కట్టుబాట్లను కాలదన్నింది... ట్రోఫీలను చేతబట్టింది! | bhavani munda created football team | Sakshi
Sakshi News home page

కట్టుబాట్లను కాలదన్నింది... ట్రోఫీలను చేతబట్టింది!

May 18 2014 10:49 PM | Updated on Oct 2 2018 8:39 PM

కట్టుబాట్లను కాలదన్నింది... ట్రోఫీలను చేతబట్టింది! - Sakshi

కట్టుబాట్లను కాలదన్నింది... ట్రోఫీలను చేతబట్టింది!

భవానీ ముండా... పశ్చిమ బెంగాల్‌కి వెళ్లి ఈ అమ్మాయి పేరు చెబితే అక్కడివారి కళ్లలో గర్వం తొణికిసలాడుతుంది. ఆ రాష్ట్రంలోని జల్పాయిగుడి జిల్లాకు వెళ్లి ఆ అమ్మాయి గురించి అడిగితే... స్థానికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

 గెలుపుకి మనిషితో సంబంధం లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే అది ఎవరికైనా సొంతమవుతుంది. అడుగుకి గమ్యం గురించి తెలియాల్సిన పని లేదు. ఆ అడుగు ఎక్కడ పడాలో పాదం మోపే మనిషికి తెలిస్తే సరిపోతుంది. మనిషి తాను పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి, ప్రదేశం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎక్కడ పుట్టినా, ఎక్కడ ఎలా పెరిగినా... చేరుకోవాల్సిన గమ్యం, సాధించాల్సిన లక్ష్యం స్పష్టంగా తెలిస్తే గెలుపు వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇవన్నీ ఎంతటి అక్షర సత్యాలో తెలియాలంటే... భవానీ ముండా గురించి తెలుసుకోవాలి!
 
 భవానీ ముండా... పశ్చిమ బెంగాల్‌కి వెళ్లి ఈ అమ్మాయి పేరు చెబితే అక్కడివారి కళ్లలో గర్వం తొణికిసలాడుతుంది. ఆ రాష్ట్రంలోని జల్పాయిగుడి జిల్లాకు వెళ్లి ఆ అమ్మాయి గురించి అడిగితే... స్థానికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమె తమ గడ్డమీద పుట్టిన అమ్మాయి అన్న గర్వం, తమ జిల్లాకే పేరు తెచ్చిందన్న ఆనందం... రెండూ కలిసి భవానీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను మనలో రేపుతాయి. తెలుసుకునేంత  వరకూ మనల్ని అక్కడ్నుంచి కదలకుండా చేస్తాయి.
 
 ఆట కోసం ఆరాటం...
జల్పాయిగుడి జిల్లా అంత అభివృద్ధి చెందినదేమీ కాదు. టీ తోటల్లో పని చేసుకుని పొట్ట పోసుకునేవాళ్లే అక్కడ ఎక్కువ. వెనకబడిన జీవితాలు. నాగరికత అంతగా తెలియని మనుషులు. ఆడపిల్ల అంటే ఎక్కడ లేని కట్టుబాట్లూ పుట్టుకొచ్చేవి. అమ్మాయిలు సంప్రదాయ బద్ధంగా ఉండాలి. అన్ని పనులూ నేర్చుకోవాలి. దించిన తల ఎత్తకూడదు. పద్ధతిగా నడచుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అక్కడివారి నరనరాల్లో జీర్ణించుకు పోయాయి. దానికి తోడు ఆర్థికంగా వెనుకబడటం ఒకటి. పిల్లల్ని చిన్నప్పుడే తమతో పాటు తోటల్లో పనులకు తీసుకెళ్లిపోయేవారు. కాస్త తమ పని తాము చేసుకోగలిగే వయసు వచ్చాక పెళ్లి చేసేసేవారు.

అలాంటి చోట పుట్టింది భవానీ ముండా. అయితే అక్కడి పరిస్థితులు గానీ, కట్టుబాట్లు గానీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. ఏడేళ్ల వయసులో టీవీలో ఉమెన్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసినప్పుడు ఆమెను రెండు విషయాలు ఆకర్షించాయి. ఒకటి ఫుట్‌బాల్... రెండోది, ఆడపిల్లలు అంతమంది ముందు పోటాపోటీగా గేమ్ ఆడటం. ఆ రోజు నుంచి ఫుట్‌బాల్ పిచ్చి పట్టుకుంది భవానీకి. తన  ఇష్టాన్ని ఇంట్లోవాళ్లతో చెప్పింది. ఫుట్‌బాల్ ఆడటం నేర్చుకుంటానని మారాం చేసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదు. కోప్పడ్డారు. ఆడపిల్లకి ఆటలేంటన్నారు. పొట్టి పొట్టి నిక్కర్లు వేసి ఆటలాడితే పరువు పోతుందని తిట్టారు. ఆడుతూ ఏ కాలో విరగ్గొట్టుకుంటే పెళ్లిఅవ్వదని అన్నారు. భవానీ ఆశల్ని ఆదిలోనే తుంచేసి టీ తోటలో పనికి చేర్చారు.
 
అయితే వాళ్లు భవానీని కట్టడి అయితే చేయగలిగారుగానీ... ఆమె మనసు నుంచి ఫుట్‌బాల్ ఆడాలన్న ఆకాంక్షను మాత్రం తుడిచివేయలేకపోయారు. ఓ పక్క పని చేస్తూనే ఫుట్‌బాల్ ఎలా ఆడాలా అని ప్లాన్లు వేసేది భవాని. ఏళ్లు గడిచేకొద్దీ ఆ పిచ్చి మరింత పెరిగిపోయింది. తనతో పాటు పని చేసే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని జత చేసుకుని తోటల మధ్యలో రబ్బరు బంతితో ప్రాక్టీస్ చేస్తూండేది. అలా చేయడం వల్ల ఆమెలో ఆట పట్ల మక్కువ మరీ పెరిగిపోయింది. ఎలాగైనా ఓ టీమ్‌ను తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాని కోసం పెద్ద సాహసమే చేసింది.
 
 ఊరి మనసు కరిగించింది...
 ఫుట్‌బాల్ టీమ్‌ని తయారు చేయడం మాటలు కాదని తెలుసు భవానీకి. అయినా చేసి తీరాలనుకుంది. అందరి ఇళ్లకూ వెళ్లి, ‘మీ అమ్మాయిని ఫుట్‌బాల్ ఆడటానికి పంపిస్తారా’ అని అడగడం మొదలుపెట్టింది. కొందరు కుదరదు అన్నారు. కొందరు విసుక్కున్నారు. అయినా కూడా విడిచిపెట్టలేదు. వెంటపడి విసిగించింది. కొందరిని ఒప్పించింది. ఎలాగైతేనేం... పదకొండు మందితో ఓ టీమ్ తయారు చేసుకుంది. సాధన మొదలుపెట్టింది.

 అయితే కొందరు ఊరి పెద్దలకు భవానీ చేస్తోంది నచ్చలేదు. ఆడపిల్లలు అలాంటి ఆటలు ఆడటం సరికాదని, ఏ కాలో చెయ్యో విరిగితే పెళ్లిళ్లు ఎలా అవుతాయని భవానీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. దాంతో భవానీని ఇంట్లో బంధించారు వారు. ఏం చేసయినా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్న భవానీని నాలుగ్గోడలు, రెండు తలుపులు ఏం ఆపగలవు! తప్పించుకుని పారిపోయింది. తన టీమ్ సభ్యుల దగ్గరకు వెళ్లి వాళ్లతోనే ఉండసాగింది. తన టీమ్ వెలుగులోకి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. మొదట జిల్లా తరఫున, తరువాత రాష్ట్రం తరఫున ఆడేందుకు అవకాశాలు సంపాదించింది. అవకాశాలతో పాటు ట్రోఫీలూ సాధించింది.
 
ఆడపిల్లకు ఆటలేంటి అన్నవారే ఇప్పుడు భవానీని చూసి గర్వంగా మా అమ్మాయి అని చెప్పుకుంటున్నారు. పొట్టి బట్టలు వేసుకుంటే పెళ్లికాదు అంటూ నిందించినవారే పదికాలాలు పచ్చగా ఉండమని దీవిస్తున్నారు. తమ పిల్లలు కూడా భవానీలా కావాలి అని కోరుకుంటున్నారు. ఇది భవానీ సాధించిన విజయం. పరిస్థితులు అనుకూలించలే దంటూ కలలు చంపుకుని , కట్టుబాట్లకు తలవంచి బతుకుతున్న ఆడపిల్లలందరికీ ఆమె విజయం... ఓ ఆదర్శం!
 - సమీర నేలపూడి
 
 అందరూ భవానీలు కావాలి!
 పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పద్ధెనిమిదేళ్లు రాకముందే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. మహిళల అక్షరాస్యత కూడా చాలా తక్కువ. భవానీ పుట్టిన జల్పాయిగుడి జిల్లాలో అయితే ఇప్పటికీ కొందరు అమ్మాయిలు యుక్త వయసు వచ్చీరాగానే పెళ్లి అనే చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ పరిస్థితులు పూర్తిగా మారాలి అంటుంది భవానీ. తనలాగే అమ్మాయిలంతా ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే తప్ప అది సాధ్యం కాదు అని చెబుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement