
తిరుగులేని ఫ్యాన్
పెరిగిన పోలింగ్ శాతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టో.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమ ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పెరిగిన పోలింగ్ శాతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టో.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమ ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి ఉద్ధృతంగా వీచినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 30,56,867 కాగా.. బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో 22,55,975 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం దాదాపు నెల రోజుల ముందు నుంచే ఓటరు చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది.
ఇందుకోసం లక్షలాది రూపాయలను వ్యయం చేశారు. అయితే 2009 ఎన్నికలతో పోలిస్తే కేవలం 3.79 శాతం మాత్రమే పోలింగ్ పెరగడం గమనార్హం. 2009 ఎన్నికల్లో 70.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ విడత 74 శాతం నమోదైంది. జిల్లా అంతటా ఫ్యాన్ గాలి నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. యువత.. మహిళలు.. రైతులు అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడంతో వైఎస్‌ఆర్‌సీపీ విజయం నల్లేరుపై నడకేననే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ శాతం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. కర్నూలులో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం ఎన్ని రకాలుగా శ్రమించినా.. అసంతృప్తే మిగిలింది. 2009లో ఇక్కడ 52.71 శాతం పోలింగ్ నమోదవగా.. ఈ ఎన్నికల్లో 58.11 శాతానికి మాత్రమే చేరుకోగలిగారు. కర్నూలులో ముస్లింలు భారీగా పోలింగ్‌కు తరలిరావడాన్ని పరిశీలిస్తే వైఎస్సార్సీపీ విజయం ఖాయమనే సంకేతాలిస్తోంది. కర్నూలులో 18 నుంచి 25 ఏళ్లలోపు యువత ఓటింగ్‌కు తరలిరావడం కూడా వైఎస్సార్సీపీకి అనుకూలం కానుంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల, బనగానపల్లె నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొనడం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పట్ల ప్రేమాభిమానాలకు నిదర్శనం.
నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరుల్లో పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 22,55,975 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో పురుషులు 11,40,336.. స్త్రీలు 11,17,619, ఇతరులు 20 మంది ఉన్నారు. పురుషుల్లో 75 శాతం మంది, మహిళల్లో 72.76 శాతం, ఇతరుల్లో 5.01 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పోలింగ్ రోజున వాతావరణం చల్లగా ఉండడం.. గురువారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడం రాజన్న పాలన మొదలైందనేందుకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమైంది.