ఆరోగ్యానికి తోడు | Bacteria that benefit us throughout our digestive system | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి తోడు

Feb 1 2019 12:52 AM | Updated on Feb 1 2019 12:52 AM

Bacteria that benefit us throughout our digestive system - Sakshi

గడ్డపెరుగు చూశాక ఎప్పుడెప్పుడు భోజనం చివరికొస్తుందా... ఒకింత ఎక్కువ పెరుగన్నం తినేద్దామా అని అనుకోని వారుండరు. కొందరికైతే అసలు పెరుగు తినకుండా భోజనం పూర్తయిన ఫీలింగే ఉండదు. పైగా చలికాలం ముగింపునకొస్తూ... వేసవిలోకి ప్రవేశించబోతున్న ఈ తరుణంలో శీతాకాలం తాత్కాలికంగా పెరుగు తిననివారు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రపడే పెరుగు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. వాటిలో ఇవి కొన్ని... 

మన జీర్ణవ్యవస్థ పొడవునా మనకు మేలు చేసే బ్యాక్టీరియా కోటానుకోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటినే ప్రోబయోటిక్స్‌ అంటారు. పెరుగు నిండా మనకు మేలు చేసే బ్యాక్టీరియా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూస్తుంది. అంతేకాదు... కడుపులో మంటను తగ్గిస్తుంది.పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్‌ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 
రోజూ పెరుగు తినేవారికి మేనిలో మంచి నిగారింపు వస్తుంది.

చర్మంలో ఎప్పుడూ తేమ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందంటున్నారు ఆహార నిపుణులు. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31శాతం తక్కువగా ఉంటాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్‌ సెంటిఫిక్‌ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే  ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ బ్యాక్టీరియా అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా వల్ల  మహిళల్లో పెరిగే... హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

 దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్‌ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్నం మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. చివరగా చిన్నమాట... గడ్డపెరుగు చూశాక టెంప్ట్‌ అయి వేసుకున్నా... కనీసం చెంచా నీళ్లయినా అందులో కలుపుకుంటే మంచిదనీ, అది వాతాన్ని హరిస్తుందన్నది పెద్దల మాట. నమ్మితే ఆచరించండి. నమ్మకపోతే రుచిని ఆస్వాదించండి. ఎందుకంటే పెరుగులో కీడు చేసే అంశం దాదాపుగా లేనే లేదు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement