ఇన్ఫెక్షన్‌ను అరికట్టే అరటిపువ్వు!

Banana flower to prevent infection! - Sakshi

అరటిపువ్వు ఆరోగ్యానికి ఇచ్చే ప్రయోజనాలు ఒకటీ రెండూ కావు. దీనితో కూర చేసుకొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్‌–ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని...

అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్‌ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది.
 క్యాన్సర్‌ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్‌ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది.
 అరటిపువ్వుతో చేసిన కూరలు డయాబెటిస్‌ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే అవి రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తాయి.
 అరటిపువ్వులో మెగ్నీషియమ్‌ ఎక్కువ. అందువల్ల అది యాంగై్జటీని తగ్గించడంతో పాటు, మూడ్స్‌ బాగుండేలా కూడా చేస్తుంది.
 ఇక అరటిపువ్వులో ఐరన్‌ ఎక్కువ కాబట్టి రక్తహీనత (అనీమియా)ను అరికడుతుంది.
 అరటిపువ్వు కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు నివారితమవుతాయి. రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్‌ కావడం తగ్గుతుంది.
 రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్‌ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి పీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్‌ఎస్‌)కు కూడా అరటి పువ్వు మంచి ఔషధం.
 చంటి బిడ్డ తల్లులు అరటిపువ్వుతో చేసిన పదార్థాలు తింటే... వాళ్లకు బిడ్డకు సరిపడినన్ని పాలు పడతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top