ప్రపంచానికి అప్లికేషన్‌

 The AIESEC is a United Nations recognized organization - Sakshi

పరిచయం  విభా నాయక్‌ నవ్రే

విభా నాయక్‌ నవ్రే... హైదరాబాద్‌లో స్థిరపడిన... మరాఠా కుటుంబానికి చెందిన అమ్మాయి. బిబిఎ ఫైనలియర్‌ చదువుతోంది. చైనాకు వెళ్లి... స్కూలు పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పే వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. కానీ ఇప్పుడు కొంచెం ప్రత్యేకం.దేశం ఎల్లలు దాటి కొత్త సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల మధ్య మెలిగిన అనుభవంతో కూడిన ప్రత్యేకత అది. ఖండాంతరాల నుంచి వచ్చిన విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకున్న తర్వాత కలిగిన ఆకళింపు విభాది.ఐక్యరాజ్య సమితి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోమని తోటియువతకు పిలుపునిస్తోంది విభా.

‘‘ఇంట్లో చిన్నదాన్ని కావడంతో, అది కూడా అమ్మాయిని కావడంతో విపరీతంగా పాంపర్‌ చేసేవాళ్లు. అమ్మ, నాన్న, అన్నయ్యల గారాబాన్ని ఎంజాయ్‌ చేస్తూ పెరిగాను. కొన్ని దేశాల్లో పిల్లల్ని ఇండిపెండెంట్‌గా పెంచుతారు. మనదేశంలో దాదాపుగా అన్ని ఇళ్లలోనూ పిల్లల్ని ఇలాగే ముద్దు చేస్తుండవచ్చు. అందుకే మనదేశం యువతకు ఇంటర్నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ చాలా అవసరం అంటాను.

నాక్కూడా ఆ సంగతి చైనాకు వెళ్లిన తర్వాతే తెలిసింది. అప్పటి వరకు ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ల వైపు చూస్తే సరిపోయేది. వాళ్లే సొల్యూషన్‌ వెతికి పెట్టేసేవాళ్లు. ఒకసారి దేశం సరిహద్దు దాటి బయటకు వెళ్లిన తర్వాత మనకెదురైన సమస్యకు పరిష్కారాన్ని మనమే వెతుక్కోవాలి. మనల్ని మనం ఎక్స్‌ప్లోర్‌ చేసుకోవడం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. మనకూ ఆలోచించే శక్తి ఉందని, అది అవసరానికి తగినట్లు మనకోసం కొత్త దారిని ఆవిష్కరిస్తుందని తెలిసొస్తుంది.

చైనాలో ఇంగ్లిష్‌కి ఎంట్రీ
‘ఐసెక్‌’ తరఫున గ్లోబల్‌ వాలంటీర్‌ కేటగిరీలో గత ఏడాది మే నెలలో చైనాకి వెళ్లాను. చైనాలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటికి అనుమతి లేదు. కేవలం వి చాట్‌కి మాత్రమే పర్మిషన్‌. అక్కడ ‘దాలియన్‌ చి’ సిటీలో దోంగ్‌బాయ్‌ యూనివర్సిటీలో మాకు ఇంటర్న్‌షిప్‌ ఇచ్చారు. ఆ దేశం చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పడం నా ప్రాజెక్ట్‌. స్కూల్‌లో మొత్తం సిలబస్‌ అంతా చైనీస్‌ మీడియంలోనే సాగుతుంది. స్కూల్‌ తర్వాత డే కేర్‌ సెంటర్‌లలో ఒక గంట ట్యూషన్‌ ఉంటుంది. ఆ గంటలో ఇంగ్లిష్, మ్యాథ్స్‌ క్లాసులు తీసుకుంటారు. చైనా ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌లో స్కూల్‌ లెవెల్‌లో కంపల్సరీ ఎడ్యుకేషన్‌ ఉంది. కానీ ఇంగ్లిష్‌ మీడియం ఉండేది కాదు. ఈ తరంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని, మంచి ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష ఎక్కువైంది.

చైనాలోని ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వచ్చిన విదేశీ విద్యార్థులతో మమైకం కావాలంటే భాష పెద్ద అడ్డంకిగా ఉండేది వాళ్లకు. దాంతో ప్రభుత్వం కరికులమ్‌లో ఇంగ్లిష్‌ భాషను ఒక సబ్జెక్టుగా చేర్చింది.ఉపాధి అవకాశాలు ఎక్కువచైనా వాళ్లలో పనిని గౌరవించడంతోపాటు చట్టం పట్ల అంకితభావం కూడా ఎక్కువే. కమ్యూనిస్ట్‌ దేశం కాబట్టి, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయేమో అనుకుంటాం. కానీ అక్కడి మనుషులు నిబంధనను పాటించడం తమ బాధ్యత అన్నట్లు ఉంటారు. ప్రభుత్వం కూడా ప్రజల అభీష్టం మేరకు కొన్ని సడలింపులు చేసుకుంటోంది.

ఒకప్పుడు ‘వన్‌ ఫ్యామిలీ.. వన్‌ చైల్డ్‌’ నిబంధన ఉండేది. ఇప్పుడు రెండవ బిడ్డను కనడానికి అనుమతి ఉంది. కమ్యూనిస్ట్‌ దేశమైనా సరే మతవిశ్వాసాలకు కూడా గౌరవం ఉంది. అక్కడ ఎక్కువగా బౌద్ధాన్ని పాటిస్తారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ చైనీస్‌ భాషలోనే జరగడం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే... పెద్దగా చదువుకోని వాళ్లు కూడా ఇండస్ట్రీలు పెట్టి సమర్థంగా నడిపించుకోగలుగుతున్నారు. అక్కడ టీచింగ్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నికల్‌ ప్రాజెక్ట్‌లలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చైనాకి వెళ్లే ముందు అక్కడి వాళ్లు ముభావంగా ఉంటారేమోనని అపోహ పడ్డాను, కానీ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు.

చైనాలో 45 రోజులు
‘ఐసెక్‌’ అనేది ప్రపంచంలోని రకరకాల సంస్కృతులను తెలుసుకోవడమే ప్రధానంగా ఏర్పాటైన సంస్థ. అందుకే వైవిధ్యభరితమైన సంస్కృతి సంప్రదాయాలున్న దేశాల్లో ఇంటర్న్‌షిప్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మనదేశంలో ఉన్నట్లే చైనాలో కూడా ఒక నగరానికి మరో నగరానికీ మధ్య స్పష్టమైన వైవిధ్యం కనిపిస్తుంది. దాలియన్‌ చి నగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీజింగ్‌ నగరం మాత్రం మన ముంబయిలాగా ఉరుకులు పరుగుల మధ్య రోజు గడుపుతుంటుంది. వాతావరణం కూడా ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. దాలియన్‌ చి నగరంలో మే నెలలో ఉష్ణోగ్రతలు ఏడు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉంటాయంతే. ఆ దేశంలో ప్రతి నగరానికి ఓ చరిత్ర ఉంది. వైవిధ్యమైన కళలున్నాయి. మనం తిన్నట్లే చైనాలో కూడా చాలా చోట్ల ప్లెయిన్‌ రైస్‌ ప్రధాన ఆహారంగా తింటారు.

చికెన్, బీఫ్, పోర్క్, ఎగ్, ఉడికించిన కూరగాయలు ఉంటాయి. పాలు, పెరుగు బాగా తీసుకుంటారు. అయితే కాఫీ, టీలలో పాలు కలపరు. గ్రీన్‌ టీ, బ్లాక్‌ కాఫీతోపాటు అక్కడ చైనీస్‌ టీ అని ప్రత్యేకంగా మరో టీ వెరైటీ ఉంటుంది. ఒక దేశం చరిత్ర, సంస్కృతి, సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదవడం కంటే ఒకసారి పర్యటించి అధ్యయనం చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని నాకనిపించింది. ఇంటర్నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ చేయడం పై చదువులకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఐసెక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా సర్వీస్‌ ఇస్తున్నాను. ఒకసారి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరితే మనలోని శక్తి బయటకు వస్తుందని చైనాలో ఉన్న ఆ నెలన్నర రోజుల్లో తెలుసుకున్నాను.

స్పోర్ట్స్‌ పర్సన్‌నే కానీ..!
నేను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి మంచి టెన్నిస్‌ ప్లేయర్‌ని. చింతల్‌లోని సెయింట్‌ మార్టినా స్కూల్‌ని రిప్రజెంట్‌ చేశాను. 2014లో నేషనల్స్‌ ఆడి తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్‌ మెడల్‌ తెచ్చాను. కానీ టెన్నిస్‌ను కొనసాగించలేకపోయాను. కొంతకాలం కోచ్‌గా శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు ఫారిన్‌ యూనివర్సిటీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో స్థిరపడాలనేది నా కోరిక’’.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటో: శివ మల్లాల

విద్యార్థులే... విద్యార్థుల కోసం..!
ఐసెక్‌ అనేది యునైటెడ్‌ నేషన్స్‌ గుర్తించిన ఆర్గనైజేషన్‌. ఐసెక్‌ ద్వారా విదేశాలకు వెళ్లి ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకునే వాళ్లు  వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. ఇందులో వాలంటీర్, టాలెంట్, ఎంట్రప్రెన్యూర్‌ విభాగాల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఎంట్రప్రెన్యూర్‌ ఎంపిక చేసుకునే వాళ్లకు ఆ సబ్జెక్ట్‌ మీద కొంత అవగాహన ఉండాలి. కాలేజ్‌ చదువు పూర్తయిన వాళ్లు టాలెంట్‌ కేటగిరీలో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. ఈ కేటగిరీలో ఉపకార వేతనం కూడా ఉంటుంది. ఇక వాలంటీర్‌ కేటగిరీలో వెళ్లిన వాళ్లకు ఉపకార వేతనం ఉండదు, నేర్చుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఐసెక్‌ ద్వారా విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వయసు 18– 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ట్వల్త్‌ క్లాస్‌ పూర్తి చేసి ఉండాలి. వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని, సెలెక్ట్‌ అయిన తర్వాత 18 వేల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది.

ఆ దేశాల్లో ఎయిర్‌పోర్టు నుంచి పికప్, డ్రాప్, బస వంటి సౌకర్యాలన్నీ అందులోనే. హోమ్‌స్టే ఉన్న చోట భోజనం కూడా ఇస్తారు. హాస్టల్స్‌లో ఉండాల్సి వస్తే బస ఉచితం, భోజనం ఖర్చు మాత్రం అదనంగా ఉంటుంది. ఇక విమాన చార్జీలు, షాపింగ్, టూరిస్ట్‌ ప్రదేశాల విజిటింగ్‌ వంటి ఖర్చులు విద్యార్థులే భరించాలి. మొత్తం మీద ఒక విద్యార్థి 45 రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌కి వెళ్లి రావడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. గత ఏడాది ఓ ఇరవై మంది అండర్‌ ప్రివిలేజ్‌డ్‌ స్టూడెంట్స్‌కి ప్రభుత్వమే స్పాన్సర్‌ చేసింది. హైదరాబాద్‌ ఐసెక్‌లో వంద మందికి పైగా విద్యార్థులు ఏడెనిమిది విభాగాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. నేను ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతూ ఇందులో మార్కెటింగ్‌ సర్వీస్‌ ఇస్తున్నాను.
– బి. నిఖిల, మేనేజర్, బిజినెస్‌ టు కస్టమర్‌
ఐసెక్‌ హైదరాబాద్‌ చాప్టర్‌

127 దేశాల్లో 45 వేల మంది
ఐసెక్‌ (ఎఐఈఎస్‌ఈసి) అనేది ఫ్రెంచ్‌ పదం. దీని పూర్తి స్వరూపం ‘అసోసియేషన్‌ ఇంటర్‌నేషనల్‌ ద ఇట్యూడెంట్స్‌ ఎన్‌ సైన్సెస్‌ ఎకనమిక్స్‌ ఎట్‌ కమర్షియల్స్‌’. ఇంగ్లిష్‌లో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ ఎకనమిక్‌ అండ్‌ కమర్షియల్‌ సైన్సెస్‌’గా వ్యవహరిస్తారు. ఇది యువత నిర్వహిస్తున్న నాన్‌ గవర్నమెంట్, నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌. ప్రపంచంలోనే యువత సమర్థవంతంగా నడిపిస్తున్న అతి పెద్ద సంస్థ. ఇందులో గ్లోబల్‌ వాలంటీర్, గ్లోబల్‌ టాలెంట్, గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కేటగిరీలుంటాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తుంది ఐసెక్‌. డెబ్బై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ 127 దేశాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో నలభై ఐదు వేల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top