ఓటమికి నాదే పూర్తి బాధ్యత: రఘువీరా | Sakshi
Sakshi News home page

ఓటమికి నాదే పూర్తి బాధ్యత: రఘువీరా

Published Sat, May 17 2014 2:43 AM

ఓటమికి నాదే పూర్తి బాధ్యత: రఘువీరా - Sakshi

 సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలిసీ ఈ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఇందిరాభవన్లో పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రుద్రరాజుపద్మరాజు, తదితరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి చట్టంలో, పార్లమెంటులో ప్రభుత్వం చేసిన ప్రకటనలను అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం లేకపోయినా మండలిలో తమ సభ్యులుంటారని గుర్తుచేశారు. పదేళ్లుగా కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ ఫలితాలతో తాను ఏ విధమైన ఆందోళన చెందడం లేదని, పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన పడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. కేవలం చట్టసభల్లో, ప్రభుత్వంలో ఉండి పరిపాలన అందించడమే రాజకీయం కాదని, ప్రభుత్వంలో లేకున్నా ప్రజలకు సేవలందించడమే అసలైన రాజకీయమని తెలిపారు. రాష్ట్ర నిర్మాణం, కాంగ్రెస్ పునర్నిర్మాణమే తమ ప్రాధాన్యాలన్నారు. పార్టీ ఓటమికి రాష్ట్ర విభజన కూడా ఒక కారణమని ఆయన అంగీకరించారు.

Advertisement
Advertisement