మధుకాన్ అంటే మోసం | jairam ramesh talks on nama nageswar rao | Sakshi
Sakshi News home page

మధుకాన్ అంటే మోసం

Apr 23 2014 2:18 AM | Updated on Aug 10 2018 8:06 PM

మధుకాన్ అంటే మోసం - Sakshi

మధుకాన్ అంటే మోసం

‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

  •  నామా ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకుని కట్టకుండా పారిపోతాడు
  •  జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం నేనే చాలాసార్లు ఫోన్ చేశాను
  •  పోలవరం నిర్వాసితులెవరినీ బలవంతంగా ఖాళీ చేయించం
  •  బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మరోచోట మైనింగ్ వర్శిటీ ఏర్పాటు చేస్తాం
  •  విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్
  •  సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మధుకాన్ అధినేత నామా నాగేశ్వరరావు చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడతానని కాంట్రాక్టులు తీసుకుని.. కట్టకుండా పారిపోతుంటాడని ఆయన అన్నారు.
     
    మంగళవారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జైరాంరమేశ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామా ప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం తానే చాలా సార్లు నామాకు ఫోన్‌చేశానని, 10 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి హైవే పని పూర్తిచేయాలని కోరానని, అయినా నామా ప్రాజెక్టులు కట్టడని అన్నారు.

    జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఉక్కుగా చేసేందుకు స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరునెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను తయారుచేస్తామని, ఆ తర్వాత  పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే జిల్లాకు చెందిన 45వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు.
     
     బలవంతంగా ఎవరిని ఒక ప్రాంతం నుంచి తరలించబోమని, అందరి ఆమోదం మేరకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. వీరందరికీ నూతన పాలసీ ప్రకారం పునరావాసం కల్పించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని చెప్పారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలిపామని, అయితే, 1959కి ముందు కూడా భద్రాచలం డివిజన్ కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, ఇప్పుడు తాము కొత్తగా చేస్తున్నదేమీ లేదని అన్నారు. 

    పోలవరం కారణంగా ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి గ్రామాలను సీమాంధ్రలో కలిపే అంశం మాత్రమే బిల్లులో ఉందని, కానీ మండలాలను కలిపే అంశంలో మాత్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉందని, కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం దీనిని తీసుకువస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం క్లియర్‌చేసిందని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసే అంశం సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినదని అన్నారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఖమ్మం జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
     
     ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు ఓ స్వప్నాన్ని ఆవిష్కరించారని, ఆ స్వప్నం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ లాగే బీసీలకు, మైనార్టీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో  రాజ్యసభ సభ్యురాలు  రేణుకాచౌదరి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్‌చార్జి జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌యాదవ్, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళీ కష్ణ, వీవీ అప్పారావు, పులిపాటి వెంకయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement