కొలువుజేయనీకి కొడుకు లేడాయె.. | Sakshi
Sakshi News home page

కొలువుజేయనీకి కొడుకు లేడాయె..

Published Thu, Apr 3 2014 1:38 AM

కొలువుజేయనీకి కొడుకు లేడాయె.. - Sakshi

అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు.  తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు.
 - యాదలక్ష్మి, బాషిపాక భాస్కర్ తల్లి,
 గవిచర్ల, సంగెం మండలం, వరంగల్ జిల్లా

 
 ‘సొంతంగ రాష్ట్రమొస్తే...కొలువులొస్తయే. మన కష్టాలన్నీదీర్తయే....’ అని చెప్పేటేడు. ఇయ్యాల రాష్ట్రమచ్చింది, కొలువు జేయనీకి నాకు కొడుకు లేడాయె. తెలంగాణ రాష్ర్టమచ్చిందని టీవీల్ల జెప్పంగనే నా కొడుకు ఫోట్వ దగ్గరకిబోయి ‘బిడ్డా...తెలంగాణ రాష్ర్టమచ్చిందే, నువ్వు... సావకుంటే రాకపోవునా...’ అని వాళ్ల నాయన అన్నమాటలకు నాకు గుండెంతా పగిలినట్టయింది. ఏం జేస్తం... పేదోళ్లం కదా! ఉద్యమం చేసే స్థోమత లేనోళ్లం. ఇద్దరాడివిల్లలు, ఒక కొడుకు. మగపిల్లగాడు... మాలెక్క కూలీనాలీ చేసుకోకుండా కొలువు జేయాలని కష్టపడి చదివించినం. రోజు పొద్దుగాలే కాలేజీకి పోతుంటే కళ్లనిండా సూస్కొని మురిసేటోళ్లం. పెద్దగయినంక మంచి కొలువు చేసి మమ్మల్ని సాదుతడనుకున్నం.
 
 ఉద్యమం కోసం సచ్చిపోయేటళ్లను టీవీల్ల జూసి ‘అమ్మా సూడే... వాళ్లు మన తెలంగాణ రాష్ర్టం కోసం పాణం తీసుకుంటుండ్రు. ఎంత గొప్పోళ్లే వాళ్లు...’ అనేటోడు. ఒకరోజు పొద్దుగాల ఎవరో ఒకాయనొచ్చి ‘మీ కొడుకు యిసం మింగి సచ్చిపోయిండు’ అని జెప్పిండు. పాయింటు జేబుల ఒక పేపర్ మీద ఉద్యమం కోసమే సచ్చిపోతున్న అని రాసిండంట. అది సదవనీకి మా ఇంట్ల ఎవ్వరికీ సదువు రాదాయె. బిడ్డ రాసిన అచ్చరాలను చూసి ఎక్కి ఎక్కి ఏడ్సుడు తప్ప ఇంకేం మిగల్లే. ఎవరైనా ‘భాస్కర్’ అని పిలిస్తే ఇగంతే... వాళ్లనాయనకు ఏడుపాగదు. వాడు జెప్పినట్లు పేదోళ్ల కష్టాలు తీరాలే. కొలువులొక్కటే కాదు, పోరగాళ్లకు సదువు జెప్పీయలేక, పెండ్లి చేయలేక యాష్టపడేటోళ్ల కష్టం ఇనేటోళ్లు కావాలే.
 - సేకరణ: భువనేశ్వరి, సాక్షి, హైదరాబాద్

Advertisement
 
Advertisement
 
Advertisement