ఏడు తరాలు

Best Book Alex Haley Edu Taralu - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

అలెక్స్‌ హేలీ ఇంగ్లిష్‌లో రాసిన నవల ‘రూట్స్‌’. దీన్ని ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి తెలుగులోకి అనువదించారు. ఇందులో కుంటా కింటే అనే ఆఫ్రికా యువకుణ్ని అమెరికావాసులు కిడ్నాప్‌ చేసి బానిసల వేలంపాటలో అమ్మివేస్తారు. అమెరికాలో దుర్భర బానిస జీవితం గడిపే కుంటా రోదన ఒకవైపూ, కొడుకు ఏమయ్యాడో తెలియని తల్లిదండ్రుల వేదన మరోవైపూ మనల్ని కంటతడి పెట్టిస్తాయి. 16,17వ శతాబ్దంలో యూరప్, అమెరికావాళ్లు ముందస్తుగా పారిశ్రామిక విప్లవం సాధించి, ఇతర దేశాల ప్రజలందరినీ ఎలా ఏడిపించారనే దానికి ఈ నవల బలమైన సాక్ష్యం.

కుంటా బానిస జీవితం గడుపుతూ తోటి బానిస స్త్రీ బెల్‌ను వివాహం చేసుకుంటాడు. పుట్టిన కూతురికి వాళ్ల జేజమ్మ పేరు కిజ్జీ అని పెట్టుకుంటాడు. బానిస జీవితాన్ని ఏవగించుకుంటూనే జీవితాన్ని ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ అమెరికా శ్వేత జాతీయులు కుంటా జీవితంలో మరోసారి నిప్పులు పోస్తారు. కిజ్జీ ఎవరినో ప్రేమించి బానిస జీవితం నుంచి తప్పించుకోజూసిందని అందుకు శిక్షగా ఆమెను తండ్రి నుంచి దూరం చేసి బానిసల గుంపుతో దూరప్రాంతానికి పంపిస్తారు. బలవంతుల దుర్మార్గానికి చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై, ఇప్పుడు అదే దుర్మార్గుల వల్ల కన్నకూతురు దూరమవుతుంటే గుండె పగిలి కుంటా నిర్జీవుడైపోతాడు.

కథ అంతటితో ఆగదు. కిజ్జీ ఇంకో శ్వేత జాతీయుడికి ఉంపుడుగత్తెగా కొడుకు జార్జ్‌ను కంటుంది. జార్జ్‌ కూడా బానిసగా పెరిగి పెద్దవాడై, మద్యపానం, కోళ్లపందేలు వంటి వ్యసనాలతో జీవిస్తాడు. కోళ్ల జార్జ్‌ అని పేరు తెచ్చుకుంటాడు. ఆయన పిల్లల్లో ఒకడు టామ్‌. టామ్‌ పెరిగేనాటికి అబ్రహాం లింకన్‌ అమెరికా అధ్యక్షుడు అవుతాడు. మనుషులంతా ఒక్కటేనని బానిసత్వాన్ని రద్దు చేశాడు. దీన్ని సహించలేని ప్రత్యర్థుల చేతిలో హత్య గావించబడ్డాడు. లింకన్‌ పుణ్యమా అని లక్షల మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు బానిసత్వం నుంచి విముక్తి పొందారు. టామ్‌కు కూడా స్వేచ్ఛ లభించింది.

టామ్‌ వడ్రంగిగా జీవితం కొనసాగించి ఎనిమిది మంది పిల్లల్ని కంటాడు. అందులో ఒక కూతురు సింథియా. ఈమె కూతురు బెర్తా. ఈమె కొడుకు ఎలెక్స్‌ హేలీ. ఈ హేలీ తన జీవిత మూలాలను వెతుక్కుంటూ ఆఫ్రికా వెళ్లి 17వ శతాబ్దం నాటి తన తాతల ముత్తాత కుంటా జీవితాన్ని 19వ శతాబ్దంలో మన ముందుంచాడు. ఈ పుస్తకం చదివిన తరవాత నాకు తెల్సిన విషయం ఏమిటంటే, జ్ఞానం వున్న ప్రతివాడూ ధర్మాత్ముడు కాలేడు. కాని దయగల ప్రతివాడూ ధర్మాత్ముడవుతాడు. ప్రపంచానికి జ్ఞానం అవసరమే కానీ దయలేని జ్ఞానం వల్ల కీడే కానీ మేలు జరగదనీ, కావున మనిషన్నవాడు దయ కలిగి వుండాలనీ ఇటు ఏడుతరాల, అటు ఏడుతరాల పెద్ద మనుషుల అభిమతం ఇదేనని నమ్ముతూ ఇంతటితో విరమిస్తున్నాను.
-పి.శాలిమియ్య
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top