ఆలోచన ఉన్నవారిదే భవిష్యత్తు

Future of those who have thought - Sakshi

చెట్టు నీడ 

పూర్వం ఒకానొక దేశంలో ప్రజలు ఏడాదికోసారి తమ రాజును ఎన్నుకునేవారు. ఏడాది పాలన ముగిసిన రాజుకు అమూల్యమైన వస్త్రాభరణాలను ధరింపజేసి ఏనుగుపై ఊరేగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వస్తారు. ఈ షరతుకు లోబడిన వారినే గద్దెపై కూర్చోపెట్టేవారు. ఆ రాజ్యంలో ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఇలా ఒక ఏడాది తమ రాజును నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వస్తుండగా వారికి సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకను, అందులో నుంచి ప్రాణాలతో బయటపడ్డ యువకుడినీ చూశారు. అతన్నే తమ చక్రవర్తిగా నియమించాలనుకున్నారు. ఆ యువకుణ్ని తమ పడవలో ఎక్కించుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లి, రాజును చేశారు. అక్కడి ప్రముఖులంతా ఆ యువచక్రవర్తికి అన్ని పాలనా నియమాలతోపాటు, ఏడాది తర్వాత పాలన ముగిసిపోయే విషయాన్ని కూడా వివరించారు. రాజుగా బాధ్యతలు చేపట్టిన మూడోరోజునే ఆ యువకుడు తన మంత్రిని వెంటబెట్టుకుని ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ ప్రాంతమంతా క్రూరమృగాలు, విషసర్పాలతో భయంకరంగా ఉంది. అక్కడక్కడా శవాలు, అస్తిపంజరాల గుట్టలు కూడా కనిపించాయి. అవి తనకన్నా ముందు ఆ రాజ్యాన్ని ఏలిన వారివనీ, ఏడాది తర్వాత తనకూ అదే గతి పడుతుందని ఊహించాడా యువకుడు. 

రాజ్యానికి వెళ్లగానే వంద మంది కూలీలను ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అడవిని మొత్తం నరికేసి, అందులో ఉన్న క్రూర మృగాలను తరిమేయాలని ఆజ్ఞాపించాడు. రాజు పర్యవేక్షణలో కొద్దికాలంలోనే ఆ అటవీ ప్రాంతమంతా పలు రకాలైన పండ్ల చెట్లు, పూల మొక్కలతో నిండిపోయింది. వాటితోపాటు పెంపుడు జంతువులు, పాడి పశువులు, పక్షులతో ఆ ప్రాంతమంతా అందమైన తోటగా, ఆదర్శమైన పట్టణంగా మారింది. చూస్తుండగానే కొత్త రాజు ప్రజానురంజకమైన పాలన ముగిసింది. పురప్రముఖులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు కట్టబెట్టి, ఏనుగుపై ఎక్కించి ఊరేగింపునకు సిద్ధం చేశారు. రాజు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఇష్టం ఉన్న వారంతా తనతోపాటు కొత్త ప్రదేశానికి రమ్మని ఆహ్వానించాడు! అంతా సంతోషించారు.  గత చక్రవర్తులంతా భోగభాగ్యాలలో మునిగి తేలుతూ భవిష్యత్తును విస్మరించారు. ఇతను మాత్రం నిత్యం  భవిష్యత్తు గురించే ఆలోచించి, దానికోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నాడు. ఆ నిర్మానుష్య ప్రాంతాన్ని సుందర నిలయంగా, శేష జీవితాన్ని హాయిగా గడిపేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు. 
– ముహమ్మద్‌ ముజాహిద్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top