ అయి ఉన్నట్లు గమనించినా సరే ఆ క్షణంలోనే కోప్పడి నానా గందరగోళం చేయకూడదు. తర్వాత నిదానంగా చెప్పాలి. పిల్లలతో పేరెంట్స్‌ ఆటలాడే అలవాటు ఉంటే చాలా సమస్యలు ఆ ఇంటి ఛాయలకు కూడా రావు. వంటగదిలో పిల్లల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ తరం భార్యాభర్తల్లో చాలా గొడవలకు కారణం వంటే అవుతోంది. ఏ పిల్లలైనా సరే అమ్మానాన్నలు శ్రద్ధ పెడితే చక్కగా పెరుగుతారు. మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతారు. ఒక ఆడమగ పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం ప్రకృతి ధర్మం. వాళ్లను సరిగ్గా పెంచడం సామాజిక ధర్మం. లోపాలు లేని మనిషి అంటూ ఉండరు. అయితే లోపాలను అధిగమించాలనే సంకల్పం ఉండాలి.

తప్పులు పెద్దవాళ్లవే!
కౌన్సెలింగ్‌తో జీవితాలు బాగుపడటం చూశాక ఈ ప్రొఫెషన్‌ మీద గౌరవం కలిగింది. పిల్లలతో గడిపే అవకాశం ఉండటంతో ఈ కెరీర్‌ చాలా సంతోషాన్నిస్తోంది. పరివర్తన తేవడానికి నేనిచ్చే టైమ్‌ షెడ్యూల్స్‌ని పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. నిజానికి ఎప్పుడూ తప్పు పిల్లల్లో ఉండదు. వాళ్లను ఎలా డీల్‌ చేయాలో తెలియని పెద్దవాళ్లదే సమస్య. చైల్డ్‌ సైకాలజిస్ట్‌గా నేను కౌన్సెలింగ్‌ ఇచ్చేది కూడా పేరెంట్స్‌కే.

మీ వారిలో మీరు చూసిన పర్సనాలిటీ డిఫెక్ట్స్‌?
నేను ఆయనను కరెక్ట్‌ చేయాల్సిన సందర్భాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవేమీ లేవు. కానీ టైమ్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు ‘టెన్షన్‌ వద్దు, యు కెన్‌ మేనేజ్‌ సచ్‌ థింగ్స్‌ ప్రాపర్లీ’ అని చెప్తుంటాను.

మీ వారిలో మీకు నచ్చని విషయాలు...
కాఫీ ఇచ్చిన తర్వాత చల్లారే వరకు తాగరు. అరగంట తర్వాత నేను మళ్లీ ఆ గదిలోకి వస్తే... ఆయన మాత్రం నేను కాఫీ తెచ్చినప్పుడు ఏ పుస్తకంలో మునిగిపోయి ఉన్నారో, అదే భంగిమలో ఉంటారు. ‘కాఫీ చల్లారిపోయింది’ అంటే ‘ఊ’ అంటారు. కాఫీ ఇచ్చినప్పుడు ఒక ‘ఊ’, చల్లారిపోయినప్పుడు ఒక ‘ఊ’ అంతే. మరొకటి ఏమిటంటే... ఆయన ఎప్పుడూ ఒకేలా డ్రస్‌ వేసుకోవడం. ‘అవే సూట్, సఫారీల్లో చూసి చూసి విసుగొస్తోంది, మార్చండి’ అనేదాన్ని. చివరికి మా అబ్బాయి పెళ్లికి మాత్రం పట్టుపట్టి కుర్తా, పైజామా వేయించగలిగాను.


                                            (భర్త బీవీ పట్టాభిరామ్‌తో...)

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top