అరటి.. ఆలు.. లైటు! | Sakshi
Sakshi News home page

అరటి.. ఆలు.. లైటు!

Published Thu, Feb 13 2014 12:22 AM

అరటి.. ఆలు.. లైటు!

మనం రోజూ వాడే ఆలుగడ్డ...
 గెలలు కోసేసిన తరువాత నరికి పారేసే అరటి బోదె...
 కరెంటు ఉత్పత్తి చేసే బ్యాటరీలుగా మారగలవా?
 ఓ... ఎస్ అంటున్నారు అంటున్నారు శాస్త్రవేత్తలు!

 
వినడానికి చాలా సింపుల్ వ్యవహారం అనిపిస్తుందిగానీ... వ్యవహారం చాలా సీరియస్సే. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలోనూ కరెంట్ అంటే ఏమిటో తెలియని వాళ్లు ప్రపంచమంతా 200 కోట్ల మంది ఉన్నారు మరి. మారుమూలన ఉండటం కావచ్చు, పేదరికం కావచ్చు... ఇంకో కారణం ఉండవచ్చుగానీ ఇది నిష్టూర సత్యం. వీరందరికీ విద్యుత్ వెలుగులు అందించేందుకు జరగని ప్రయత్నమూ లేదు. సౌరశక్తి ఖరీదెక్కువ.. పవనవిద్యుత్తుతోనూ ఇబ్బందులే. ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే... స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలతోనే విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై శ్రీలంక, సౌదీ అరేబియాల్లోని శాస్త్రవేత్తలు కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫలితంగా పుట్టుకొచ్చాయి... ఈ అరటి, ఆలు బ్యాటరీలు!
 
నిజానికి ఆలుగడ్డలతో బ్యాటరీలు తయారు చేయడం కొత్తేమీ కాదు. అమెరికా లాంటి దేశాల్లో స్కూలుపిల్లలు తమ సైన్స్ ప్రాజెక్టుల్లో భాగంగా చేస్తూనే ఉన్నారు. ఉడకబెట్టిన ఆలుగడ్డలోకి జింక్, రాగి మేకుల్ని జొప్పించి తగిన విధంగా వైర్లతో కలిపితే చిన్నస్థాయిలో కరెంటు పుడుతుంది. ఆలుగడ్డలోని ఫాస్పారిక్ ఆమ్లం మేకులతో జరిపే చర్యల ఫలితమిది. కాకపోతే నాలుగేళ్ల క్రితం బెర్క్‌లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొందరు ఏ పరిస్థితుల్లో ఆలుగడ్డ నుంచి అత్యధిక విద్యుత్తు రాబట్టవచ్చు? ఏవైనా ఇబ్బందులున్నాయా? అన్న అంశాలపై పరిశోధనలు జరిపారు. ఉడకబెట్టిన ఆలుతో పోలిస్తే దాన్ని నాలుగైదు ముక్కలుగా చేసి లోహపు పలకల మధ్య ఉంచడం ద్వారా పదిరెట్లు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని వీరు నిరూపించారు.

సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సులేమాన్ అబ్దుల్లా మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియను ప్రామాణీకరించారు. సాధారణ 1.5 వోల్టుల బ్యాటరీతో పోలిస్తే ఆలుగడ్డ బ్యాటరీ రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తుందని, అదేసమయంలో 26 రెట్లు చౌకగా లభిస్తుందని అబ్దుల్లా అంటున్నారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే తాము వాణిజ్యస్థాయిలో ఈ బ్యాటరీలకు అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
శ్రీలంకలో అరటితో...
 
బెర్క్‌లీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ రంగంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచాయి. శ్రీలంకలోని కెలనాయా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త కె.డి.జయసూర్య తమదేశంలో ఖరీదైన ఆలుగడ్డలకు మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అని వెతకడంతో అరటిబోదె సామర్థ్యం వెలుగు చూసింది. అరటిబోదె మధ్యభాగాన్ని ఉడికించి సన్నగా తరిగి లోహపు ప్లేట్ల మధ్య ఉంచి బ్యాటరీని రూపొందించవచ్చునని ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఆలుగడ్డతో పోలిస్తే ఇది మరింత చౌకైన విధానం కావడం విశేషం. పైగా వృథాగా పారవేసే అరటిబోదెకు కొత్త ప్రయోజనం కల్పించారీయన. ఒక చిన్న బోదె ముక్కతో ఒక ఎల్‌ఈడీ బల్బును 500 గంటలపాటు వెలిగించవచ్చునని జయసూర్య అంటున్నారు.
 
  యానిమేషన్లూ కారణమే...

 కొన్ని నెలల వాడకంతో స్మార్ట్‌ఫోన్ నత్తనడకన నడిచేందుకు యానిమేషన్లూ ఒక కారణం. అయితే వీటిని డిజేబుల్ చేసే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ ఆప్షన్‌లో బిల్డ్ నెంబర్ అనే ట్యాబ్ ఒకటి ఉంటుంది. దీన్ని ఏడుసార్లు ట్యాప్ చేశారనుకోండి.. డెవలపర్ ఆప్షన్స్‌ను వాడుకునే వీలేర్పడుతుంది. దీంట్లో డ్రాయింగ్ ఆప్షన్స్‌ను ఎంచుకుని విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్‌ను ఆఫ్ చేసేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలోనే యానిమేషన్లన్నీ నిలిచిపోతాయి.
 

Advertisement
Advertisement