breaking news
model farmers
-
నలుగురి కుటుంబానికి 49 మీటర్ల పెరటి తోట!
జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకునే యువతీ యువకులు.. ‘మేనేజ్’లో వివిధ అంశాలపై ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ ఉంటారు. వీరికి సేంద్రియ ఇంటిపంటలపై అవగాహన కలిగించేందుకు.. జెండర్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ ఇంటిపంటలపై ‘మేనేజ్’ ఆవరణలో నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్ నుంచి మోడల్ వెజిటబుల్ గార్డెన్, మోడల్ బాల్కనీ గార్డెన్‌ను పెంచుతున్నారు. అర్బన్ అగ్రికల్చర్ విభాగంలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యాననిపుణురాలు నాగరాణి ఈ నమూనా ప్రదర్శనా క్షేత్రాలను పర్యవేక్షిస్తున్నారు. నలుగురి కుటుంబానికి (7 మీటర్ల పొడవు“7 మీటర్ల వెడల్పు) 49 చదరపు మీటర్ల పెరట్లో ఏడాది పొడవునా కుటుంబానికి సరిపోయే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని తమ అధ్యయనంలో నిర్థారణ అయ్యిందని నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ 49 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటే.. రోజుకు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూరగాయల దిగుబడి వస్తుందన్నారు. టమాటా, వంగ, మిరప, కాప్సికం, ఎర్రముల్లంగి, బీట్రూట్, బీన్స్, బెండ, మునగ, నేతిబీర, కాకర, క్యాబేజి తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలతోపాటు అరటి చెట్లు వేర్వేరు మడుల్లో సాగు చేస్తున్నారు. ప్రతి మడి 2 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టమాటా వంటి ఎక్కువగా వాడే కూరగాయ మొక్కలు ఎక్కువ లైన్లలో నాటుతామని నాగరాణి వివరించారు. దశల వారీగా విత్తుకోవాలి.. ఇనుప మెష్‌తో కంచె వేసిన ఈ పెరటి తోట పెంచుతున్న భూమి అంతగా సారం లేని గ్రావెల్ మాదిరి భూమి కావడంతో ప్రారంభంలో 2 ట్రక్కుల ఎర్రమట్టి తోలించి, మాగిన పశువుల ఎరువు కలిపి మడులు చేశారు. ఏడాది పొడవునా నిరంతరం కూరగాయలు అందుబాటులో ఉండాలంటే దశలవారీగా పంటలు విత్తుకోవడం లేదా మొక్కలు నాటడం చేయాలని ఆమె అన్నారు. టమాటా, మిర్చి, వంగ వంటి కూరగాయ పంటలు విత్తిన 50–60 రోజుల్లో పూత, కాపు ప్రారంభమవుతుంది. 3–4 నెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుత పంట నెలన్నరలో కాపు అయిపోతుందనగా.. మరో దఫా నారు పోసుకోవాలి లేదా విత్తుకోవాలి. 25 రోజుల నారును తీసి వరుసల్లో నాటుకోవాలి. ప్రతి మడిలోనూ పంట మార్పిడి పాటించాలి. వేసిన పంటే మళ్లీ వేయకూడదు. పంట మార్చిన ప్రతి సారీ వర్మీకంపోస్టు , పశువుల ఎరువు కలగలిపిన మిశ్రమం కొంత వేస్తూ ఉంటే పంటలకు పోషకాల లోపం రాదు. పంటకు ప్రతి పది రోజులకోసారి సేంద్రియ ఎరువులు కొంచెం వేస్తే మంచి దిగుబడులు వస్తాయని నాగరాణి అంటారు. 15 రోజులకోసారి జీవామృతం.. వర్మీవాష్.. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి పొదుల్లో పోస్తామని నాగరాణి తెలిపారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి జీవామృతం లేదా వర్మీ వాష్ అదొకసారి ఇదొకసారి పిచికారీ చేస్తున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి పసుపు, నీలం రంగు జిగురు అట్టలు రెండిటిని పెరటి తోటలో పెట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కూరగాయ పంటలను ఆశించే లద్దె పురుగును అరికట్టవచ్చు. వేసవిలో కన్నా వర్షాకాలంలో పురుగు ఉధృతి ఎక్కువ, వేసవిలో తక్కువగా ఉంటుందని నాగరాణి తెలిపారు. చీడపీడల నియంత్రణకు అవసరాన్ని బట్టి నాణ్యమైన వేప నూనె లీటరుకు 5–7 ఎం.ఎల్. కలిపి పిచికారీ చేస్తారు. పురుగు మరీ ఉధృతంగా ఉంటే అగ్ని అస్త్రం ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 200 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తామన్నారు. మోడల్ బాల్కనీ గార్డెన్ 6 మీటర్లు “ 4 మీటర్ల విస్తీర్ణంలో మోడల్ బాల్కనీ గార్డెన్‌ను కూడా నాగరాణి నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కుండీలు, గ్రోబాగ్స్, వర్టికల్ టవర్లలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. 20% కొబ్బరిపొట్టు + 40% ఎర్రమట్టి + 20% మాగిన పశువుల ఎరువు కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వాడుతున్నట్లు నాగరాణి వివరించారు. మేకల ఎరువుకు వేడి లక్షణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మొక్కలకు వేయకూడదు. చలికాలంలో మాత్రమే మేకల ఎరువు వాడాలి. పశువుల ఎరువు ఎప్పుడైనా వాడొచ్చు. 8 అంగుళాల ఎత్తుండే పాలీ బ్యాగ్ ఆకుకూరల సాగుకు సరిపోతుంది. కూరగాయ మొక్కలకు 18 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్ వాడితేనే ఎక్కువ కాలం కాపు వస్తుంది. 30% షేడ్‌నెట్ హౌస్‌లో కూరగాయల ఉత్పాదకత ఆరుబయట కన్నా ఎక్కువగా వస్తుందని నాగరాణి తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వ్యాసార్థం ఉన్న గ్రోబాగ్‌లో టమాటా మొక్కలు నాటి షేడ్‌నెట్ హౌస్‌లో ఉంచితే వారానికి 500–750 గ్రాముల టమాటాల దిగుబడి, 3 నెలల పాటు వస్తుందన్నారు. సాధారణ ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో 40% అధికంగా పోషకాలు లభిస్తాయని నాగరాణి (97030 83512) అంటున్నారు. 49 చ.మీ.ల నమూనా పెరటి తోట షేడ్‌నెట్ హౌస్‌లో టమాటో మొక్కలు -
ఆదర్శ రైతులను నిలదీసిన రైతులు
సిద్దిపేట రూరల్ : మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఆదర్శరైతులు వినియోగించుకున్నారని ఆరోపిస్తూ మూడు రోజులుగా మండలంలో ని తోర్నాల గ్రామ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఏఈఓ హనుమంతరెడ్డి లు కలిసి గ్రామ పంచాయతీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదర్శ రైతులు రిక్కల రాజిరెడ్డి, గడ్డం రాజులను అధికారులు పిలిపించారు. వారు రాగానే రైతులు మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ లెక్కలు చూపాలని ఆదర్శ రైతులను నిలదీశారు. దీంతో ఆదర్శ రైతు రాజిరెడ్డి వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ప్రసన్న కుమార్, ఎస్ఐ రాజేంద్రప్రసాద్‌లు సిబ్బందితో గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొక్కజొన్న పంట ఇన్సూరెన్స్‌కు సంబంధిం చిన రైతుల పేర్ల రికార్డు పోయిందన్నారు. రైతులు కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంక్‌లో తక్కువ కట్టినట్లు రాజిరెడ్డి ఒప్పుకున్నారు. రికార్డు బుధవారం సాయంత్రంలోగా గ్రామ పంచాయతీలో అ ప్పగిస్తానని, తరువాత పంచాయతీ వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. పంట నష్టపోతే ప్రభుత్వం ఎంత ఇన్సూరెన్స్ చెల్లిస్తుందో ఆదర్శరైతులు కూడా తమకు అంతే మొత్తం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతుల వాదనకు కట్టుబడి ఆదర్శరైతులు ఉండాలని లేని పక్షంలో వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఏఓ మాట్లాడుతూ గ్రామంలో 373 మం ది రైతులు మొక్కజొన్న పంటకు ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు, బ్యాంక్‌లో రూ. 1.30 లక్షలు బ్యాంక్‌లో డీడీల రూపంలో చెల్లించినట్లు జాబితాలో ఉందన్నారు. సమావేశంలో సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు. -
ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఆదర్శ రైతు వ్యవస్థను రద్దుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆ వ్యవస్థ స్థానే సాంకేతికంగా అర్హులైన సహాయ వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అవసరాలు తీర్చాలని సూచించింది. వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో డిప్లొమా చదివిన వారిని నియమించి రైతులకు అవసరమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరింది. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వుతో రాష్ట్రంలోని 16,841 మంది ఆదర్శ రైతులను తొలగించినట్లయింది.