సాహసం... సాక్ష్యం

 Anjali Kulthe Saved 20 Pregnant Womens - Sakshi

జ్ఞాపకాంజలి

ముంబై.. కోర్టులో.. ‘‘ఆసుపత్రిలో కాల్పులు, బాంబులు వేసిన వాళ్లలో ఇతను ఉన్నాడా?’’ తన పక్కన నిలబడ్డ ఓ యువకుడిని చూపిస్తూ అడిగాడు లాయర్‌ ఎదురుగా ఉన్న ఓ మహిళను. ‘‘ఉన్నాడు..’’ తెల్లటి యూనిఫామ్‌లో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె అంతే శాంతంగా చెప్పింది. ‘‘సరిగ్గా చూసి చెప్పండి.. ఆరోజు రాత్రి.. మీరు చూసింది ఇతణ్ణేనా?’’ రెట్టించాడు లాయర్‌.

‘‘అవును.. ఇతణ్ణే’’ తడుముకోకుండా స్థిరంగా చెప్పింది అంజలి. ‘‘ఆ రోజు ఎంతమందిని చూశారు?’’ ఎలాగైనా ఆమెను అయోమయానికి గురిచేసి ‘‘చూడలేదు’’ అని ఆమె నోటితో చెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు లాయర్‌. ‘‘ఇద్దరు.. ఆ ఇద్దరిలో ఇతను ఉన్నాడు..’’ ఏమాత్రం కన్‌ఫ్యూజన్‌ లేకుండా స్పష్టం చేసింది ఆమె.

అలా ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి అడిగినా తొణక్కుండా, బెణక్కుండా అతనే.. అతనే .. అతనే అని ధైర్యంగా చెప్పింది ఆమె. అతను.. మహ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ ఉరఫ్‌ కసబ్‌.. లష్కరే తోయిబా టెర్రరిస్ట్‌. ఆమె.. అంజలి.. ముంబైలోని కామా అండ్‌ అల్బ్‌లెస్‌ (విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌) ఆసుపత్రిలో నర్స్‌. నేపథ్యం.. 2008, నవంబర్‌ 26న ముంబైలోని కామా అండ్‌ అల్బ్‌లెస్‌ ఆసుపత్రిలో జరిగిన బాంబుదాడుల్లో ప్రాణాలతో పట్టుబడ్డ నిందితుడు కసబ్‌. తాజ్‌మహల్‌తోపాటు పలుచోట్ల జరిపిన ఈ దాడుల్లో కామా అండ్‌ అల్బ్‌లెస్‌ (విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌) ఆసుపత్రి కూడా ఉంది. అందులో పనిచేసే నర్సే అంజలి. దాదాపు 20 మంది నిండు గర్భిణుల ప్రాణాలు కాపాడిన ధీర వనిత. ఆ తర్వాత అంతే ధైర్యంగా అదిగో అలా కోర్టుహాలులో కసబ్‌నూ గుర్తించింది. ఈ బాంబు దాడికి నిన్నటితో పదకొండేళ్లు.. ఈ సందర్భంగా అంజలి సాహసాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి సంఘటన గురించి ఆమె మాటల్లోనే చదువుదాం.. ‘‘ఎప్పటిలా ఆరోజు కూడా నైట్‌ డ్యూటీలో ఉన్నా ప్రసూతి వార్డ్‌లో. ప్రసవం అయిన వాళ్లు కాకుండా 20 మంది గర్భిణులూ ఉన్నారు.

ఆ రాత్రి కాళరాత్రని కలలో కూడా ఊహించం కదా! యథాలాపంగా వార్డ్‌ నుంచే ఆసుపత్రి ఆవరణలోకి చూశా.. రక్తం మడుగులో సెక్యూరిటీ గార్డ్స్‌ పడి ఉన్నారు. అప్పటికే ఇద్దరు మనుషులు వార్డ్‌ వైపున్న మెట్లెక్కుతూ కనిపించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెడుతూ బరువుగా.. హార్డ్‌గా ఉన్న వార్డ్‌ తలుపులు మూసేశాను. చెమటలు పట్టేశాయి. అంత భయంలోనూ చురుగ్గానే ఆలోచించా. డ్యూటీలో ఉన్న డాక్టర్స్‌ను అలర్ట్‌ చేశా. పోలీస్‌ ఎమర్జెన్సీకి డయల్‌ చేసి హెల్ప్‌ అడిగా. ఇంతలోకే బాంబుల శబ్దం.. హాస్పిటల్‌ మీద ఎందుకు దాడిచేస్తున్నారో అర్థం కాలేదు. మైండ్‌ అంతా బ్లాంక్‌. ఆ చప్పుడుకి బిల్డింగ్‌ అదిరిపడ్తోంది. నా దృష్టంతా ఆ 20 మంది గర్భిణుల మీదే ఉంది. వాళ్లను, వాళ్లతోపాటు వచ్చిన వాళ్ల అటెండెంట్స్‌నూ తీసుకొని ఆ వార్డ్‌ పక్కనే ఉన్న పాంట్రీ (వంట గదిలాంటిది) స్పేస్‌కు తీసుకెళ్లా. టెన్షన్‌కో, భయానికో ఆ ఇరవై మందిలో ఒకామెకు నొప్పులు మొదలయ్యాయి. తనను అక్కడ ఉంచడం సేఫ్‌ కాదని ఒక డ్యూటీ డాక్టర్‌ సాయంతో సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న డెలివరీ రూమ్‌కి తీసుకెళ్లా.

ఒక్క ట్యూబ్‌లైట్‌ వెలుతురులో ఆమెకు డెలివరీ చేశాం. హమ్మయ్య అనుకుంటూ గది బయటకు వచ్చామో లేదో.. రక్తమోడుతూ కనిపించింది మాస్టాఫ్‌ నర్స్‌. అంతే! పై ప్రాణాలు పైనే పోయాయి మాకు. హాస్పిటల్‌ ఏమాత్రం సురక్షితంగా లేదని అర్థమైంది. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, ప్రసూతి వార్డ్‌లో మిగిలిన పసిప్రాణాలు, బాలింతలు, పాంట్రీలో గర్భిణులు, వాళ్ల అటెండెంట్లు... తలపట్టుకున్నాం అంతా! గర్భిణులను, బాలింతలను పట్టుకొని బాంబు చప్పుళ్లు ఎటువైపు వినపడితే దానికి వ్యతిరేక దిశలో హాస్పిటల్‌ బిల్డింగ్‌ అంతా తిరిగా... ఎలాగైనా వాళ్లను కాపాడాలని’’ అంటూ చెప్పుకొచ్చింది అంజలి ఆ ఉద్విగ్న క్షణాల గురించి. ఆమె సాహసం ఆ రాత్రితోనే ఆగిపోలేదు. నెల తర్వాత ఆర్థర్‌ రోడ్‌లో ఉన్న జైలుకి వచ్చి నిందితుడు కసబ్‌ను గుర్తించాలని ఆమెకు సమన్లు అందాయి. మొదట్లో నిరాకరించినా తర్వాత ఒప్పుకొని జైలుకి వెళ్లి కసబ్‌ను గుర్తించడమే కాక.. కోర్టుకు వెళ్లి కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమూ ఇచ్చింది. అయితే కోర్టుకి యూనిఫామ్‌లోనే వస్తానని షరతు పెట్టింది అంజలి. ‘‘యూనిఫామ్‌లో వెళ్లకపోయుంటే అంత ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగేదాన్ని కాదేమో’’ అంటుంది అంజలి. అంజలి ధైర్యానికి, సమయస్ఫూర్తికి, ఆ తర్వాత చూపిన తెగువకు నిజంగా అందరూ ఆమెకు అంజలులు సమర్పించాల్సిందే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top