మెక్సికో: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్‌లో జరిగిన పేలుడులో 23 మంది మృతిచెందగా, మరో 11 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. హెర్మోసిల్లోలోని వాల్డోస్ స్టోర్‌లో పేలుడు సంభవించింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డ్యూరాజో ఒక వీడియో సందేశంలో తాము చూసిన బాధితుల్లో చాలా మంది మైనర్లని తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు, బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర, భద్రత, ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో స్పందించి, పరిస్థితిని నియంత్రించి, ప్రాణాలను కాపాడారని తెలిపారు. కాగా మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మృతులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను సోనోరా గవర్నర్ అల్ఫోన్సో డురాజోతో సంప్రదింపులు జరిపానని, సహాయక బృందాలను అప్రమత్తం చేయాలని కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌ను ఆదేశించానని తెలిపారు.
Mis sentidas condolencias a las familias y seres queridos de las personas fallecidas en el incendio ocurrido en una tienda en el centro de Hermosillo.
He estado en contacto con el gobernador de Sonora, Alfonso Durazo, para apoyar en lo que se necesite. Instruí a la secretaria de…— Claudia Sheinbaum Pardo (@Claudiashein) November 2, 2025
సూపర్ మార్కెట్‌లో పేలుడు జరిగిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని అగ్నిమాపక విభాగం చీఫ్ తెలిపారు. రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ మాట్లాడుతూ విషపూరిత వాయువులను పీల్చడం వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని మీడియా నివేదికల్లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొన్నారు. పేలుడుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కారణం కాగవచ్చని మెక్సికన్ అధికారులు భావిస్తున్నారు. కాగా సోనోరాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగివుండవచ్చని పేర్కొంది.


