స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన విధానాలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన విధానాలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో కలిసి నగరంలోని 47, 49, ఒకటో డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నుంచి ఓటమి భయంతో మూడేళ్ల పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సుమారు రూ. 2,500 కోట్ల నిధులు మురిగిపోయాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను తీసుకువచ్చి నగర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆళ్ల నాని మాట్లాడుతూ గతంలో తమ బాగోగులు చూసుకోవడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నాడన్న భరోసా ప్రజల్లో ఉండేదన్నారు. ఆయన మరణానంతరం అది పోయింద న్నారు. ఇపుడు రాష్ట్ర ప్రజలకు తానున్నానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారన్నారు. మరో నెలా పదిహేను రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు.
పార్టీ అభ్యర్ధులు బేతపూడి ముఖర్జీ, కోట వరలక్ష్మి, అహ్మదున్నీసాలను గెలిపించాలని ప్రజలను కోరారు. పిట్లా రమణమ్మ, కొత్తపల్లి రాణి, జనపరెడ్డి కృష్ణ, జనపరెడ్డి లక్ష్మణరావు, కోట రవి, కిర్తి శేషు, చిట్టిబొమ్మ పవన్, కె రాజేష్, మోర్త రంగారావు, దిరిశాల వరప్రసాద్ పాల్గొన్నారు.