ధనాగారంలో దొంగ

Ayaz and gave him a chance to complain to Gajani - Sakshi

చెట్టు నీడ

సుల్తాన్‌ ముహమ్మద్‌ గజనీ దగ్గర అయాజ్‌ అనే ఒక కట్టు బానిస ఉండేవాడు. అయాజ్‌ అపారమైన తెలివితేటలు, నిజాయితీ, ఆకట్టుకునే వ్యవహారశైలి వల్ల సుల్తాన్‌ గజనీ అతన్ని తన మంత్రిగా నియమించుకోవడమేగాక పాలనా వ్యవహారాల్లో అయాజ్‌ సలహా సూచనలకే ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో మిగతా మంత్రులు అయాజ్‌ పట్ల అసూయతో రగిలిపోయారు. అయాజ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించే కుట్రల్లో భాగంగా, అయాజ్‌పై అభాండాలు వేసి గజనీకి ఫిర్యాదు చేసేవారు. అయాజ్‌ తన సౌశీల్యంతో అన్నింట్లోనూ నెగ్గుకొచ్చేవాడు. ఒకరోజు సుల్తాన్‌ గజనీ తీరిగ్గా ఒక్కడే ఉండటాన్ని గమనించి ఒక మంత్రివర్గ సహచరుడు అయాజ్‌ పై ఫిర్యాదులు చేయడం మొదలెట్టాడు. ‘‘అయాజ్‌ ప్రతీ నెలా ధనాగారానికి వెళ్తున్నాడు. అక్కడ నుంచి బంగారం, డబ్బు దొంగిలిస్తున్నాడు’’ అనే అభాండాన్ని వేశాడు. 

‘‘దీన్ని నిరూపించగలవా’’ అని సుల్తాన్‌ ప్రశ్నించాడు. ‘‘నాతో పదండి హుజూర్‌! ఇంతకు క్రితమే అతను ధనాగారానికి వెళ్లాడు. మనం ఉన్నపళంగా అతన్ని పట్టుకోవచ్చు’’ అని చెప్పి సుల్తాన్‌ను, మిగతా సైనికులను వెంటపెట్టుకుని ధనాగారంలోకి ప్రవేశించాడు. లోన అడుగు పెట్టగానే విరిగిపోయి ఉన్న ఒక పెట్టె పక్కన అయాజ్‌ కూర్చుని ఉన్నాడు. సుల్తాన్‌ ఎంతో ఆసక్తిగా అయాజ్‌ దగ్గరకెళ్లి చూశాడు. అయాజ్‌ ఆ పెట్టెలో ఉన్న తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. సుల్తాన్‌ ఆశ్చర్యంతో ‘‘అయాజ్‌ ఇక్కడేం చేస్తున్నావు?’’ అని అడిగాడు. ‘‘జహాపనా! నేను మొదటిసారి మీ దగ్గరికి ఈ తెగిపోయిన చెప్పులు, ఈ చిరిగిన బట్టలు, విరిగిన పెట్టెతోనే వచ్చాను. కానీ ఇప్పుడు అల్లాహ్‌ దయ వల్ల తమరి ఆస్థానంలో మంత్రిగా భోగాలు అనుభవిస్తున్నాను. వెండి కంచంలో తింటున్నాను. పట్టు వస్త్రాలు ధరిస్తున్నాను. వీటి మూలంగా నాలో ఏ కోశానా గర్వం రాకుండా ఇలా నెలకోసారి ఈ ధనాగారానికి వచ్చి నా ఈ చెప్పులు, బట్టలను చూసి నా పాతరోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటాను.’’ అని ఎంతో వినయంగా సమాధానమిచ్చాడు. అప్పుడు సుల్తాన్‌ చూసిన చూపులకు మిగతా మంత్రివర్గ సహచరులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. 
– ముహమ్మద్‌ ముజాహిద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top