పాపన్నపేట దేశం కోట బీటలు వారుతోంది. స్థానిక సమరం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఎన్నికల యుద్ధానికి ముందే కొంత మంది అభ్యర్థులు అస్త్ర సన్యాసం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
పాపన్నపేట,న్యూస్‌లైన్:
పాపన్నపేట దేశం కోట బీటలు వారుతోంది. స్థానిక సమరం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఎన్నికల యుద్ధానికి ముందే కొంత మంది అభ్యర్థులు అస్త్ర సన్యాసం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
గెలుపుపై అపనమ్మకంతో టీఆర్‌ఎస్‌లో చేరి కొందరు..మద్దతిస్తూ మరి కొందరు.. రాజకీయ పదవులు పొందేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో పాపన్నపేట మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మరికొంత మంది మాత్రం టీడీపీలోనే ఉంటూ ఎంపీటీసీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న స్థానాల్లో నామినేషన్లు ఉపసంహరించుకుని, టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఎంపీపీ పదవిపై ఆశతో అటు జెడ్పీటీసీకి, ఇటు ఎంపీటీసీకి టీడీపీ తరఫున నామినేషన్ వేయించిన ఓ కీలక నేత ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు గులాబీ నేతలతో మంతనాలాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో కొత్తపల్లికి చెందిన కుల నేత, సొసైటీ బాధ్యులు, మూడు నాలుగు గ్రామాలకు చెందిన టీడీపీ సర్పంచ్‌లు, కార్యకర్తలు సొంత పార్టీకి పంచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఓ మండల స్థాయి టీడీపీ నేత టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు పార్టీలోనే ఉంటూ ఎంపీటీసీ అభ్యర్థుల్లో బలహీనమైన అభ్యర్థులను రంగం నుంచి తప్పించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
పార్టీ వీడినా.. వారు గతంలో తమ మిత్రులే కాబట్టి, వారే మండల పరిషత్ అధ్యక్ష పదవి చేపట్టేలా చూడాలని వీరు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి ఒక్క ఎంపీటీసీ స్థానం నుంచి కూడా నామినేషన్ వేయక పోగా, మరో రెండు స్ధానాల నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అన్నింటికన్నా ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమిటంటే జెడ్పీటీసీకి,ఎంపీటీసీ స్థానానికి తన కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించిన టీడీపీకి చెందిన ఓ కీలక నేత టీఆర్‌ఎస్‌లోకి మారితే , టీడిపికి జెడ్పీటీసీ అభ్యర్థే ఉండని పరిస్థితి నెలకొని ఉంది.