కోకిల లోకంలో అతిథి కవిత్వం

A Book Written By Alluri Gouri Laxmi - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

నీటిరంగుల చిత్రం కవితల గుచ్చంలో కవి వాడ్రేవు చినవీరభద్రుడు జీవితానందం, సత్యం, సౌందర్యం మొదలైన వాటికోసం చేస్తున్న అన్వేషణ కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన సొగసు, ఒక అపురూప అనుభవం తాలూకు సౌకుమార్యం ప్రతి పదంలో పొంగిపొరలుతూ ఉంటాయి. ప్రతి కవితా కొన్ని అద్భుత చిత్రాల గది. ఒక్కో గదిలో ఎంతసేపైనా ఉండిపోవచ్చు. ఈ కవి, కవితను రాయడం కాదు దర్శించాలంటారు. వాక్కును గోవులా సేవించాలంటారు. జీవితానుభవాన్ని క్షీరంగా మార్చుకుంటూ ఆవు వెనకే నడుస్తూ ఆ క్షణాలను గుక్కగా నొల్లుకుని ఇంటికొచ్చి నెమరువేసుకోవాలట. అనుభవాలు బాధించేవైనా, బోధించేవైనా రక్తాస్థిగతమయిన తర్వాత ఎవరెక్కడ గిల్లినా ఒళ్ళంతా పాలు కారతాయట.

కవి ఋషి అయిపోయాక, అంతే కదా మరి! కవి దారి పక్కన నిలబడి యాత్రికుడికి దోసిళ్లకొద్దీ కవితలు అందిస్తాడట. ఏ ఒక్క పండు  కొరికినా మొత్తం అడవినే రుచి చూసినట్టు ఉండాలట. కవి, మొత్తం తన కవిత్వాన్ని పండ్లుగా మలిచిన తీరు మనల్ని చకితుల్ని చేస్తుంది. నిండుగా పూచిన చెట్టు ఎదుట ఈ ప్రపంచాన్ని క్షణం విస్మరించాను అని కవి అంటుంటే ఈ పుస్తకం చదువుతుంటే మనకి అలానే అనిపిస్తుంది. మనల్ని మనం మరిచిపోయి ఒక ఆనందసంద్రంలో ఈదుతుంటాం. నాకు పద్యం రాయడం రాదు, కవిత నిర్మించడం ద్వారా వచ్చిందల్లా నా హృదయాన్ని కాగితంపై పరిచెయ్యడమే అంటారు. ఈ కవితల్ని చదువుతుంటే అందమైన పడవెక్కి సరస్సులోకి  షికారుకెళ్ళి ఆనందిస్తున్న భావన! పడవ దిగడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదవడం పూర్తిచేసిన వారికి తెలుస్తుంది. 

కోకిల కూత వినబడుతుంటే పూజ మొదలైనట్టుంటుందట. ఆ కూత అతని హృదయాన్నొక బాజా చేసి ఏదో పండుగ మొదలైన సందడి చేసేస్తుందట. చదువుతుంటే మన మదిలో కూడా ఒక సంతోషకరమైన ఊరేగింపు మొదలౌతుంది. ఇంకా ఆ కోకిల పంటలు  బాగా పండిన రోజుల్లో రాత్రి నామ సప్తాహం చేసినట్టు కరువు తీరా (రైతుల కరువు తీర్చి) కూసిందట. ఇన్నాళ్లూ కోకిల నా లోకానికి అతి«థి అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది కోకిలల ప్రపంచంలో తానే కొన్నాళ్ళు అతిథిని అంటారు. కవి తాదాత్మ్యత అది. బతుకు ఫలప్రదం కావడం అంటే ఎక్కడుంటే అక్కడ ప్రపంచాన్ని సుసంపన్నం చేయడం, తాను నిశ్శేషం కావడం అంటూ మానవుడి అంతిమ లక్ష్యం ఏమిటో తాత్వికంగా ముగించారు భద్రుడు. అందుకే ఈ పుస్తకం ఒక సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది.
- అల్లూరి గౌరీలక్ష్మి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top