కుమ్ములాటల్లో సైకిల్


సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పుడు సైకిల్ స్పీడ్‌కు బ్రేక్‌లు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం తీరుపై అసంతృప్తి, వర్గవిభేదాలు తదితర అంశాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుండడంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థే గెలుపొందారు. రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

 

 పరసా వెంకటరత్నయ్య నాలుగు సార్లు టికెట్ సాధించుకుని మూడు మార్లు గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకే టీడీపీ టికెట్ మళ్లీ లభించింది. దంతో ఆ పార్టీలోని వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.   మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో పారిశ్రామిక వేత్త కొండేపాటి గంగాప్రసాద్, పార్టీ రాష్ట్ర నేత వేనాటి రామచంద్రారెడ్డి వర్గాల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

 

 ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పార్టీ టికెట్ ఇస్తే పరసాకు ఇవ్వాలని, లేని పక్షంలో డాక్టర్ సందీప్ పేరు పరిశీలించాలని వేనాటి వర్గీయులు పట్టుబట్టారు. కొండేపాటి మాత్రం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లేదా పిట్ల సుహాసినికి ఇవ్వాలని ప్రతిపాదించారు.

 

 ఈ పంచాయితీలో చంద్రబాబునాయుడు చివరకు పరసా వైపే మొగ్గారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. పరసా అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేని కొండేపాటి వర్గం పార్టీకి దూరంగా ఉంటోంది. అలిగిన నేతలను బుజ్జగించేందుకు వేనాటి రామచంద్రారెడ్డి, పరసా వెంకటరత్నం ఆపసోపాలు పడుతున్నా ఫలితం కరువవుతోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పులికాట్ కుప్పాల్లోని మత్స్యకారులు కూడా పరసా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

 

 కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి

 ఎంపీ చింతా ఆశీస్సులతో కాంగ్రెస్ టికెట్‌ను సాధించుకున్న దూర్తాటి మధుసూదన్‌రావుకు ఆ పార్టీ నేతల అండ కరువైంది. ఆయనకు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయపాలకమండలి చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి వర్గీయులు దూరంగా ఉంటున్నారు. నామినేషన్‌కు ఎవరూ రాలేదు. చింతా మాత్రమే దగ్గరుండి నామినేషన్ వేయించారు. పెపైచ్చు చింతా పేరు ఎత్తితేనే పులికాట్ జాలర్లు మండిపడుతున్నారు. దుగరాజపట్నం ఓడరేవు పేరుతో పులికాట్ సరస్సునే లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తుండడంతో జాలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చింతా వర్గీయుడైన దూర్తాటిపైనా వారి ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ మాత్రం రాజకీయాలకు కొత్తవ్యక్తి, ఉన్నత విద్యావంతుడైన కిలివేటి సంజీవయ్యకు అవకాశం ఇచ్చింది. పార్టీ మేనిఫెస్టోను ఆయన నియోజకవర్గంలోని గడపగడపకూ తీసుకెళుతూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top