నువ్వు రాయడం మొదలెట్టాక...

Athreya Veturi Relation - Sakshi

సాహిత్య మరమరాలు

రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను యేడిపిస్తారని పేరుపడిన ఆత్రేయ కొంతకాలం తెలుగు సినీపరిశ్రమను శాసించారు. కానీ డెబ్భైల దశకంలో సినిమా పాటను వేగంగా, వైవిధ్యంగా రాయగల వేటూరి సుందర రామమూర్తి రంగప్రవేశం చెయ్యడంతో ఆత్రేయ కొంచెం వెనకబడ్డారు. అయితే వేటూరి మాత్రం ఆత్రేయను గురువుగా, గీతాచార్యునిగానే భావించేవారు. ఆత్రేయతో వుండే అనుబంధంతో వేటూరి ఆయనను కలిసినప్పుడల్లా పిచ్చాపాటీ మాట్లాడుకోవడం పరిపాటిగా వుండేది.

అలా ఒక సందర్భంలో వయసులో తన కంటే పెద్దయిన ఆత్రేయ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ వుండడం గమనించిన వేటూరి – ‘గురువుగారూ, నా తల అప్పుడే తెల్లబడిపోతోంది. మీ తల యింత నల్లగా వుండటంలోని రహస్యమేమి’టని అడిగారట! ఆత్రేయ నవ్వుతూ తను వాడుతున్న ఆయుర్వేదానికి చెందిన తలనూనె పేరు చెప్పారట! ఆ చిట్కా తెలిసిన వేటూరి కూడా ఆ నూనె రాయడం ప్రారంభించి తన గ్లామర్‌ను పెంచుకున్నారట! కొంతకాలం తర్వాత జుట్టు నల్లదనాన్ని జాగ్రత్తగా కాపాడుకొంటున్న వేటూరి, ఆత్రేయను చూడ్డానికి వెళ్లేసరికి ఆశ్చర్యకరంగా ఆయనకు ఆత్రేయ తెల్లని జుట్టుతో కనిపించారట! వేటూరి విస్తుపోతూ – ‘ఈ మధ్య మీరు (ఆ తలనూనె) రాయడం మానేసినట్టున్నారే?’ అని అడిగారట!

దానికి బదులుగా ఆత్రేయ ‘అవును – నువ్వు రాయడం మొదలుపెట్టిన తర్వాత నేను రాయడం మానేశాను’ అన్నారట రాయడానికి రెండో అర్థాన్ని స్ఫురింపజేస్తూ చమత్కారంగా! ‘నువ్వు చాలా స్పీడుగా యెడా పెడా రాసి పారేస్తున్నావట! ఏం తొందరొచ్చిందయ్యా?’ అనే ఆత్రేయ ఆశీఃపూర్వకమైన మందలింపునకు వేటూరి వినమ్రంగా – ‘గురువుగారూ, మీ అంత గొప్ప యెలాగూ రాయలేను, మీ కంటే తొందరగానైనా రాయకపోతే నా బ్రతుకుదెరువు యెలాగండీ?’ అని బదులివ్వడం పై సంఘటనకు పూర్వరంగం!
పంపినవారు: డా. పైడిపాల 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top