దొగ్గలి కూర గుడ్డుతో సమానం

Alternate greens:duckling is equal to the egg - Sakshi

ప్రత్యామ్నాయ ఆకుకూరలు

స్త్రీకి పరిసరాలను ఉపయోగించుకోవడం తెలుసు. అవసరం ఉన్నదానిని అవసరం లేనిదానిని కూడా ఎలా ఉపయోగంలోకి తేవాలో వారు తెలుసుకుంటారు. ఇక మహిళా రైతులంటే మాటలా? వారికి చెట్టూ చేమా పుట్టా పొద.., అన్నింటి గురించి అవగాహన ఉంటుంది. వాటిని ఇంటి అవసరానికి ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటుంది. జహీరాబాద్‌ మండలానికి చెందిన మహిళా రైతులు కొందరు ప్రకృతిని సమర్థంగా ఉపయోగించుకుంటూ ఆదర్శంగా అబ్బురంగా నిలుస్తున్నారు. తమ పరిసరాల నుంచి బలవర్థకమైన ఆహారాన్ని గుర్తించి సేకరిస్తున్నారు. స్వీకరిస్తున్నారు. ఫలితంగా వారు ఇంతవరకు ఒక్కనాడు కూడా దవాఖానాకు వెళ్లలేదు. ఒక్కనాడు జ్వరం వచ్చిందనో, జలుబు చేసిందనో ముసుగు వేసుకుని పడుకోలేదు. అంతేనా పేరు రాసుకోవడం తెలియని,  ముఖాలు అద్దంలో కూడా చూసుకోవడం తెలియని ఈ మహిళలు వాళ్ల కార్యక్రమాలను వారే వీడియోలలో బంధిస్తున్నారు. అదీ ఈ మహిళలు సాధించిన విజయం. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ అన్‌కల్టివేటెడ్‌ ఫుడ్స్‌’ కార్యక్రమానికి వారు తయారుచేసిన వంటకాలను ప్రదర్శించి, రుచి చూపడానికి వచ్చిన సందర్భంగా సాక్షి వారిని పలకరించింది.

‘మేం మొత్తం ఐదు వేల మంది మహిళా రైతులం. అందరం ఎవరికి వారుగా వ్యవసాయం చేస్తూనే సంఘం వారి సమావేశానికి హాజరైనప్పుడు అక్క, చెల్లి, వదిన, అవ్వ, అత్త, బిడ్డా అంటూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఒకరు చేసిన వంటలు ఒకరికి రుచి చూపిస్తాం’ అంటారు డెబ్బై సంవ్సరాల చంద్రమ్మ.నున్నటి బుగ్గలతో, కళ్ల జోడు అవసరం లేని కంటిచూపుతో, అదురుబెదురు లేని మాటలతో అందరినీ ఆకర్షిస్తారు చంద్రమ్మ. ఆహార యోగ్యమైన ఆకుకూరలను గుర్తించడంలో ఈమెది అందె వేసిన చేయి. ‘‘అందరము కలిసి/ ఆడోళ్లము కలిసి/ ఆకుకూరలు తెస్తిమి వజ్రమ్మా’’ అంటూ గొంతెత్తి పాడారామె. ఈ పాట మీరే రాసుకున్నారా అని ప్రశ్నిస్తే ‘మాకు అక్షరంగా రాయడం చేతకాదు, మేము చేసే పనిని పాడుకునేలా మా మాటలలో రాసుకున్నాం’ అందామె.  మొత్తం 30 రకాల ఆకుకూరలు వీరు ఆహారంగా తీసుకుంటారు. ఇవి సాగు చేస్తే పండే ఆకుకూరలు కాదు. ప్రకృతి పండించేవి. చేల గట్ల మీద, మట్టి దిబ్బల మీద మొలిచే ఆకుకూరలు ఇవి. చాలామంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటారు తెలియక. విత్తనం నాటకుండా స్వయంగా పుట్టి పెరుగుతాయి ఈ మొక్కలు. వీటిని ఎలా గుర్తిస్తారు అని అడిగితే ‘చిన్ననాటి నుంచి ఈ మొక్కల మధ్యనే పుట్టి పెరిగాం. మా పెద్దోళ్లు వీటి గురించి మాట్లాడతంటే ఇనెటోళ్లం. వండి పెడితే సక్కగ తినెటోళ్లం’ అంటారు మొగులమ్మ.

‘మేం ఇత్తులు నాటక్కర్లే. వాన బడితే అట్లనే సక్కగ మొలుస్తయి. పొలంల పని చేసుకొని, ఇంటికాడకి పోయెటేళ, ఆ దినానికి సరిపోయేట్ల మొక్కలు పెరుక్క పోతం. సక్కగ వండుకుని రొట్టెల్ల నంజుకు తింటం’ అంటారు అర్జూ నాయక్‌ తండాకి చెందిన చక్రీబాయి. ‘‘మేం దినాము జొన్నరొట్టెలు, లేకంటే సజ్జ రొట్టెలు తింటం. పొలం కాడ నుంచి తెచ్చుకున్న వాటితో కూర లు సేస్తం. రొట్టెల్లో కలిపి తింటం’’ అంటున్న వీరు అనీమియా వంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు. వినాయక చవితికి విస్తారంగా పండే తుమ్మి కూరతో శరీరానికి కావలసిన ఇనుము దొరికి వీరి శరీరాలు ఉక్కులా తయారవుతున్నాయి. ఏ పంటనూ ఇబ్బంది పెట్టకుండా స్వయంశక్తితో పెరిగే ఆకుకూరలుగా వీటì  గురించి చెబుతారు ఈ మహిళా రైతులు.‘దొగ్గలి కూర, ఉడికించిన కోడిగుడ్డుతో సమానం. రోజుకో ఆకుకూర తింటే దవాఖానా (ఆసుపత్రి)కు పోయ్యేటి అవుసరం ఉండదు’ అంటారు చంద్రమ్మ. దొగ్గలి కూర తింటే ఇనుములా తయారవుతారని,  మోకాలినొప్పులు రావని, ఉత్తరేణి తింటే తెల్లమచ్చలు దూరమవుతాయని, జీవితంలో ఒక్కసారైనా తినాలనీ అంటారు వీరు. ‘మా వంటి వారిని అడిగి తెప్పించుకోవాల. మాకులాగనే సక్కగ అవుతారు’ అంటారు చక్రీబాయి.పప్పుకూర తింటే మధుమేహ వ్యాధి బారిన పడకుండా ఉంటారని, బర్రేకుల కూర తింటే  అమ్మపాలు పసిబిడ్డకు సమృద్ధిగా అందుతాయని, ఈ మొక్కలన్నీ దేవుడు ఇచ్చిన వరాలని చెబుతారు మొగిలమ్మ.‘మాకు ఇయ్యే మాంసం కూర లెక్క’ అంటారు చక్రీబాయి.వ్యవసాయం చేయడంలో మాత్రమే కాదు, వీరు వీడియోలు తీయడం చూస్తే ఎంతటివారికైనా ఆశ్చర్యం కలగక మానదు. సుమారు ఏడాదిపాటు వీడియోగ్రఫీ నేర్చుకుని, వారి కార్యక్రమాలు ఎక్కడజరుగుతున్నా వారి వీడియోలు వారే తీసుకునే స్థాయికి ఎదిగారు ఈ మహిళా రైతులు.

రొట్టెలు దాసిపెడతం
‘రోజూ రొట్టెలు చేసకుంటం. అందల నాలుగు రొట్టెలు దాసిపెడతం. ఇంటికి ఎవురైనా అస్తే ఆళ్లకి పెడతం. ఒకరికి పెట్టి మనం తింటే మంచిగుంటది. ఇంకా మిగిలితే ఆవులకి పెడతం.
– చంద్రమ్మ 
–  వైజయంతి పురాణపండ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top