‘గజ్వేల్’ గెలుపు హరీష్‌రావు చలువే! | behind of kcr victory there is harish rao | Sakshi
Sakshi News home page

‘గజ్వేల్’ గెలుపు హరీష్‌రావు చలువే!

May 16 2014 11:30 PM | Updated on Aug 15 2018 9:06 PM

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తొలి ప్రయత్నం ఫలించింది. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పొత్తుల కారణంగా టీఆర్‌ఎస్ నేరుగా పోటీ చేయలేదు.

 గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తొలి ప్రయత్నం ఫలించింది. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పొత్తుల కారణంగా టీఆర్‌ఎస్ నేరుగా పోటీ చేయలేదు. తొలిసారిగా ఈ నియోజకవర్గం నుంచే కేసీఆరే సిద్ధపడటంతో... ఆయన గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న హరీష్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల నాటి నుంచే ప్రధానంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, గజ్వేల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డితోఆయన సోదరుడు, జిల్లా సాక్షర భారత్ కమిటీ సభ్యుడు గోపాల్‌రెడ్డి, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాలకు చెందిన మరికొందరు ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి వలసలను హరీష్‌రావు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వరకు కొనసాగించారు. టీడీపీకి చెందిన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, వర్గల్ మండల అధ్యక్షుడు యాదగిరిగౌడ్, తూప్రాన్ సర్పంచ్ శివ్వమ్మ తదితర ముఖ్యనేతలను ఆయన పార్టీలోకి ఆహ్వానించి టీఆర్‌ఎస్‌కు కొత్త బలాన్ని తీసుకువచ్చారు.

 అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు ఇన్‌చార్జ్‌లను నియమించి వారి అధ్వర్యంలో పకడ్బందీగా ప్రచారం చేశారు. అంతే కాకుండా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లక్ష్మీకాంతారావు రంగంలోకి దిగి కేసీఆర్ గెలుపునకు మంత్రాంగం నడిపారు. 2009కు పూర్వం గజ్వేల్ టీడీపీలో ‘కింగ్‌మేకర్’ ఉన్న ఆయన తన అనుచరులను ఏకతాటిపైకి తీసుకురావడం, మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు తదితర నాయకులు పార్టీలో చేరడం పార్టీ అభ్యర్థి గెలుపునకు దోహదపడింది. గజ్వేల్ నగర పంచాయతీ, నియోజకవర్గంలోని ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోయినా కేసీఆర్ వ్యక్తిగత ఆకర్షణతో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్ఫలితాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement