మా పార్టీ ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోంది. మా మేనిఫెస్టో గురించి వినాలనుకుంటున్నారా.. అయితే ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వండి చాలు అంటూ మొబైల్‌లకు మెసేజ్‌లు
మొబైల్స్‌ను ముంచెత్తుతున్న ఎస్‌ఎంఎస్ ప్రచారాలు
సాక్షి, రాజమండ్రి:మా పార్టీ ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోంది. మా మేనిఫెస్టో గురించి వినాలనుకుంటున్నారా.. అయితే ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వండి చాలు అంటూ మొబైల్‌లకు మెసేజ్‌లు వచ్చి పడుతున్నాయి. లేదా.. మీకు ఫలాన అభ్యర్థి నచ్చితే ఒకటి నొక్కండి లేదంటే సున్నా నొక్కండి.. అంటూ కాల్‌లు.. ఇలా జనం జేబులో బుల్లి మొబైల్‌కు ఖాళీ ఉండడంలేదు. ఒక్కొక్కరికి ఒక్కోసారి రోజుకు రెండు మూడు సార్లు ఇలాంటి మెసేజ్‌లు, కాల్స్‌లు వచ్చి పడుతున్నాయి. సగం మంది మెసేజ్‌లు స్వీకరించి బదులిచ్చేందుకు నిరాకరిస్తుండగా కొందరు మాత్రం కథేంటో చూద్దాం అంటూ రిప్లై ఇస్తున్నారు.
త్వరగా చేరుతుందని
సోషల్ నెటవర్క్ ప్రచారం కొద్ది మందికి మాత్రమే పరిమితం అయింది. టీవీల్లో యాడ్‌లు ఇస్తే ఆ సమయంలో టీవీ చూస్తున్న వారికే చేరుతుంది. మొబైల్‌లో మెసేజ్ ఇస్తే అందరూ చూస్తారు. తమ వర్తమానానికి జవాబు ఇవ్వక పోయినా పార్టీ పేరు కనిపిస్తుంది. అది చాలు సగం సందేశం అందినట్టేనని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో మొబైల్ ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలు. ప్రధానంగా ఉద్యోగులు, యువకులను టార్గెట్ చేసుకుని ఈ హైటెక్ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, మోడీ ఫర్ పీఎం, బాబు అభ్యర్థుల ఎంపిక... తరహా ప్రచారాలు మొబైల్ ఆధారంగా ఎక్కువగా సాగుతున్నాయి.
ఈ ఎన్నికలు విభిన్నం
వీధీవాడా హోరెత్తించే విధంగా చేపట్టే ఎన్నికల ప్రచారాలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. దీంతో ఓటరును తమ వైపునకు ఆకట్టుకునేందుకు పార్టీలు హైటెక్ పద్ధతులను వెతుక్కుంటున్నాయి. ముందుగా సోషల్ మీడియాను వినియోగించడం ప్రారంభించారు. కానీ ఈ విధానంలో వారి సందేశం చదువుకున్న యువతకు మాత్రమే అందుతోంది. మొబైల్ ఫోను పేద మధ్యతరగతి వర్గాలకు సైతం నిత్యావసరంగా మారిపోవడంతో 2014 ఎన్నికల్లో మొబైల్ ఫోన్‌లు ప్రధాన ప్రచార సాధనాలుగా మారిపోయాయి.
అడిగారు తప్ప ఆచరించారా ?
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘మీరు అభ్యర్థిగా ఎవరు కావాలనుకుంటున్నారు’ అంటూ ఫోన్‌లు చేసి అడిగారు. తీరా టిక్కెట్లు ఇచ్చాక మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవని పలువురు అంటుండడం విశేషం