ఏరుదాటాక... | Sakshi
Sakshi News home page

ఏరుదాటాక...

Published Mon, Apr 21 2014 1:05 AM

TDP new Candidates Party Tickets

సాక్షి, గుంటూరు: ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా అవసరమైనప్పుడు తమను వాడుకుని ఎన్నికలు వచ్చేసరికి పక్కన పెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆస్తులమ్ముకుని మరీ బలోపేతాని కృషిచేసిన తమను కూరలో కరివేపాకులా తీసేశారని పార్టీ అధినేత చంద్రబాబుపై జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌చార్జి చిరుమామిళ్ల మధుబాబు టికెట్టు ఆశించి భంగపడ్డారు. 2012 ఉప ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎవరూ పోటీకి రాకపోవడంతో 2014 ఎన్నికల్లో సైతం టిక్కెట్టు ఇస్తామంటూ నమ్మబలికి మధుబాబుతో ఉప ఎన్నికల్లో పోటీ చేయించి కోట్లు ఖర్చు చేయించారు.
 
 తీరా 2014 ఎన్నికల్లో టికెట్టు అడిగితే సామాజిక సమీకరణల పేరుతో ఆయనను పక్కన పెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మధుబాబు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు.     సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ సైతం గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, 2009 ఎన్నికల్లో పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి అధిక మొత్తంలో ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్టు ఇవ్వకుండా నరసరావుపేటకు చెందిన మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావుకు టికెట్టు కేటాయించారు. దీంతో ఆవేదన చెందిన రాజనారాయణ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
 
     గుంటూరుకు చెందిన బీసీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్ కూడా అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ గుంటూరు వెస్ట్ టికెట్టు ఆశించారు. నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఇక్కడ సీటిచ్చి ఆయనకు మాచర్ల టికెట్టు కేటాయించారు. తాను మాచర్లలో పోటీ చేయలేనని తనకు మంగళగిరి టికెట్టు కేటాయించమని అడిగినా అధినేత పట్టించుకోకపోవడంతో గుంటూరు పార్లమెంటు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఎన్నికల్లో తాను సత్తెనపల్లికి వెళ్లి నీకు నరసరావుపేట టికెట్ ఇప్పిస్తానంటూ మాజీమంత్రి కోడెల ఆశచూపి నరసరావుపేటకు చెందిన బీసీ నాయకులు సింహాద్రి యాదవ్‌తో అధిక మొత్తంలో ఖర్చు చేయించారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి అదికాస్తా మరిచిన కోడెల తాను మాత్రం సత్తెనపల్లికి వె ళ్లి నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంలో కీలకపాత్ర పోషించారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న సింహాద్రియాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
 
     {పత్తిపాడు నుంచి కందుకూరు వీరయ్య, గుంటూరు వెస్ట్ నుంచి మిన్నెకంటి జయశ్రీ, మంగళగిరి నుంచి అంకవరప్రసాద్ కూడా పార్టీ కోసం కష్టపడి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం వీరిని గుర్తించకుండా కొత్త అభ్యర్థులకు టికెట్టు ఇవ్వడంతో వీరు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వీరు ముగ్గురు టీడీపీ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన బెట్టి ఆర్థికంగా బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement