నలుగురి కుటుంబానికి 49 మీటర్ల పెరటి తోట!

49-meter garden yard for four people - Sakshi

ఇంటి పంట

జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌) హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు, స్టార్టప్స్‌ ఏర్పాటు చేసుకునే యువతీ యువకులు.. ‘మేనేజ్‌’లో వివిధ అంశాలపై ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ ఉంటారు. వీరికి సేంద్రియ ఇంటిపంటలపై అవగాహన కలిగించేందుకు.. జెండర్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ ఇంటిపంటలపై ‘మేనేజ్‌’ ఆవరణలో నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు.  2016 డిసెంబర్‌ నుంచి మోడల్‌ వెజిటబుల్‌ గార్డెన్, మోడల్‌ బాల్కనీ గార్డెన్‌ను పెంచుతున్నారు. అర్బన్‌ అగ్రికల్చర్‌ విభాగంలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యాననిపుణురాలు నాగరాణి ఈ నమూనా ప్రదర్శనా క్షేత్రాలను పర్యవేక్షిస్తున్నారు.

నలుగురి కుటుంబానికి (7 మీటర్ల పొడవు“7 మీటర్ల వెడల్పు) 49 చదరపు మీటర్ల పెరట్లో ఏడాది పొడవునా కుటుంబానికి సరిపోయే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని తమ అధ్యయనంలో నిర్థారణ అయ్యిందని నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ 49 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటే.. రోజుకు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూరగాయల దిగుబడి వస్తుందన్నారు. టమాటా, వంగ, మిరప, కాప్సికం, ఎర్రముల్లంగి, బీట్‌రూట్, బీన్స్, బెండ, మునగ, నేతిబీర, కాకర, క్యాబేజి తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలతోపాటు అరటి చెట్లు వేర్వేరు మడుల్లో సాగు చేస్తున్నారు. ప్రతి మడి 2 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టమాటా వంటి ఎక్కువగా వాడే కూరగాయ మొక్కలు ఎక్కువ లైన్లలో నాటుతామని నాగరాణి వివరించారు.

దశల వారీగా విత్తుకోవాలి..
ఇనుప మెష్‌తో కంచె వేసిన ఈ పెరటి తోట పెంచుతున్న భూమి అంతగా సారం లేని గ్రావెల్‌ మాదిరి భూమి కావడంతో ప్రారంభంలో 2 ట్రక్కుల ఎర్రమట్టి తోలించి, మాగిన పశువుల ఎరువు కలిపి మడులు చేశారు.
ఏడాది పొడవునా నిరంతరం కూరగాయలు అందుబాటులో ఉండాలంటే దశలవారీగా పంటలు విత్తుకోవడం లేదా మొక్కలు నాటడం చేయాలని ఆమె అన్నారు. టమాటా, మిర్చి, వంగ వంటి కూరగాయ పంటలు విత్తిన 50–60 రోజుల్లో పూత, కాపు ప్రారంభమవుతుంది. 3–4 నెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుత పంట నెలన్నరలో కాపు అయిపోతుందనగా.. మరో దఫా నారు పోసుకోవాలి లేదా విత్తుకోవాలి. 25 రోజుల నారును తీసి వరుసల్లో నాటుకోవాలి.
ప్రతి మడిలోనూ పంట మార్పిడి పాటించాలి. వేసిన పంటే మళ్లీ వేయకూడదు. పంట మార్చిన ప్రతి సారీ వర్మీకంపోస్టు , పశువుల ఎరువు కలగలిపిన మిశ్రమం కొంత వేస్తూ ఉంటే పంటలకు పోషకాల లోపం రాదు. పంటకు ప్రతి పది రోజులకోసారి సేంద్రియ ఎరువులు కొంచెం వేస్తే మంచి దిగుబడులు వస్తాయని నాగరాణి అంటారు.  

15 రోజులకోసారి జీవామృతం.. వర్మీవాష్‌..
జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి పొదుల్లో పోస్తామని నాగరాణి తెలిపారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి జీవామృతం లేదా వర్మీ వాష్‌ అదొకసారి ఇదొకసారి పిచికారీ చేస్తున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి పసుపు, నీలం రంగు జిగురు అట్టలు రెండిటిని పెరటి తోటలో పెట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కూరగాయ పంటలను  ఆశించే లద్దె పురుగును అరికట్టవచ్చు. వేసవిలో కన్నా వర్షాకాలంలో పురుగు ఉధృతి ఎక్కువ, వేసవిలో తక్కువగా ఉంటుందని నాగరాణి తెలిపారు. చీడపీడల నియంత్రణకు అవసరాన్ని బట్టి నాణ్యమైన వేప నూనె లీటరుకు 5–7 ఎం.ఎల్‌. కలిపి పిచికారీ చేస్తారు. పురుగు మరీ ఉధృతంగా ఉంటే అగ్ని అస్త్రం ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 200 ఎం.ఎల్‌. చొప్పున కలిపి పిచికారీ చేస్తామన్నారు.

మోడల్‌ బాల్కనీ గార్డెన్‌
6 మీటర్లు “ 4 మీటర్ల విస్తీర్ణంలో మోడల్‌ బాల్కనీ గార్డెన్‌ను కూడా నాగరాణి నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్‌ కుండీలు, గ్రోబాగ్స్, వర్టికల్‌ టవర్లలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు.
20% కొబ్బరిపొట్టు + 40% ఎర్రమట్టి + 20% మాగిన పశువుల ఎరువు కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వాడుతున్నట్లు నాగరాణి వివరించారు. మేకల ఎరువుకు వేడి లక్షణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మొక్కలకు వేయకూడదు. చలికాలంలో మాత్రమే మేకల ఎరువు వాడాలి. పశువుల ఎరువు ఎప్పుడైనా వాడొచ్చు.
8 అంగుళాల ఎత్తుండే పాలీ బ్యాగ్‌ ఆకుకూరల సాగుకు సరిపోతుంది. కూరగాయ మొక్కలకు 18 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్‌ వాడితేనే ఎక్కువ కాలం కాపు వస్తుంది.
30% షేడ్‌నెట్‌ హౌస్‌లో కూరగాయల ఉత్పాదకత ఆరుబయట కన్నా ఎక్కువగా వస్తుందని నాగరాణి తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వ్యాసార్థం ఉన్న గ్రోబాగ్‌లో  టమాటా మొక్కలు నాటి షేడ్‌నెట్‌ హౌస్‌లో ఉంచితే వారానికి 500–750 గ్రాముల టమాటాల దిగుబడి, 3 నెలల పాటు వస్తుందన్నారు. సాధారణ ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో 40% అధికంగా పోషకాలు లభిస్తాయని నాగరాణి (97030 83512) అంటున్నారు.   


49 చ.మీ.ల నమూనా పెరటి తోట


షేడ్‌నెట్‌ హౌస్‌లో టమాటో మొక్కలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top