న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో జరుగుతున్న ఘటనలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారో? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్‌లోని రేవాలో గల టిఆర్ఎస్ కళాశాలలో విద్యార్థులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, నేటి కాలంలో అనిశ్చితి సాధారణమైపోయిందని, భద్రత, సైబర్ యుద్ధం లాంటి సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత , అస్పష్టతకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారు? రేపు ఏమి చేయనున్నారు? అనేది అతనికే తెలియదని అనుకుంటున్నానన్నారు. సవాళ్లు చాలా త్వరగా వస్తున్నాయి. పాత సవాలును గ్రహించేలోపే, కొత్తది ఉద్భవిస్తోంది. దీనినే ఇప్పుడు సైన్యం ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో అయినా, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం అయినా సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయన్నారు.
ఇప్పుడు కొత్తగా అంతరిక్ష యుద్ధం, ఉపగ్రహాలు, రసాయన, జీవ, రేడియోలాజికల్, సమాచార యుద్ధాలు మొదలయ్యాయని ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో కరాచీపై దాడి జరిగిందంటూ అనేక వార్తలు వచ్చాయని, అవి తమకూ చేరాయని, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో తమకు తెలియదన్నారు. ఇటువంటి సవాళ్ల పరిషర్కారానికి భూమి, ఆకాశం, నీరు.. ఈ మూడింటిపైనా పని చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్‌లో పేలుడు.. 23 మంది మృతి


