ఖలీఫా చూడకపోయినా..!

Water in the milk is banned and sold - Sakshi

చెట్టు నీడ

‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకునిరండి’’ అని రాజభటులకు పురమాయించారు.ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు.

ఖలీఫా ఉమర్‌ (రజి) చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న కాలం అది. ఆయన తెల్లవారుఝామున లేచి ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు గస్తీ తిరిగేవారు. ఆ రోజు గస్తీ తిరుగుతుండగా ఒక యువతి, ఒక పెద్ద వయసు మహిళ సంభాషణ ఖలీఫా చెవుల్లో పడ్డాయి. ‘‘అమ్మా ఈ రోజు మేకలు పాలు చాలా తక్కువగా ఇచ్చాయి’’ అంది కూతురు. అందుకు ఆ తల్లి నవ్వేసి, ‘‘దానికి ఇంతలా ఆలోచించాలా, పాలల్లో కాసిన్ని నీళ్లు కలుపు’’ అని తన బిడ్డకు పురమాయించింది. ‘‘అమ్మా అపచారం, మన ఖలీఫా గారు పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం నిషేధించారు కదా’’ గుర్తుచేసింది కూతురు. ‘‘పిచ్చిదానా, ఖలీఫా ఏమైనా ఇక్కడకు వచ్చి చూస్తున్నారా ఏమిటీ’’ అని తల్లి నచ్చజెప్పపోయింది. ‘‘ఖలీఫా చూడకపోయినా, ఖలీఫా ఆరాధించే ప్రభువు చూస్తున్నాడు కదమ్మా’’ అంది కూతురు. ఈ మాటలు ఖలీఫాకు ఎంతగానో నచ్చాయి. మారు మాట్లాడకుండా తన రాజదర్బారుకు చేరుకున్నారు.

‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకుని రండి’’ అని రాజభటులకు పురమాయించారు. ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు. అయితే, అందుకు విరుద్ధంగా ఖలీఫా వారికి సాదర స్వాగతం పలికారు.‘‘దైవం పట్ల అచంచల నమ్మకమున్న దైవభీతి పరురాలైన మీ అమ్మాయి పెళ్లి మా అబ్బాయితో జరిపించాలనుకుంటున్నాను. మీకు అందుకు సమ్మతమేనా?’’ అంటూ ఆ మహిళను సూటిగా అడిగారు. ఆమె ఆనందంగా అంగీకరించింది. వెంటనే తన కుమారుడికి ఆ పాలమ్మాయితో పెళ్లి జరిపించారు ఖలీఫా. మేకపాలను అమ్ముకుని సాధారణ జీవనం గడిపే ఒక పేదింటి అమ్మాయి ప్రదర్శించిన దైవభీతి ఆమెను చక్రవర్తి ఇంటి కోడలిని చేసింది. జవాబుదారీతనం, దేవుడు చూస్తున్నాడనే తలంపే పాలకులనైనా, ప్రజలనైనా సత్యంపై, ధర్మంపై నిలకడగా ఉంచుతుందన్నది ఈ కథలోని నీతి. 
–  ముహమ్మద్‌ ముజాహిద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top